తెలంగాణ

టి.సర్కార్‌కు చెంపపెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: భూసేకరణ కోసంతెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జివో 123ని హైకోర్టు రద్దువేయడం పట్ల ప్రతిపక్షాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌లో బాణాసంచా పేల్చి, మిఠాయిలు పంచిపెట్టారు. జీవో నెం.123 ప్రతులను తగులబెట్టారు.
ఇది రైతుల విజయం: టి.పిసిసి
జివో 123, 124లను హైకోర్టు కొట్టివేయడాన్ని టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్వాగతించారు. ఇది రైతులు, రైతు కూలీల విజయమని అన్నారు. తమ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. అయితే రైతులకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన ధర్నాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇకనైనా కళ్ళు తెరవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహారించాలని హితవు పలికారు. ఒంటెత్తుపోకడలు మానుకుని, ప్రతిపక్షాలను కలుపుకుని పోవాలని సూచించారు.
నియంతృత్వ పోకడలు: లక్ష్మణ్
భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహారించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. నియంతృత్వ పోకడలతో జివోలను తీసుకుని వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నదని విమర్శించారు. భూసేకరణకు సంబంధించి 2013 చట్టాన్ని అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, రైతులు చెప్పినా, వారిని అవహేళన చేస్తూ జివో 123ని తీసుకుని వచ్చిందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలని డిమాండ్‌చేశారు.
రైతులు, రైతు కూలీల విజయం: రేవంత్
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టువంటిదని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. జివో రద్దు తెలంగాణ రైతులు, రైతు కూలీల విజయమని అన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా, ఏక్షపక్షంగా వ్యవహారించిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం 2013 చట్టాన్ని నిజాయితీగా అమలు చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దానికి భిన్నంగా వ్యవహారిస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు.
తీర్పును ప్రభుత్వం గౌరవించాలి: టి.జాక్
భూ సేకరణకోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 123 చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజాక్) కోరింది. భూ సేకరణకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 చట్టాన్ని అనుసరించి మాత్రమే భూ సేకరణ జరగాలని సూచించింది. జీవో 123 కారణంగా భూ యజమానులు, హక్కుదారులతోపాటు ఆ భూమిపై ఆధారపడిన రైతు కూలీలు నష్టపోతారని టిజాక్ చేసిన వాదనను, వెలిబుచ్చిన ఆందోళనను హైకోర్టు తీర్పు బలపరిచినట్టు అయిందని టిజాక్ పేర్కొంది. హైకోర్టు తీర్పును గౌరవించాలని, తిరిగి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు వెళ్లవద్దని, 2013 చట్టం ప్రకారమే భూసేకరణ జరగాలని డిమాండ్ చేసింది.
తీర్పును గౌరవించాలి
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని టిజెఎసి రాష్ట్ర కో-ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. 2013లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం ప్రకారమే భూ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు. జివో 123 ప్రకారం భూమి యజమానులు, హక్కుదారులతోపాటు ఆ భూమి మీద ఆధారపడిన రైతు కూలీలు నష్టపోతారని తాము లోగడ వ్యక్తం చేసిన ఆందోళనలకు కోర్టు తీర్పు బలపరుస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని పోరాటాలు: తమ్మినేని
కోర్టు తీర్పుతో మరిన్ని పోరాటాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. హరితహారం పేరుతో పోడు రైతుల భూములు లాక్కున్న తీరుపై కూడా కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ అంశంపై శుక్రవారం ఇందిరా పార్కు వద్ద ధర్నా కార్యక్రమం చేపడతామని అన్నారు.
రైతులు, ప్రతిపక్షాల విజయం: పొన్నం
కోర్టు తీర్పు రైతుల, ప్రతిపక్షాల విజయమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. జివో నెంబర్ 123ని తీసుకుని వచ్చి రైతుల వద్ద నుంచి బలవంతంగా రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటూ రియల్ వ్యాపారం చేసుకుంటున్న ప్రభుత్వానికి ఈ తీర్పు గుణపాఠం అవుతుందని అన్నారు.
అప్పీలుకు వెళ్ళొద్దు: షబ్బీర్ అలీ
కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ లోగడ ఏ ప్రభుత్వానికి కోర్టు ఇన్ని మొట్టికాయలు వేయలేదని తెలిపారు. ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని దామోదర రాజనర్సింహా అన్నారు.
తీర్పు హర్షణీయం: వైకాపా నేత గట్టు
జివో 123ని కోర్టు రద్దు వేయడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కోర్టు తీర్పు గుణపాఠమని అన్నారు.

అప్పీల్‌కు వెళ్తాం
హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 3: భూ సేకరణకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 123ను రద్దు చేసిన హైకోర్టు తీర్పుపై ధర్మాసనానికి అప్పిల్‌కు వెళతామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జీవో 123ని హైకోర్టు ఏ కారణంగా రద్దు చేసిందో తీర్పు కాపీని పూర్తిగా చదివిన తర్వాతే స్పందిస్తానని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 చట్టానికి లోబడే సాగునీటి ప్రాజెక్టుల కోసం భూ సేకరణను వేగవంతం చేయడంకోసమే జీవో 123ను తీసుకువచ్చినట్టు మంత్రి వివరించారు. జీవో 123ద్వారా పేదలకు, నిర్వాసితులకు మరింత మెరుగైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం భావించిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన వారికి మేలు చేయడంకోసమే పని చేస్తుందని మంత్రి అన్నారు.