తెలంగాణ

వాస్తవిక బడ్జెటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వార్షిక ఆర్థిక బడ్జెట్ (2020-21) ముసాయిదాకు తుదిరూపం ఇవ్వడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల నుంచి అందిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ, ఆర్థిక సలహాదారులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లోతుగా చర్చించారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ చేసిన సూచనలకు అనుగుణంగా కొన్ని చేర్పులు, మార్పులతో బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత వార్షిక బడ్జెట్ మాదిరిగానే వచ్చే ఆర్థిక వార్షిక బడ్జెట్ వాస్తవికతకు దగ్గరగా ఉండబోతుందని అధికార వర్గాల సమాచారం. ప్రస్తుత వార్షిక బడ్జెట్ (2019-20) రూ.1,46,492 కోట్లు కాగా వచ్చే ఆర్థిక వార్షిక బడ్జెట్ కూడా దాదాపు రూ.లక్షన్నర కోట్లకు అటుఇటుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మాంద్యం వల్ల తగ్గిన వృద్ధిరేటు, రాష్ట్ర సొంత రాబడి అంచనాల లక్ష్యానికి చేరుకోకపోవడంతో రాష్ట్ర ఆదాయాన్ని, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లను పరిగణనలోకి తీసుకొని 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం. ప్రస్తుత బడ్జెట్‌లో అంచనా వేసిన స్టేట్ ఓన్ రెవెన్యూ రూ.74,699 కోట్లు కాగా డిసెంబర్ నాటికి ఇది రూ.51,812 కోట్లకు మాత్రమే చేరుకుంది. ఆ తర్వాత మూడు నెలలు (జనవరి, ఫిబ్రవరి, మార్చి) వరకు రూ. 15 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో
అంచనాలపై తగ్గనున్న 10 వేల కోట్లను భర్తీ చేసుకోవడంతో పాటు కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్స్ మరో రూ.10 వేల కోట్లు తగ్గిన నేపథ్యంలో దాదాపు రూ.20 వేల కోట్లను ఏవిధంగా సమకూర్చుకోవాలనే దానిపై బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రభుత్వం పొందుపరిచినట్టు సమాచారం. ప్రభుత్వ భూములను విక్రయించడం, భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచడం, ఆస్తి పన్ను స్వల్పంగా పెంచడం వంటి చర్యలతో పాటు ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో పెట్టుకొని దుబారా ఖర్చులకు కళ్లెం వేయడం ద్వారా తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకునే ప్రతిపాదనలు బడ్జెట్‌లో ప్రతిపాదించినట్టు తెలిసింది. కొత్త హామీలకు పూర్తిగా స్వస్తి పలికి, అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కొనసాగింపునకు ఢోకా లేకుండా బడ్జెట్‌ను ప్రతిపాదించనుందని తెలిసింది. ప్రభుత్వ ప్రాధాన్యతలైన సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్, సంక్షేమ కార్యక్రమాలపై ఎలాంటి కోతలు ఉండవని తెలిసింది. అయితే రైతుబంధు పథకానికి ప్రస్తుతం ఎలాంటి పరిమితులు లేవు. అయితే ఆర్థిక మాంద్యంతో పాటు ఈ పథకంపై ప్రభుత్వం జరిపించిన అధ్యయనంలో రైతుబంధు పథకానికి కొన్ని పరిమితులు విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రైతుబంధు పథకాన్ని ఐదు ఎకరాలకు పరిమితం చేయాలా? లేదా పది ఎకరాలకు పరిమితం చేయాలా? అనే అంశంపై మాత్రం విస్తృతంగా తర్జనభర్జనలు జరిపినట్టు తెలిసింది. రైతుబంధుకు పరిమితులు విధిస్తారా? లేదా? అనే అంశాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే ఇది వెల్లడవుతుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాఉండగా ఈ బడ్జెట్ సమావేశాలలో రెవెన్యూ కొత్త చట్టంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేయడం వంటి ముఖ్యమైన అంశాలు ఉండబోతున్నాయి. అలాగే గతంలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌లు ఆమోదం పొందనున్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్
------------------------------------
2014-15 రూ.1,00,637 కోట్లు
2015-16 రూ.1,15,689 కోట్లు
2016-17 రూ.1,30,415 కోట్లు
2017-18 రూ.1,49,646 కోట్లు
2018-19 రూ.1,74,454 కోట్లు
2019-20 రూ.1,46,492 కోట్లు
2020-21 రూ.1,51,000 కోట్లు?
(ప్రతిపాదిత అంచనా)
-------------------------------------