తెలంగాణ

న్యూజిలాండ్‌తో కలిసి పనిచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. న్యూజిలాండ్ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధాకృష్ణన్ బుధవారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రియాంకతో మంత్రి కేటీఆర్ చర్చించారు. తెలంగాణతో అగ్రిటెక్, ఇన్నోవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాలపై ప్రియాంక కూడా ఆసక్తి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రం ఇప్పటికే స్టార్టప్, ఇన్నోవేషన్ రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉందని, టీ-హబ్, వీ-హబ్ వంటి ఇంక్యుబేటర్ల ద్వారా ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించిన విషయాన్ని కేటీఆర్ వివరించారు. త్వరలోనే టీ-హబ్ రెండో దశ ప్రారంభించబోతున్నామని, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ కాబోతుందన్నారు. అలాగే విదేశీ స్టార్టప్ ఎకో సిస్టమ్‌తో కలిసి పనిచేయడానికి ఉద్దేశించిన టీ-బ్రిడ్జ్ కార్యక్రమాన్ని బలోపేతం చేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ కూడా భాగస్వామ్యం కావాలని కేటీఆర్ కోరారు. వ్యవసాయ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇక్రిశాట్‌తో అగ్రిటెక్ రంగంలో పనిచేస్తున్నట్టు మంత్రి చెప్పారు. కాగా, ఇక్కడి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నట్టు ప్రియాంక రాధాకృష్ణన్ వివరించారు. న్యూజిలాండ్ ప్రధాని జస్సిండా అర్డన్ అద్భుతంగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. న్యూజిలాండ్ పర్యటనకు వస్తే తాను తమ ప్రధానితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రియాంక చెప్పారు. తెలంగాణ ఎన్నారైలతో తాము ఇప్పటికే కలిసి పని చేస్తున్నామని, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగను కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రియాంక చెప్పారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల పాల్గొన్నారు.

'చిత్రం... పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో బుధవారం భేటీ అయిన న్యూజిలాండ్ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధాకృష్ణన్