తెలంగాణ

ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 22: మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న ఉద్యమాలు, ఆందోళనతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ సమస్య తెరపైకి వచ్చేసరికి ఆ సమస్యపై అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించి విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోనే మరో సమస్య తెరపైకి రానే వస్తోంది. ఇప్పటికే పాలమూరు ఎత్తిపోతల పథకంపై ముంపు గ్రామాల ప్రజలు రగడ సృష్టిస్తూ ఆందోళన బాట పట్టారు. ఇదిలా ఉండగా ముంపు బాధితులకు అండగా నిలిచేందుకు టిజెఎసి చైర్మన్ కోదండరాం ఆధ్వర్యంలో ప్రాజెక్టుల పరిశీలన యాత్ర కొనసాగుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతలోపే గతంలో 2014 మే 23వ తేదిన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ద్వారా 69 జిఓతో నారాయణపేట -కొడంగల్ భీమా ప్రాజెక్టు లింక్‌తో ఎత్తిపోతల పథకానికి గ్రిన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్, బిజెపి, టిడిపి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించాల్సిందేనని పట్టుబడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో మరో పోరాటానికి శుక్రవారం శ్రీకారం చుట్టాయి. భీమా ఎత్తిపోతల పథకానికి కేటాయించిన 20 టిఎంసిల నుండి నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 7.10 టిఎంసిల నికర జలాలను సాగు, తాగునీటి అవసరాలకై 69 జిఓలో పొందుపరిచారు. 10 మండలాల్లోని 1.50 లక్షల ఎకరాల భూమి సాగుతో పాటు ప్రజలకు తాగునీరు అందించవచ్చనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఈ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణంగా ఎక్స్‌లేటరీ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రాజెక్టు (వేగవంతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన) పథకం కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి 90 శాతం నిధులు కేటాయించనున్నది. 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి ఉందని 69 జీవోలో పొందుపరిచారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1450 కోట్ల పరిపాలన అనుమతులు ఇస్తూ రూ. 133.88 కోట్ల బడ్జెట్ ఆనాడే విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద జలాలపై నిర్మించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో చివరి ఆయకట్టుగా చేర్చి నారాయణపేట- కొడంగల్ ప్రాంతాలకు సాగు, తాగునీరు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. కర్వెన రిజర్వాయర్ నుండి నారాయణపేటకు సాగునీరు అందిస్తామని ఇటివల హరీష్‌రావు మహబూబ్‌నగర్‌లో ప్రకటించారు. అయితే మంత్రి హరీష్‌రావు ప్రకటనకు సంతృప్తి చెందని మక్తల్, నారాయణ, కొడంగల్ నియోజకవర్గాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు తమకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానదిలో నికర జలాలు ఇవ్వకుండా వరద జలాలు ఇస్తామనడం ఏమిటంటూ శుక్రవారం కాంగ్రెస్, బిజెపి, టిడిపి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించేందుకు సాధన యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డితో పాటు న్యూడెమోక్రసీ, సిపియం, సిపిఐ నేతలు కూడా యాత్రలో పాలుపంచుకున్నారు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సంబంధించిన వేలాది మంది జనం కూడా పాల్గొని కదం తొక్కారు. కేంద్ర ప్రభుత్వం 90శాతం ఖర్చు పెట్టే ఈ ప్రాజెక్టును నిర్మించకుండా, వరద జలాల పేరుతో ఈ ప్రాంతానికి నీరు ఇస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు సాధన యాత్రలో భాగంగా జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎందుకు శ్రీకారం చుట్టడం లేదో రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలని డిమాండ్ చేశారు. నియంతలా వ్యవహరిస్తే చాలా రాజ్యాలు కూలిపోయాయని ఆ దుస్థితి కెసిఆర్‌కు తప్పకుండా వస్తుందని జోస్యం చెప్పారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భారం పడకుండా 90శాతం నిధులను కేంద్రం భరిస్తుంటే ప్రాజెక్టును ముఖ్యమంత్రి స్వాగతించేది పోయి పక్కకు పెట్టడం హస్యాస్పదం అన్నారు. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మించకుంటే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు సాధనకై పాదయాత్ర చేస్తున్న
అఖిలపక్ష నేతలు జైపాల్‌రెడ్డి, మురళీధర్‌రావు తదితరులు