తెలంగాణ

సీలింగ్ భూములకు పట్టాలు ఇచ్చిన రెవిన్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఫిబ్రవరి 12: సీలింగ్ భూములను ఇతరుల పేరుపై మార్చడం అనేది చట్టవిరుద్ధం. సీలింగ్ భూములపై ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉంటుంది. అయితే నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది మాత్రం ఈ నిబంధనలు ఏవీ తమకు పట్టవనుకున్నారో ఏమో ఇటీవల బదిలీపై ఇతర జిల్లాకు వెళ్ళిన తహశీల్దార్ హయాంలో నేరెడుగొమ్ము మండలం పేర్వాల గ్రామ శివారులోని పలు సర్వే నెంబర్‌లలోని సీలింగ్ భూములను ఇతరుల పేర్ల పైకి మార్చి పట్టాదార్ పాస్‌పుస్తకాలు జారీ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. నిబంధనలకు విరుద్ధంగా పెద్దయెత్తున ముడుపులు తీసుకొని గతంలో దళితుల పేర్ల మీద ఉన్న సీలింగ్ భూములను రెవిన్యూ సిబ్బంది ఇతర సామాజిక వర్గాలవారి పేరు మీద పట్టా చేసి ధైర్యంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేశారు.
ఇటీవల ఈ విషయం బైటకు పొక్కడంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది నానా సాకులు చెబుతూ ఇందులో తమ తప్పేమీ లేదని గతంలో పేర్వాల పెద్దఅడిశర్లపల్లి మండలంలో కలిసి ఉన్నందున రికార్డులు సక్రమంగా అందుబాటులో లేక తప్పులు దొర్లి ఉంటాయని వారి పట్టాలను రద్దు చేస్తాం అంటూ కొత్తపాటను అందుకున్నారు. పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలకు తెరలేపిన సీలింగ్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
నేరెడుగొమ్ము మండలం లోని పేర్వాల గ్రామంలోని సర్వే నెంబర్ 424/6లో గల 1.29 ఎకరాల సీలింగ్ భూమి గతంలో దళిత సామాజిక వర్గానికి చెందిన పంబాల ఎల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఉండగా ఈ భూమిని గత తహశీల్దార్ టేకులపల్లి అంజయ్య అనే వ్యక్తి పేరు మీద మార్చి అతనికి ఖాతా నెంబర్ 2252, పాసుబుక్కు నెంబర్ టి 28230011580 ద్వారా నూతన పట్టాదార్ పాసుపుస్తకం జారీ చేశారు. సర్వే నెంబర్ 424/4లో 2.00 ఎకరాల సీలింగ్ భూమి గతంలో పంబాల పంబాల వెంకటయ్య అనే వ్యక్తి పేరు మీద ఉండగా టేకులపల్లి అంజయ్య పేరు మీద పేరు మార్చి పట్టాదార్ పాసుపుస్తకాన్ని జారీ చేశారు. సర్వే నెంబర్ 367లో గల 1.00 ఎకరం సీలింగ్ భూమిని గత సంవత్సరం తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా తోకల సత్తమ్మ పేరు మీద మార్చి పాస్‌బుక్కు నెంబర్ టి 28230011804 ను జారీ చేశారు. ఇవేకాకుండా పలు సర్వే నెంబర్‌లలో ఉన్న సీలింగ్ భూములను ఇతర వ్యక్తులపై పేరు మార్పిడి చేస్తూ గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన తహశీల్దార్ 13 బి సర్ట్ఫికెట్‌లను జారీ చేశారు.
వీరికి వాటి ఆధారంగా నూతన పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కావాల్సి ఉండగా విషయం బయటకు పొక్కడంతో రెవిన్యూ సిబ్బంది కొత్త పాసుపుస్తకాలు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామ వీఆర్వో నుండి తహశీల్దార్ వరకు ప్రతి ఉద్యోగి పెద్ద మొత్తంలో డబ్బులను తీసుకొని అక్రమంగా సీలింగ్ భూములను ఇతరుల పేర్ల మీదకు మార్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరిన్ని భూ అక్రమాలు బయటకు వస్తాయని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
* తహశీల్దార్ ప్రేమ్‌కుమార్
సీలింగ్ భూములను ఇతరుల పేర్ల మీదకు మార్చడం రెవిన్యూ నిబంధనలకు విరుద్ధమని నేరెడుగొమ్ము తహశీల్దార్ ప్రేమ్‌కుమార్ చెప్పారు. తాను కొత్తగా ఇక్కడకు వచ్చానని సీలింగ్ భూములను ఇతరుల పేర్లమీదకు మార్చారని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.