తెలంగాణ

అర్ధరాత్రి అనుమానితుల హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూలై 30: రంగారెడ్డి జిల్లా పరిగిలో శుక్రవారం అర్ధరాత్రి నలుగురు అనుమానితులు హల్‌చల్ సృష్టించారు. విధినిర్వహణలో ఉన్న పోలీసులు వెంబడించగా దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఓ దుండగుడిని ఎస్‌ఐ పట్టుకునేందుకు యత్నించగా తోపులాట జరిగింది. ఎస్‌ఐ చెయ్యి కొరికి పారిపోయేందుకు యత్నించిన దుండగుడు పోలీసులకు చిక్కాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన సినిమా ఫక్కిలో జరిగింది. పరిగి పట్టణంలో ట్రైనింగ్ ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి, డ్రైవర్ రవీందర్, హోంగార్డు మల్లేష్ పోలీస్ వాహనంలో శుక్రవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పరిగి బహార్‌పేట్ కొడంగల్ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. కొడంగల్ వైపునుంచి పరిగికి ఒక స్విఫ్ట్ కారు చౌరస్తాకు చేరుకుంటోంది. అన్ని వాహనాల లాగానే దీనిని కూడా తనిఖీ చేయడానికి వెళ్లగా, వారు కారు ఆపకుండా చౌరస్తా నుంచి పరిగి బస్టాండ్ వైపు వెళ్తుండటాన్ని గమనించిన ట్రైనీ ఎస్‌ఐ ఓబుల్ రెడ్డి, సిబ్బందితో వారి కారును వెంబడించారు. కారు రోడ్‌పై వెళ్లకుండా పరిగి గంజ్ రోడ్‌లోకి మళ్లింది. కారును వెంబడించిన పోలీసులు దుండగుల కారును ఇందిరా చౌక్ టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ దగ్గర పట్టుకున్నారు.
కారులో నుంచి దిగిన ఒక దుండగుడు రైఫిల్‌ను బయటికి తీసి ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిపై కాల్పులు జరపడానికి ప్రయత్నం చేశాడు. విషయం పసిగట్టిన ఓబుల్ రెడ్డి ముందుగా అతడి చేతుల్ని పట్టుకుని రైఫిల్ ఫైర్ కాకుండా అడ్డుకున్నాడు. దీంతో దుండగుడు ఎస్‌ఐ చెయ్యిని గట్టిగా కొరికాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి రోడ్‌పై దొర్లారు. అయితే డ్రైవర్ రవీందర్, హోంగార్డు మల్లేష్ ఆ దుండగుడి తలపై గట్టిగా కొట్టడంతో రైఫిల్ వదిలి పెట్టాడు. అనంతరం అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా కారులోనుంచి ఓ దుండగుడు బయటికి పారిపోయాడు. పరిగి సిఐ ప్రసాద్, జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విషయం తెలుసుకున్నారు. సంఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ నవీన్‌కుమార్ తెలిపారు. చేవెళ్ళ డిఎస్పీ శృతకీర్తి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన దుండగుడు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.