తెలంగాణ

నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 1: ఏపీ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్లమెంట్ చేసిన చట్టాలను గౌరవించి కేంద్రం వాటి అమలుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌కు మాత్రమే పరిమితమంటూ, ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి వర్తించబోదంటూ వ్యాఖ్యానించడం సమంజసంగా లేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టాన్ని చీకట్లో, పార్లమెంట్ తలుపులు మూసుకుని ఆమోదించారని, చివరి నిమిషంలో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని చేర్చారంటూ కిషన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. కిషన్‌రెడ్డి తన మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని, ఏపీ పునర్విభజన చట్టాన్ని ఆమోదించిన పార్లమెంట్‌ను, మద్దతునిచ్చి ప్రస్తుతం కేంద్రంలో మంత్రులుగా, ఎంపీలుగా ఉన్న ఆనాటి బీజేపీ పార్టీ నాయకులను, అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత సుష్మాస్వరాజ్‌ను సైతం అవహేళన చేశారంటూ గుత్తా మండిపడ్డారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సైతం ఏపీ పునర్విభజన చట్టంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే రీతిలో తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి సైతం మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరన్నారు. కేంద్రం పార్లమెంట్ చట్టాలను అగౌరవ పరిచేలా వ్యవహరించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడమే అవుతుందన్నారు.
ఏపీ పునర్విభజన చట్టానికి మద్దతునిచ్చిన బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నందున నైతిక బాధ్యతగా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సహకార ఎన్నికలు ఏకగ్రీవం కావడం సీఎం కేసీఆర్ సారథ్యంలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతుకు నిదర్శనమన్నారు. నూతన డీసీసీబీ, డీసీఎంల చైర్మన్‌లుగా ఎన్నికైన వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని వారంతా ప్రభుత్వం ఆశించినట్టు సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో రాజకీయాలకు అతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. ఇందులో రాజకీయాలకు అవసరం లేదని ప్రజల వౌలిక అవసరాలే లక్ష్యంగా అంతా సమన్వయంతో సాగాలన్నారు. ప్రపంచం పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు, విషజ్వరాలకు గురవుతున్న నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా పారిశుద్ధ్యం, పచ్చదనం కనీస వౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వామ్యం కావడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి