తెలంగాణ

31 వరకూ లాక్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: కరోనా నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూకు కొనసాగింపుగా ఈ నెల 31 వరకు జనం ఇళ్లకే పరిమితం కావాలని అప్పటివరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమ లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అప్పటివరకు నిత్యావసర సరుకులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పేదలు ఇబ్బంది పడకుండా 87 లక్షల పైచిలుకు తెల్లరేషన్ కార్డుదారులు అందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యంతో పాటు సరకుల కొనుగోలుకు రూ.15 వందల నగదు పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. లాక్ డౌన్ అమలులో ఉండడం వల్ల అప్పటివరకు అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను బంద్ చేయనున్నట్టు వివరించారు. బస్సులు, రైళ్లు, మెట్రోరైళ్లను బంద్ పెట్టడంతో పాటు ఆటోలు, టాక్సీలతో పాటు ఇతర ఏ వాహనాలనూ అనుమతించబోమన్నా రు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దులు అన్నింటినీ 31 వరకు మూసివేస్తున్నట్టు ముఖ్యమం త్రి తెలిపారు. కరోనాను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో మం త్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలోని పరిస్థితులపై చర్చించి లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ, సంఘీభావ సంకేతా న్ని (చప్పట్లు కొట్టడం) కనీవినీ ఎరుగని అద్భుతమైన రీతిలో
విజయవంతం చేశారని సీఎం కేసీఆర్ అభినందించారు. సంఘీభావంగా తెలంగాణ ప్రజల ఐక్యతను చాటిచెప్పిన ప్రతిఒక్కరికీ రాష్ట్ర ప్రజల పక్షాన, ప్రభుత్వ పక్షాన ధన్యవాదలు తెలుపుతున్నట్టు చెప్పారు. జనతా కర్ఫ్యూ పాటించిన రోజున కూడా రాష్ట్రంలో మరో ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో మన కోసం...సమాజం కోసం...రాష్ట్రం కోసం...దేశం కోసం...యావత్తు మానవళి కోసం లాక్ డౌన్ పాటించక తప్పదని సీఎం స్పష్టం చేశారు. ‘ఇది దుఖః సమయం. ప్రపంచమంతా భయోత్పాత స్థితిలో ఉంది. మానవజాతి కరోనాను ఎదుర్కోవడానికి ఎంతో ఇబ్బంది పడుతోంది. దయజేసి దీనిని ఎవరు కూడా ఆషామాషీగా తీసుకోవద్దు, ఎవరికి వారు వారం రోజుల పాటు స్వీయ నియంత్రణ పాటించాలి, ఒక జీవిత కాలాన్ని కాపాడుతుంది, భవిష్యత్ తరాలను, దేశాన్ని, యావత్తు మానవ జాతిని రక్షించుకోగలుగుతాం’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ సమయంలో అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులు పాలు, కూరగాయలు మందులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన శాఖల ఉద్యోగుల సేవలను మాత్రమే ఉపయోగించుకుంటామని, మిగిలిన శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వారం పాటు ఈ సెలవులను కొనసాగిస్తూ వేతనం చెల్లిస్తామన్నారు. అలాగే ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు కూడా వారం రోజుల పాటు సెలవులతో కూడిన వేతనం చెల్లించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంటువ్యాధుల నివారణ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం లాక్ డౌన్ ప్రభుత్వ, ప్రైవేట్ అన్నింటికీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. అయితే అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులకు (పౌరసరఫరాలు, విద్యుత్, మంచినీరు, మెడికల్, మీడియా) లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి అత్యవసర సేవల కోసం వారి సేవలు ప్రభుత్వానికి అవసరమన్నారు. పాలు, కూరగాయలు, మందులు వంటి అత్యవసర పనుల కోసం వెళ్లడానికి కుటుంబానికి ఒకరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎక్కడా గుమిగూడి ఉండరాదని ఆయన హెచ్చరించారు. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి స్వీయ నియంత్రణ తప్పదన్నారు. ఎవరికి వాళ్లు ఇళ్ళకే పరిమితం కావాలని సీఎం పిలుపునిచ్చారు. అనసవరంగా బయటికి వచ్చి లేని ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దన్నారు. నిర్లక్ష్యం చేసి ఇటలీ లాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దని సీఎం హెచ్చరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడే కట్టడి చేయడంతో పాటు విదేశాల నుంచి ఇక ఎవరూ వచ్చే అవకాశం లేదని తెలిపారు. చికాగో నుంచి ఒకటే ఒక్క ఫ్లయిట్ రావాల్సి ఉందని, అది కూడా ఢిల్లీకి చేరుకుందన్నారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తుల ఫోన్ నెంబర్లతో సహా పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉందన్నారు. ఇంకా అక్కడక్కడా ఎవరైనా మిగిలిపోతే వారు తమ ప్రాంతంలోనే మున్సిపల్ అధికారులకు కానీ, కలెక్టర్‌కుగానీ, పోలీసులకు గానీ ఎవరికి సమాచారం ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మీరు, మీ కుటుంబ సభ్యులేనన్న విషయం మరిచిపోవద్దని సీఎం హెచ్చరించారు.

*చిత్రం... కరోనా, జనతా కర్ఫ్యూ పొడిగింపుపై ఆదివారం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్