తెలంగాణ

నేటి నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు గురువారం ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు సెకండ్ లాంగ్వేజి పేపర్ -2 జరగనుంది. సెకండియర్ పరీక్షలకు 4 లక్షల 88 వేల 323 మంది హాజరవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే పరీక్ష ప్రారంభం అవుతుందని, విద్యార్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఫస్టియర్ పరీక్షలు సందర్భంగా బుధవారం నాడు పలు కేంద్రాల్లో విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా వారిని ఇంటికి పంపించామని, ఆ పరిస్థితి సెకండియర్ విద్యార్థులకు ఉండకూడదని అధికారులు చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఏదీ మనసులో పెట్టుకోకుండా పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా రాయాలని వారు చెప్పారు. కరోనా టెన్షన్ ఏమీ లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పేర్కొన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను నియమించామని అన్నారు. అలాగే ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు కలిపి 25,550 మంది ఇన్విజిలేటర్లను నియమించామని చెప్పారు. ప్రతి కాలేజీలో స్టూడెంట్ కౌన్సిలర్లను ఎంపిక చేశారని, వారి వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని, తద్వారా ఏ విద్యార్థికైనా ఇబ్బంది కలిగితే వారి ద్వారా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోగలుగుతారని ఆయన చెప్పారు. విద్యార్థులు ఏ విషయానికీ ఆందోళన చెందవద్దని, తమకేమైనా సమస్యలుంటే వాటిని అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. అలాగే తెలంగాణ బోర్డు సెంటర్ లొకేటర్ మొబైల్ యాప్ రూపొందించిందని, తద్వారా జంబ్లింగ్ కేంద్రాల గుర్తింపు చాలా తేలిక అవుతుందని అన్నారు. పరీక్షాలు రాసిన తర్వాత ఒఎంఆర్‌లను ఇన్విజిలేటర్లకు అందజేయాలని అందులో పొరపాట్లు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, తద్వారా ట్రాఫిక్ ఇతర సమస్యలను అధిగమించాలని పేర్కొన్నారు. పరీక్ష వాస్తవంగా ప్రారంభానికి పావు గంట ముందే ఒఎంఆర్ షీట్లను విద్యార్థులకు అందజేస్తారని వాటిని ఎలాంటి తొందరపాటు లేకుండా అవసరమైన వివరాలను సరిచూసుకోవాలని చెప్పారు. గడువుముగిసిన తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. సెకండియర్ పరీక్షల్లో భాగంగా గురువారం సెకండ్ లాంగ్వేజి, 7వ తేదీన ఇంగ్లీషు, 11న మాథ్స్, బోటనీ, సివిక్స్, సైకాలజీ, 13న మాథ్స్ 2బీ, జువాలజీ, హిస్టరీ, 16న ఫిజిక్స్, ఎకనామిక్స్, క్లాసికల్ లాంగ్వేజి, 18న కెమిస్ట్రీ, కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్సు, 20న జియాలజీ, హోం సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, 23న మోడరన్ లాంగ్వేజి ,జాగ్రఫీ పేపర్లు ఉంటాయని బోర్డు కార్యదర్శి చెప్పారు.
మొదటి సంవత్సరం పరీక్షకు 22,632 మంది గైర్హాజరయ్యారని బోర్డు కార్యదర్శి జలీల్ చెప్పారు. వరంగల్ అర్భన్‌లో ఒకరిని, సూర్యాపేటలో ఐదుగురిని మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఒకటి రెండు చోట్ల ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేశారు. కరోనా వైరస్ భయం వద్దనీ.. శానిటైజర్లు, మాస్క్‌లతో పరీక్షలకు హాజరు కావచ్చని ప్రభుత్వం బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది.