తెలంగాణ

గద్దెపై సమ్మక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, ఫిబ్రవరి 6: తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధికెక్కిన మేడారం మహాజాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. గురువారం చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లి మేడారం గద్దెకు చేరడంతో జాతర మహా సంబరం అంబరాన్ని తాకింది. ప్రతి రెండేళ్లకోమారు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున జాతరను పురస్కరించుకొని సమ్మక్క తల్లి గద్దెకు చేరడం ఆనవాయితీగా వస్తోంది. సమ్మక్క తల్లి గద్దెకు చేరుకున్న తరువాత నెరవేరిన కోర్కెలకు ఎత్తు బంగారం (బెల్లం), వడిబాల బియ్యం, పసుపు, కుంకుమ, చీరె, సారె సమ్మక్క - సారలమ్మకు సమర్పిస్తారు. సమ్మక్కను చిలకలగుట్టపై నుండి ప్రధాన పూజారులు కొక్కెర క్రిష్ణయ్య, సిద్దబోయిన మునేందర్ ఆధ్వర్యంలో పూజారులు పూజలు నిర్వహించి, కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని మేడారం తీసుకువచ్చేందుకు చిలకలగుట్ట నుండి కిందకు దిగారు. ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్ రాత్రి 7:06 గంటలకు తుపాకి పేల్చి ప్రభుత్వ లాంఛనాలతో మేడారం గద్దెకు భారీ పోలీసు భద్రతతో సమ్మక్క తల్లిని మేడారం తోడ్కొని వచ్చారు.
తుపాకి కాల్పులతో సమ్మక తల్లి రాకను సూచించారు. సమ్మక్క తల్లిని భక్తుల జయజయ ధ్వానాలు, కోయ గిరిజన సంప్రదాయ డోలు వాయిద్యాలు, విద్యుత్ దీప వెలుగుజిలుగుల మధ్య మేడారంలోని గుడికి తీసుకువచ్చి పూజలు నిర్వహించిన తరువాత రాత్రి 9.10 గంట ల సమయంలో గద్దెపై ప్రతిష్ఠించారు. అంతకు ముందు సమ్మక్క తల్లికి అధికారికంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం అంతా చిలకలగుట్టకు చేరుకొని సమ్మక్క ఆగమనానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత చిలకలగుట్టకు చేరుకొని సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్ పాటిల్, జాతర నోడల్ అధికారి, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ములుగు నూతన కలెక్టర్, జాతర ప్రత్యేకాధికారి క్రిష్ణ ఆదిత్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య తదితరులు సమ్మక్క తల్లి వెంట గద్దె వరకు వచ్చారు. అశేష భక్త జనం సమ్మక్క తల్లిని తీసుకువచ్చే చిలకలగుట్ట, మేడారం సమ్మక్క - సారలమ్మ గద్దెల వరకు ఉన్న ప్రధాన రహదారికి అందమైన ముగ్గులతో అలంకరించారు. అలాగే సమ్మక్క తల్లికి ఎదురుకోళ్లు, మేకలు బలివ్వడంతో రోడ్డంతా ఎరుపు వర్ణంగా మారింది. జయహో.. సమ్మక్క తల్లి అంటూ చేసిన జయజయ ధ్వానాలతో మేడారం మొత్తం హోరెత్తిపోయింది. దారి పొడవునా లక్షలాది భక్తులు సమ్మక్క తల్లిని చూసి భక్తితో పులకించిపోయారు. సమ్మక్క తల్లీ హబ్బియ్యో.. చల్లగా చూడు తల్లీ అంటూ శివసత్తుల పూనకాలతో మేడారం భక్తిపారవశ్యంతో పరవశించింది. సమ్మక్క తల్లి మేడారం గద్దెలకు చేరిన తరువాత భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు పోటీపడ్డారు. అయితే శుక్రవారం రోజంతా సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో అత్యధికులు తమ మొక్కులను శుక్రవారం తీర్చుకోనున్నారు. నిన్న మొన్నటి వరకు కీకారణ్యంగా ఉన్న మేడారం గ్రామానికి చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు భక్తులతో నిండిపోయి కీకారణ్యం కాస్త జనారణ్యంగా మారింది.

*చిత్రం... సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకొస్తున్న పుజారులు