ఆంధ్రప్రదేశ్‌

తెలంగాణ ప్రాజెక్టులతో గోదావరి డెల్టా ఎడారే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఇప్పుడే అడ్డుకోపోతే భవిష్యత్తులో గోదావరి డెల్టా ప్రాంతం ఎడారిగా మారుందని సాగునీటిరంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండుచేశారు. భీమవరంలో రైతు కార్యాచరణ సమితి ‘డెల్టా పరిరక్షణ’ పేరుతో ప్రజాప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, రైతులతో శుక్రవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది. సాంకేతిక నిపుణులు ప్రొఫెసర్ పిఎ రామకృష్ణంరాజు, అక్కినేని భవానీ ప్రసాద్, రిటైర్డ్ నీటిపారుదలశాఖ అధికారులు తెలంగాణ ప్రాజెక్టుల కారణంగా భవిష్యత్తులో పొంచివున్న ప్రమాదాన్ని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో కోటి ఎకరాలను సాగులోకి తీసుకువస్తానని ప్రకటించిన నేపథ్యంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుని తీరాలని నిపుణులు సమావేశానికి హజరైన ప్రజాప్రతినిధులకు స్పష్టంచేశారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుమాట్లాడుతూ రైపేరియన్ రైట్స్ ప్రకారం గోదావరి అథారిటీ డెల్టాప్రాంతానికి పూర్తిస్ధాయిలో నీటిని ఇవ్వాలని డిమాండ్‌చేశారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ కెసిఆర్ ఇష్టానుసారంగా గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించడం సరికాదన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌రావుమాట్లాడుతూ ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై రాజకీయాలకు అతీతంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ కెసిఆర్ తన పుట్టిన గడ్డనే ఎడారిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశ నిర్వాహకులు రైతుకార్యాచరణ సమితి గౌరవ అధ్యక్షుడుయర్రా నారాయణస్వామి మాట్లాడుతూ గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై ప్రజాప్రతినిధులు తాడోపేడో తేల్చాలన్నారు. అధ్యక్షుడు ఎంవి. సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఆ ప్రాజెక్టులను వెంటనే నిలుపుచేయకపోతే డెల్టాను బతికించుకోలేమన్నారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుతో కలిసి రైతుకార్యాచరణ సమితి కమిటీగా ఏర్పడింది.

సంగమేశ్వరుడిని
చుట్టుముట్టిన కృష్ణమ్మ

ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, ఆగస్టు 5: కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వర ఆలయం మరో రెండు రోజుల్లో పూర్తిగా నీట మునగనుంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం 837 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయాన్ని కృష్ణాజలాలు చుట్టుముట్టాయి. ఆదివారం సాయంత్రం సంగమేశ్వరుడి ఆలయం జల గర్భంలోకి చేరుకోనుంది. గత ఏడాది అక్టోబర్ మాసంలో జలాశయం నుంచి ఆలయం బయటపడింది. ఎన్నడూ లేని విధంగా 10 నెలల పాటు సంగమేశ్వరుడు ప్రత్యేక పూజలందుకున్నాడు. భీముడు ప్రతిష్ఠించినట్లుగా చరిత్రలో ఉన్న భీమలింగం మూడు దశాబ్దాల తరువాత తొలిసారి భక్తులకు దర్శనమిచ్చింది. జలాశయం నీటిమట్టం 820 అడుగులకు చేరుకోగానే భీమలింగం కృష్ణాజలాల్లో మునిగిపోయింది. భీమలింగం మళ్లీ ఎప్పుడు దర్శనమిస్తుందో వేచి చూడాలి.

నీటిపిల్లుల రాక !
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటితో పాటు ఎగువ నుంచి వస్తున్న చేపలను వేటాడేందుకు నీటి అట్టడుగున ఉన్న నీటిపిల్లులు శుక్రవారం సందడి చేశాయి. పాతాలగంగ వద్ద ఒడ్డుకు వచ్చిన నీటిపిల్లులు చేపలను వేటాడుతూ పర్యాటకులను ఆహ్లాదపరిచాయి. నీటికుక్కలుగా పిలిచే ఈ జంతువులు చేపలను వేటాడేందుకు ఒడ్డుకు రావడంతో సున్నిపెంటలోని అటవీ అధికారులు పరిశీలించారు.

పుష్కర ఘాట్లలో శ్రావణ సందడి

పెరుగుతున్న భక్తుల రద్దీ ఆరో రోజుకు అంత్య పుష్కరాలు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం/్భద్రాచలం, ఆగస్టు 5: అంత్య పుష్కర స్నానాలకు శ్రావణ సందడి తోడైంది. శ్రావణ శుక్రవారం గోదావరి జిల్లాల్లోని స్నాన ఘట్టాల్లో విశేష రీతిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. శుక్రవారంతో అంత్య పుష్కరాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. అధికారులు అంచనా వేసినట్టుగానే శ్రావణ మాస విశిష్టత తోడై భక్తుల సంఖ్య పెరిగింది. ప్రధానంగా మహిళలు అథికంగా వచ్చి స్నానాలు ఆచరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల రద్దీ అధికంగానేవుంది. రాజమహేంద్రవంతో పాటు కోటిపల్లి, అంతర్వేది, అప్పనపల్లి, రావులపాలెం, మందపల్లి, అయినవిల్లి, రాజోలు, ముమ్మిడివరం, ముక్తేశ్వరం, కుండలేశ్వరం, కొవ్వూరు, నరసాపురం, తీపర్రు, పట్టిసం, కోడేరు, చించినాడ తదితర స్నాన ఘట్టాల్లో స్థానికంగావున్న భక్తులు అత్యధికంగా పుష్కర స్నానాలు ఆచరించారు. అఖండ గోదావరి ప్రాంతం రాజమహేంద్రవరంలో ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం తండోపతండాలుగా పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కరఘాట్‌లో అఖండ హారతి కార్యక్రమం విశేషత సంతరించుకోవడంతో ఉదయం వచ్చిన భక్తులు స్నానాలు ఆచరించి, ఆపై మధ్యాహ్నం షాపింగ్ చేసుకుని సాయంత్రం వేళ అఖండ హారతి తిలకించేందుకు వేలాదిగా వేచివుండటం కన్పించింది. రాజమహేంద్రవరం పరిధిలోవున్న స్నాన ఘట్టాల్లో శుక్రవారం సుమారు 47 వేల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు అంచనా వేశారు. ప్రధానంగా పుష్కర ఘాట్‌లో రద్దీ అధికంగా కన్పించింది.
సరసర్వతి విఐపి ఘాట్, గౌతమీ ఘాట్‌లలో రద్ధీ అధికంగా కన్పించింది. మిగిలిన కోటిలింగాల ఘాట్, మార్కండేయ, శ్రద్ధానంద, టిటిడి, పద్మావతి ఘాట్లలో రద్ధీ అంతగా కనిపించలేదు. గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ఉద్ధృతి పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా నీటి మట్టం పెరిగింది. ఘాట్లలో నీటి మట్టం స్నానాలకు అనువుగా వుండే విధంగా ప్రవాహ మట్టాన్ని బ్యారేజి వద్ద ఎప్పటికపుడు నియంత్రిస్తున్నారు.
కాగా ఖమ్మం జిల్లా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు శుక్రవారం భక్తులతో సందడిగా కనిపించాయి. అంత్యపుష్కరాల్లో ఆరవ రోజు, శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో తీరం రద్దీగా మారింది. మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. పుష్కర స్నానాలు ఆచరించారు. తర్పణాలు వదిలి పిండప్రదానాలు చేశారు. అనంతరం పునర్వసు మంటపంలో ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ప్రచారమూర్తులను దర్శనం చేసుకున్నారు. తొలి శుక్రవారం కావడంతో రామాలయంలో లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం చేశారు. ఆండాళ్లమ్మ తిరునక్షత్రోత్సవాల ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భద్రుని కోవెలలో రామపాదుకలకు అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం గోదావరి నదికి హారతులు ఇచ్చారు. గంగానమ్మకు గాజులు, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గంధం, పుష్పాలు సమర్పించారు.

మాజీ మంత్రి కోనేరు మృతి
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 5: మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోనేరు నాగేశ్వరరావు(79) గుండెపోటుతో శుక్రవారం ఉదయం ఆయన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారకరామారావుకు అత్యంత సన్నిహితునిగా కోనేరుకు పేరుంది. మూడుసార్లు ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోనేరు నాగేశ్వరరావు, ఉమ్మడి రాష్ట్రంలో చిన్నతరహా నీటిపారుదల శాఖామంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. కోనేరు వారసుడిగా ఆయన చిన్నకుమారుడు కోనేరు సత్యనారాయణ గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. కోనేరు మృతదేహాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తి, శిశుసంక్షేమశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీచైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ ఎమ్మెల్సీలు పువ్వాడ నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతదితరులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోలీసు లాంచనాలతో అంత్యక్రియలు
హైదరాబాద్: మాజీ మంత్రి కోనేరు నాగేశ్వర్‌రావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కోనేరు నాగేశ్వర్‌రావు అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు.