తెలంగాణ

అమాత్యులకు గండం లేనట్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైనా తేడా వస్తే మంత్రి పదవులు ఊడుతాయంటూ టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన హెచ్చరికతో మంత్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఒక్క పార్లమెంట్ ఎన్నికల్లో మినహా మిగతా పంచాయతీ, పరిషత్, జిల్లా పరిషత్ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించింది. తాజాగా మున్సిపల్ ఎన్నికలు రావడంతో గతం లో జరిగిన ఎన్నికల మాదిరిగా అన్ని స్థానాలను గెలుచుకోవడానికి మంత్రు లు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నారు. సీఎం చేసిన హెచ్చరిక రెండువైపులా పదునున్న కత్తిగా పరిణమించింది. మంత్రులు తమ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకోవడం ద్వారా తమ పదవిని పదిలపరుచుకోవడం కత్తికి ఒకవైపు కాగా, మరోవైపు ఈ ఎన్నికల్లో పార్టీని ఓడిస్తే ప్రస్తుత మంత్రిని పక్కకు తప్పిస్తే తమకు అవకాశం దక్కుతుందన్న లాజిక్కుతో సొంత పార్టీవారే వెన్నుపోటు పొడిచే అవకాశం లేకపోలేదన్న భయాందోళనలు కూడా వారిలో నెలకొన్నాయి. ఇలాఉండగా జిల్లాల విభజన వల్ల మెజారిటీ మంత్రుల పదవి గండం తప్పిందనే చెప్పవచ్చు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలకు కాకుండా కేవలం తమ జిల్లాల్లో గెలిస్తే చాలని మంత్రులు భావిస్తున్నారు. మున్సిపాలిటీలను గెలుచుకోవడం మంత్రులకు పెద్ద కష్టమేమీ కాదు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల కాలపరిమితి ఉండడంతో ప్రజలు పాలక పక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయరని మంత్రులు ధీమాగా ఉన్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్ర మే నగర ప్రాంత ప్రజలు ఎటువైపు మొగ్గు
చూపుతారోనన్న భయం మాత్రం ఇద్దరు ముగ్గురు మంత్రులకు పట్టుకుంది. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల పరిధిలో ముగ్గురికి మాత్రమే కార్పొరేషన్లు ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహించే జిల్లా పరిధిలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిధిలో మీర్‌పేట, బడంగిపేట, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్లు, మంత్రి మల్లారెడ్డి పరిధిలో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట కార్పొరేషన్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా పరిధిలోనూ ఆ నగర కార్పొరేషన్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించేవారు మంత్రివర్గంలో ఎవరూ లేరు. ఖమ్మం కార్పొరేషన్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట కార్పొరేషన్‌కు ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. ఇక మిగతా మంత్రుల పరిధిలో మున్సిపాలిటీలు ఉన్నాయి తప్ప కార్పొరేషన్లు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో గజ్వేల్, మంత్రి కేటీఆర్ పరిధిలో సిరిసిల్ల, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిధిలో మహబూబ్‌నగర్, మంత్రి నిరంజన్‌రెడ్డి పరిధిలో వనపర్తి, పెబ్బేర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిధిలో ధర్మపురి, మంత్రి ఈటల రాజేందర్ పరిధిలో జమ్మికుంట, హుజూరాబాద్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి పరిధిలో భీంగల్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిధిలో నిర్మల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. చాలామటుకు మంత్రులు ప్రాతినిధ్యం వహించే పట్టణాలే మున్సిపాలిటీలుగా ఉండడం వల్ల అక్కడ పాలక పార్టీ గెలుపొందడం పెద్దకష్టమేమీ కాదని రాజకీయ వర్గాలు విశే్లషిస్తున్నాయి.