తెలంగాణ

ఇక పాలన పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర సమితి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరుస ఎన్నికలు, వాటి కోడ్‌తో పరిపాలన పట్టాలు ఎక్కలేకపోయింది. ఇప్పటికే అమలు అవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మినహా కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి సాంకేతికంగా ఎన్నికల కోడ్‌లు అవరోధంగా నిలిచాయి. దీంతో పరిపాలన స్థంభించింది. వచ్చే నాలుగేళ్ల పాటు ఇక ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో పరిపాలనపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాదిగా నెరవేర్చలేదని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై సీఎం కేసీఆర్ కూడా ఇటీవల స్పందిస్తూ ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ఐదేళ్లకని, తాము ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ఇంకా నాలుగేళ్ల వ్యవధి ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇలాఉండగా టీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక వరుసగా పంచాయతీ, పార్లమెంట్, పరిషత్, మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఎడతెరిపి లేకుండా ఎన్నికలు, వాటి కోడ్‌లు అమలులో ఉండడం వల్ల కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్లకు వయో పరిమితిని తగ్గించి 57 ఏళ్లకు వర్తింపజేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ఇలాంటి చిన్న చిన్న హామీలపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోయింది. అమలులో ఉన్న ఆసరా పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను మాత్రమే కొనసాగిస్తూ వచ్చింది. హరితహారం కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై పలుచోట్ల దాడులు జరిగాయి. ఆ సందర్భంగా పోడు భూముల సమస్య తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని శాసనసభలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావిస్తూ తానే స్వయంగా జిల్లాల్లో పర్యటించి పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత 55 ఐదు రోజుల పాటు కొనసాగిన ఆర్టీసీ సమ్మె, సచివాలయం తరలింపు, శాసనసభకు కొత్త భవనం నిర్మాణం అంశాలపై హైకోర్టులో కేసు తదితర అంశాల వల్ల జిల్లా పర్యటనలకు సీఎం వెళ్లలేక పోయారు. ఇవి ఓ కొలిక్కి వచ్చాక వెళ్లడానికి సమాయత్తం అవుతున్న దశలోనే మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాతనే జిల్లాల పర్యటనలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావించారు. అయితే శాసనసభ బడ్జెట్ సమావేశాలు, సహకార ఎన్నికలు రావడంతో సీఎం పర్యటనలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ నెల మూడవ వారంలో ప్రారంభమయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాలు కనీసం 16 పనిదినాల పాటు జరగాల్సి ఉంది. దీంతో వచ్చే నెల మార్చి రెండవ వారం చివరలో
కానీ, మూడవ వారం
ప్రారంభంలో కానీ జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అప్పటివరకు వేసవి ప్రారంభం కావడం వల్ల పురోగతిలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంటుందంటున్నారు. దీనివల్ల ప్రాజెక్టుల పనులను పరిశీలించడంతో పాటు పోడు భూముల సమస్యపై ఎక్కడికక్కడే పరిష్కరించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఆలోగా శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం పొందనుంది. దీంతో కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి వస్తుంది. సహకార ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలు ముగిశాక వచ్చే నెలలో జరిగే సీఎం పర్యటనలకు పూర్వరంగాన్ని సిద్ధం చేయడానికే పాలనా యంత్రాంగం ప్రక్షాళనపై దృష్టి సారించినట్టు తెలిసింది. దీంట్లో భాగంగానే ఐఏఎస్‌ల మూకుమ్మడి బదిలీ జరిగినట్టు ఈ వర్గాల సమాచారం. అలాగే ఒకటి, రెండు రోజుల్లో ఐపీఎస్‌ల బదిలీలు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.