తెలంగాణ

వేలల్లో ఎండుతున్న మొక్కలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 18: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు పది రోజుల తిరగకముందే ఎండిపోతుండడం ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యాలకు అవరోధంగా మారింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లి వద్ద మొక్క నాటి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వెంట హరితహారాన్ని ప్రారంభించారు. ఇదే సమయానికి జిల్లా పరిధిలోని తూప్రాన్‌పేట నుండి కోదాడ మండలం నల్లబండ వరకు 153 కిలోమీటర్ల మేరకు రికార్డు స్థాయిలో ఒకేరోజు 87 వేల మొక్కలు నాటారు. ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్‌వాడీలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులంతా పోటీలు పడి మరీ మొక్కలు నాటారు. అయితే నాటిన మొక్కలకు నీరు పోసే దిక్కులేక, మొక్కలు నాటడంలో విద్యార్థుల అవగాహన లేమి, ఇతరుల నిర్లక్ష్యధోరణితో మొక్కకు ఉన్న ప్లాస్టిక్ కవర్‌తోటే మొక్కను గుంతలో వేసి అరకొరగా పూడ్చడం, నేల ప్రతికూల స్వభావం, వర్షాలు పడకపోవడం, ఊష్ణోగ్రతలు తగ్గకపోవడం వంటి కారణాలతో వేల సంఖ్యలో మొక్కలు ఎండిపోతూ దర్శనమిస్తున్నాయి. మొక్కలు నాటినప్పటికీ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలను అటు నాటిన వారుగానీ, ఇటు నాటించిన ప్రభుత్వంగానీ, అధికారులుగానీ తీసుకోకపోవడంతో ‘దిక్కులేని అనాధలుగా మారిన జాతీయ రహదారి రికార్డు మొక్కలు’ అర్ధంతరంగా జీవితాన్ని చాలించేస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ-జాతీయ రహదారి వెంట ఎక్కడ చూసినా ఎండిన మొక్కలు, కవర్లతో సగం మట్టి కప్పిన మొక్కలు, వేర్లు తేలి ఎండిన మొక్కలే వేలాదిగా దర్శనమిస్తున్న తీరు హరితహారం అమలులో ప్రణాళిక లేమికి దర్పణం పడుతోంది.
కోదాడ మండలం దుర్గాపురం, చౌటుప్పల్ మండలం లక్కారం-మల్కాపురం, చిట్యాల-నార్కట్‌పల్లి, చిట్యాల-చౌటుప్పల్, కట్టంగూర్-సూర్యాపేట మధ్య పలుచోట్ల రహదారి వెంట ఎండిన మొక్కలు ఆ దారిలో వెళ్లే వారికి కనిపిస్తున్నాయి. ఇలాగైతే జాతీయ రహదారికి హరితహారం సొగసుల సంగతేమోగాని నర్సరీల్లో మొక్కలు పెంచి, నాటేందుకు చేసిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైనట్లేనంటూ వాపోతున్నారు. జిల్లాలో సోమవారం సాయంత్రం నాటికి 59 మండలాలు, ఏడు మున్సిపాల్టీల పరిధిలో కోటి ఒక లక్షా 17 వేల మొక్కలు నాటారు. ఈ సీజన్‌లో 4 కోట్ల 72 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కరువైన వానలు..సంరక్షణ చర్యలు..!
హరితహారం ప్రారంభం రోజున జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి నాటిన మొక్కల సంరక్షణకు ఫైరింజన్లతో నీళ్లు పోయిస్తామన్నారు. అటవీశాఖతో పాటు పలు సంస్థల సహకారంతో మొక్కల చుట్టూ కంచె ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జాతీయ రహదారి వెంట హరితహారం మొక్కల సంరక్షణకు పర్యవేక్షణాధికారులను నియమిస్తామని, రోడ్డు వెంట వారి సెల్‌ఫోన్ నెంబర్లు రాయిస్తామన్నారు. ఈ దిశగా నేటికీ చర్యలు తీసుకోకపోగా వర్షాలు లేక నాటిన మొక్కలు ఇప్పటికే వేలల్లో చనిపోయాయి. హెచ్‌ఎండిఏ, ఫైరింజన్ సిబ్బంది జాతీయ రహదారి వెంట లక్కారం-మల్కాపురం ప్రాంతంలో ఎండిన మొక్కలకే నీళ్లు పోస్తున్నారు. అవి ఇప్పటికే చనిపోయి ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా సీరియల్‌గా రోడ్డు వెంట బతికివున్న మొక్కకు, చనిపోయిన మొక్కలకు కూడా నీళ్లు పోస్తూ వెళ్తున్నారు. మొక్కలు ఎండిపోతున్న వైనంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హెచ్‌ఎండిఏ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో సరిగా నాటని మొక్కలను, కవర్లతో నాటిన మొక్కలను, ఎండిన మొక్కలను తొలగించి కొత్త మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా జిల్లాలో ఒకవైపు జాతీయ రహదారి వెంట హరితహారం మొక్కలు వర్షాలు లేక ఎండిపోతుండగానే ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా హరితహారం ఉద్యమంలా కొనసాగుతూనే ఉండడం గమనార్హం. పల్లె, పట్టణం తేడా లేకుండా అంతటా సాగుతున్న హరితహారంలో నాటుతున్న మొక్కల్లో పెరిచి చెట్లయి వానాలు తెచ్చేవి ఎన్నో జాతీయ రహదారి రికార్డు మొక్కల దుస్థితి చూస్తే అర్ధమవుతుందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

చిత్రాలు.. హరిత హారంలో భాగంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వెంట నాటిన మొక్కలు రెండు వరుసల్లోనూ ఎండిపోయన దృశ్యం * జాతీయ రహదారి వెంట కోదాడ మండలం దుర్గాపురం వద్ద వరుసగా నాటిన మొక్కలన్నీ ఎండిన దృశ్యం