తెలంగాణ

అమ్మవార్లు వనంలోకి వెళ్లినా... తగ్గని భక్తుల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: అమ్మవార్లు వనంలోకి వెళ్లినా భక్తుల హోరు ఏమాత్రం తగ్గలేదు. ఆదివారం సెలవుదినం కావడంతో లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. శనివారం రాత్రి 7 గంటల అనంతరం సమ్మక్క-సారలమ్మతో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజులు వారివారి జన్మ స్థలాలకు వెళ్లగా జాతర ముగుస్తుందని అధికారులనుకున్నప్పటికీ ఊహించని విధంగా ఆదివారం భక్తుల రద్దీ పెరిగి క్యూలైన్ దర్శనం కొనసాగింది. జాతరలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో ఇద్దరు చిన్నారులు తప్పిపోగా సుమారు గంట పాటు ఓఎస్‌డీ సురేష్‌కుమార్ జాతరలో అన్ని వైపులా సిబ్బందిని మోహరించి చివరకు వారి ఆచూకీ కనుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారీవర్షం వల్ల మేడారం పరిసరాలు బురదమయం అయినప్పటికీ భక్తుల రాక మాత్రం ఆగలేదు. తాడ్వాయి, పస్రా నుండి కూడా ప్రైవేటు వాహనాల రాకపోకలు జోరుగా కొనసాగింది. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గడంతో ఎక్కువగా భక్తులు ప్రైవేటు వాహనాల్లోనే ఆదివారం అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. పెద్దగా భక్తుల రద్దీ ఉండదని అధికార యంత్రాంగం భావించినప్పటికీ ఊహించని విధంగా ఉదయం నుండే భక్తుల రాక పెరిగి రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. భక్తులు కూడా జంపన్నవాగులో స్నానం చేసి అనంతరం ఎత్తుబెల్లాలతో, ఎదురుకోళ్లతో దర్శించుకుని మేడారం పరిసరాలకు కొద్ది దూరంలో విడిది ఏర్పాటు చేసుకుని భోజనాలు చేస్తూ సేద తీరారు. భక్తుల రద్దీ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే దనసరి సీతక్క, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ.పాటిల్‌తో పాటు వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. అయితే నేటి సోమవారం నాటికి కొంత భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మేడారం జాతర ముగిసే రోజున తల్లుల వన ప్రవేశం చేస్తుండగా భారీగా వర్షం పడినప్పటికి భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగలేదు. దాదాపు కోటి మందికి పైగా భక్తులు మేడారం దర్శించుకున్నప్పటికీ, తల్లుల వన ప్రవేశం అయినప్పటికీ భక్తుల జాతర మాత్రం తగ్గలేదు. మేడారం పరిసర ప్రాంతాల్లో అంతా భారీ వర్షం పడినప్పటికీ ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండడం అంటే తల్లుల మహిమేనని భక్తులు విశ్వసిస్తున్నారు. దేవతలు వన ప్రవేశం అయినప్పటికీ ఆ ప్రాంతానికి చేరుకుంటునే అమ్మవార్ల అనుగ్రహం ఉంటుందున్న నమ్మకంతో జాతరకు మందు, జాతర తర్వాత కూడా భక్తుల సంఖ్య పెరిగిపోవడం గమనార్హం.
*చిత్రం... గద్దెల వద్ద భక్తుల సందడి