తెలంగాణ

ప్రగతికి అడ్డొస్తే అణచివేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు అయిపోయాయని, ఇప్పుడు ప్రభుత్వ దృష్టి కేవలం అభివృద్ధి, సంక్షేమంపై ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ అధికార పక్ష సభ్యులు శనివారం ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతిపక్షాలతో పాటు ఎవరు అడ్డువచ్చినా అణచివేస్తామని (బుల్‌డోజ్) సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతల అరుపులు, పెడబొబ్బలు, పిచ్చికూతలకు బెదరబోమని అన్నారు. సచివాలయానికి, అసెంబ్లీకి కొత్త భవనాలు నిర్మించాలని ప్రతిపాదించినా, ఇతర ముఖ్యమైన శాఖలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావించినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ల్యాండ్‌మార్క్ ఏదీ ఉండకూడదన్నదే ప్రతిపక్షాల ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిలో పరిపాలన సజావుగా సాగేందుకు ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. విద్యుత్ చార్జీలను, ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుమని ముఖ్యమంత్రి ఈ సంద్భంగా ప్రకటించారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, సేద్యానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తలసరి విద్యుత్ వినియోగం గత ఐదేళ్లలో బాగా పెరిగిందని, దేశంలో ఇప్పుడు ఈ అంశంలో మొదటిస్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా తదితర అంశాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, ఐదేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచలేదని, ఇప్పుడు కొద్దిగా పెంచుతామని ఆయన వెల్లడించారు. ఇటీవల
ఆర్టీసీ బస్సు చార్జీలను స్వల్పంగా పెంచామని, ఆర్టీసీ సేవలను విస్తరించేందుకు మళ్లీ మరికొంత ఆర్టీసీ చార్జీలను పెంచాల్సి వస్తుందన్నారు. పన్నులు, చార్జీలపైనే ప్రభుత్వ పాలన నడుస్తుందని, సౌకర్యాలు సమకూరుస్తూనే, చార్జీలను పెంచడంలో తప్పులేదన్నారు. గ్రామ ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని, వీటికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు బాధ్యతగా మాట్లాడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరోపణలు ఏవైనా చేస్తే వాటిని రుజువు చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణంగా చట్టం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూములకు రైతుబంధు వర్తింపజేయలేమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోడు భూముల అంశం చాలా కాలంగా సమస్యగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే ‘ప్రజాదర్బార్’లను నిర్వహిస్తామని ప్రకటించారు. పోడు భూముల అంశం కాంగ్రెస్, టీడీపీ పాలన ద్వారా వారసత్వంగా వచ్చిన ‘దరిద్ర’మన్నారు. దీనికి చరమగీతం పాడేందుకే ప్రజాదర్బార్‌లను నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మిషన్ భగీరథ పథకానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తూ ఉంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శించడం శోచనీయమన్నారు. నాటుసారా తయారీలో నిమగ్నమైన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించామని, 6,299 మందికి ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు చెల్లించామన్నారు. నాటుసారా తయారీకి కేంద్రంగా కొనసాగిన ధూల్‌పేటకు త్వరలోనే వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
పీఆర్‌సీ ఇస్తాం
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే పీఆర్‌సీ అమలు చేస్తామని, అలాగే ఉద్యోగుల వయోపరిమితి హెచ్చింపుపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పరిపాలనలో సంస్కరణలు తీసుకు వస్తున్నామని, ఇందులో భాగంగానే త్వరలోనే సమగ్ర రెవెన్యూ చట్టాన్ని తీసుకు వస్తున్నామని వెల్లడించారు. నిరక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో కింది నుండి మూడో స్థానంలో ఉందని, పూర్తి అక్షరాస్యత సాధించేందుకు ‘ఈచ్ వన్-టీచ్ వన్’ అన్న నినాదంతో ముందుకు వెళుతున్నామని, త్వరలోనే అక్షరాస్యతలో దేశంలో మొదటిస్థానానికి వస్తామన్నారు. ఈ అంశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ప్రజాప్రతినిధులంతా సహకరించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో వైద్యం, ఆరోగ్యం పేదలకు అందుబాటులో ఉండేది కాదని, ఇప్పడు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను 40 ఏర్పాటు చేశామని, ఇతరత్రా సౌకర్యాలు కల్పించామన్నారు. డబల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల పంపిణీ కొనసాగుతుందని ఆయన వివరించారు. మిషన్ భగీరథపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని, మారుమూల గ్రామాల ప్రజలకు కూడా మంచినీటిని ఈ పథకం ద్వారా ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఇంజనీర్లు పగలనక, రాత్రనక కష్టపడ్డారని, వారిని ప్రశంసించాలే తప్ప, విమర్శించవద్దన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని తాను ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే ప్రైవేట్ రంగంలోనే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారన్నారు. కేవలం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల దాదాపు 30 లక్షల మంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో ఇతర ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు లక్ష మంది వరకు ఉన్నారంటూ ఉద్యమ సమయంలో చెప్పానని, 2014 తర్వాత దాదాపు 85 వేల పోస్టులను తెలంగాణ వారితో భర్తీ చేశామని చెప్పారు. 60 సంవత్సరాలపాటు కాంగ్రెస్, టీడీపీ పాలకులు చేసినట్టు ‘దోఖాబాది’ హామీలు ఇవ్వడం తనకు చేతకాదన్నారు. అసెంబ్లీలో తమ పార్టీ (టీఆర్‌ఎస్)కి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కాంగ్రెస్ నుండి మూడింట రెండువంతుల మంది ఎమ్మెల్యేలు వచ్చి తమ పార్టీలో విలీనం (మెర్జ్) అయ్యారని, రాజ్యాంగానికి లోబడే ఇది జరిగిందని కేసీఆర్ తెలిపారు. బీజేపీ కేంద్రంలో, కాంగ్రెస్ రాజస్థాన్‌లో ఇదే విధానం చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమలు నిబంధనల మేరకే ఏర్పాటవుతున్నాయని, కాలుష్య నియంత్రణ ప్లాంట్‌లు ఉన్నవాటికే అనుమతి ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేల గౌరవం ఇనుమడింపజేసేందుకే శాసనసభ నియోజకవర్గాల్లో రెసిడెన్స్ కం ఆఫీస్ భవనాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 82 పూర్తయ్యాయని, 14 భవనాల నిర్మాణం తుదిదశలో ఉందన్నారు. హైదరాబాద్ నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలం లేక నిర్మాణం జరగలేదని, త్వరలోనే వాటిని నిర్మిస్తామన్నారు. ఆర్ అండ్ బీ ద్వారా 600 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం జరుగుతోందని, పెండింగ్ బిల్లులు లేవన్నారు.
కోటి ఎకరాలకు సాగునీరు
2014కు ముందు తెలంగాణలో చెరువులు నాశనం చేశారని, వీటిని ఇప్పుడు పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. చెరువుల పునరుద్ధరణ వల్ల 15 లక్షల ఎకరాలు, పెండింగ్ ప్రాజెక్టుల వల్ల 20 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయని సీఎం తెలిపారు. అన్ని సాగునీటి వనరులు పూర్తయితే కోటి ఎకరాలకు సాగునీరు లభిస్తుందని స్పష్టం చేశారు. 2019-20 సంవత్సరంలో 225 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని, రైతులకు మంచి ధర లభిస్తోందన్నారు. తెలంగాణలో రైతులకు తాము ఇస్తున్న సౌకర్యాలు, దేశంలో ఏ ఇతర రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. రైతును రాజును చేసే వరకు నిద్రపోబోమన్నారు.
సామాజిక సమతూకం
పరిపాలనలో సామాజిక సమతూకం ఉండేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. జడ్పీటీసీల్లో బడుగు బలహీన వర్గాలకు 65 శాతం ప్రాధాన్యత ఉందని, మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 69 శాతం ఈ వర్గాల వారే ఉన్నారని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లలో 53 శాతం, మున్సిపల్ మేయర్లు, చైర్‌పర్సన్లలో 64 శాతం బడుగు, బలహీనవర్గాల వారే ఉన్నారని వివరించారు. గ్రామీణ స్థానిక సంస్థలకు నెలకు 308 కోట్ల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 148 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. గ్రామ వికాస సైన్యంతో పట్టణ వికాస సైన్యంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలే మారుతాయన్నారు. హైదరాబాద్‌లోని మూసీ నదిలో ప్రస్తుతం ఉన్న మురుగు నీళ్ల స్థానంలో వచ్చే నాలుగేళ్లలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు.
*చిత్రం...గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని శాసనమండలి ఆమోదించిన తర్వాత బయటకు వస్తున్న సీఎం కేసీఆర్