తెలంగాణ

వర్శిటీల చట్టానికి సవరణపై విచారణ మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: గవర్నర్ ప్రమేయం లేకుండా తెలంగాణలో విశ్వవిద్యాలయాలకు వైస్‌చాన్సలర్లను నియమించేందుకు వీలు కల్పిస్తూ ఏపి యూనివర్శిటీస్ చట్టం 1991కు ప్రభుత్వం సవరణలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ చట్టానికి సవరణలు చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి మనోహరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ శ్రీరాం వాదనలు వినిపిస్తూ, గత ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన ఏపి యూనివర్శిటీస్ చట్టానికి తెలంగాణ ప్రభుత్వం సవరణలు చేసిందని, ఆ తర్వాత శాసనం చేసిందన్నారు. విసిలుగా ప్రొఫెసర్లను నియమించేందుకు యుజిసి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. కాని పరిపాలన అనుభవం ఉన్న వారిని కూడా విసిలుగా నియమించే విధంగా చట్టానికి సవరణలు చేశారన్నారు. దీనివల్ల వర్శిటీల్లో రాజకీయ జోక్యం పెరుగుతుందన్నారు. కొత్త చట్టం వల్ల ఐఎఎస్‌లతో పాటు సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లను కూడా విసిలుగా నియమించవచ్చన్నారు. వర్శిటీల అటానమీకి హాని కలిగించే విధంగా ప్రభుత్వం చట్టానికి సవరణలు చేసిందన్నారు. యుజిసి మార్గదర్శకాలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అనంతరం ఈ కేసు విచారణను గురువారానికి హైకోర్టు వాయిదావేసింది.

‘సెర్చ్ కమిటీ జీవో’ను
నిలిపేసిన హైకోర్టు

హైదరాబాద్, జూలై 20: జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విసి నియామకానికి సంబంధించి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు జారీ చేశారు. ఈ వర్శిటీ ఇన్‌చార్జి విసి ప్రొఫెసర్ పి పద్మావతి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ బి శ్రీనివాసరెడ్డి జీవోను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ జీవోను నిలుపుదల చేస్తూ సెర్చ్ కమిటీలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పి స్వరూప్‌రెడ్డిని యుజిసి తరఫున సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేయాలని ఆదేశించింది.

అతావుల్లా ఖాన్‌ను
ఢిల్లీకి తీసుకెళ్లిన ఎన్‌ఐఏ
నలుగురు హైదరాబాదీలపై
ఎన్‌ఐఏ అభియోగపత్రం

హైదరాబాద్, జూలై 20: ఇస్లామిక్ స్టేట్ కుట్ర కేసులో కీలక నిందితుడు అతావుల్లా ఖాన్‌ను ఎన్‌ఐఏ అధికారులు బుధవారం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీలోని ఎన్‌ఐఏ ప్రధాన కార్యాలయంలో ఈనెల 25వరకు అతనిని విచారించనున్నారు. అతావుల్లా సామాజిక మాధ్యమాల ద్వారా పలువురిని ఐసిస్ వైపు ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాద వ్యాప్తి చర్యలపై అతావుల్లాను నిపుణుల ద్వారా ఎన్‌ఐఏ ప్రశ్నించనుంది. అతనిలో తీవ్రవాద ప్రభావాన్ని తగ్గించేందుకు ఎన్‌ఐఏ చర్యలు చేపట్టింది. ఐసిస్ కుట్ర కేసులో నలుగురు హైదరాబాదీలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. సఫిద్, మొయినుద్దీన్, ఒబేదుల్లా, అబూ అనాథ్‌లను జనవరి నెలలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. సిరియాలోని సెట్టి ఆర్మర్ నేతృత్వంలో పోలీసులు, విదేశీయులే లక్ష్యంగా విధ్వంసాలకు కుట్ర పన్నినట్టు తేలడంతో వీరిపై ఎన్‌ఐఏ అభియోగపత్రం నమోదు చేసింది.

ఆరోగ్య వర్శిటీకి
వరంగల్ జైలు స్థలం!

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ కాళోజీ నారాయణరావువైద్య విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి వరంగల్‌లోని సెంట్రల్ జైలు స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. వరంగల్ నడిబొడ్డున ఉన్న ఈ జైలు పరిధిలో 70 ఎకరాల భూమి ఉంది. ఇందులో 35 ఎకరాలు వైద్య విశ్వవిద్యాలయానికి, మిగతా 35 ఎకరాలు కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఎంజిఎం ఆసుపత్రికి కేటాయించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎంజిఎం ఆసుపత్రికి కేటాయించే భూమిలో రెండు ప్రత్యేక టవర్లను (్భవనాలను) నిర్మిస్తారు. బోధనా ఆసుపత్రిగా ఉన్న ఎంజిఎంను మరింత అభివృద్ధి పరచాలని భావిస్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలుకు మామునూరు పోలీసు క్యాంపుకార్యాలయం వెనుక ఉన్న భూమిని ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ భూములను వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి పరిశీలించారు.