తెలంగాణ

‘కరోనా’ రాకుండా పకడ్బందీ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కరోనా వైరస్ రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బుధవారం ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఫీవర్ దవాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తదితరులతో ఇక్కడ సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కరోనా వైరస్ రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గతంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని సమర్థంగాగా ఎదుర్కొన్నామన్న
విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కరోనా వైరస్ అంతర్జాతీయంగా అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానా, ఫీవర్ దవాఖానా, ఛాతీ వ్యాధుల దవాఖానాలను నోడల్ దవాఖానాలుగా గుర్తించామని ఈటల తెలిపారు. అనుమానితుల నుండి శాంపిళ్లను సేకరించి వాటిని గాంధీ దవాఖానాకు పంపిస్తే అక్కడి నుండి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ) కి పంపించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా లేదని, అయితే విదేశాల నుండి వస్తున్న ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నందువల్ల శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య కేంద్రంలో మాస్ స్క్రీనింగ్ నిర్వహించే ఏర్పాట్లు చేశామన్నారు. విదేశాల నుండి వస్తున్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినట్టు అనుమానం వస్తే నేరుగా నోడల్ దవాఖానాకు తరలించే ఏర్పాట్లు కూడా చేశామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే మొదట ఐసోలేట్ చేస్తామని, ప్రాథమిక చికిత్స అందించి, శాంపిళ్లను సేకరించి పుణె పంపిస్తామన్నారు. అయితే పుణె నగరానికి శాంపిళ్లను పంపించడం ఇబ్బందికరంగా ఉంటుందన్న కారణంతో హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆధీనంలోని ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్’లోనే శాంపిళ్ల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన సాయం చేయాలంటూ కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. కేంద్రం నుండి సాంకేతిక సాయం అందగానే శాంపిళ్ల పరీక్షలను హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామన్నారు.
ఇలాఉండగా తన వద్ద ఉన్న సమాచారం మేరకు కరోనా వ్యాధికి గురైన వారిలో చైనాలో 278 మంది, జపాన్, థాయిలాండ్, అమెరికా (యూఎస్‌ఏ)లో ఒక్కొక్కరు, రిపబ్లిక్ కొరియాలో ఇద్దరు ఉన్నట్టు తేలిందన్నారు. భారత్‌లో ఇప్పటివరకు ఈ వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ నుండి ఏడుగురు అనుమానితుల నుండి శాంపిళ్లను సేకరించగా, వీటిలో రెండింటికి సంబంధించి నెగెటివ్ ఫలితాలు వచ్చాయని, మరో ఐదు శాంపిళ్లకు సంబంధించి రిపోర్టులు రావలసి ఉందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి తెలియజేస్తూ, కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.