తెలంగాణ

మ్యాన్‌హోల్ మింగేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: మాదాపూర్ హైటెక్ సిటీలో విషాదం చోటుచేసుకుంది. అయ్యప్ప సొసైటీలోని మ్యాన్‌హోల్‌లో పడి నలుగురు కార్మికులు మృతి చెందారు. శనివారం వ్యర్థాలతో నిండిన మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఐదుగురు కార్మికులు 25 అడుగుల లోతులోని మ్యాన్‌హోల్‌లోకి దిగారు. విషయవాయువుల కారణంగా నలుగురు కార్మికులు మృతి చెందారు. అస్వస్థకు గురైన ఒకరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు సికిందరాబాద్ మాణికేశ్వరినగర్‌కు చెందిన వారుగా గుర్తించారు. ఫైరింగ్, జిహెచ్‌ఎంసి సహాయక సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు శ్రీనివాస్, నగేష్, సత్యనారాయణ, గంగాధర్‌గా గుర్తించారు. వీరు కాంట్రాక్ట్ కార్మికులని, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహాలతో స్థానికులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబీకులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల కార్మిక దినోత్సవం రోజే ఇద్దరు కార్మికులు మ్యాన్‌హోల్ నుంచి వ్యర్థాలను తీసే క్రమంలో ఊపిరాడక మృతి చెందిన సంఘటన మరువకముందే తాజాగా శనివారం జరిగిన సంఘటన స్థానికులను కలచివేసింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఇదే ప్రాంతంలో జరిగాయి. మ్యాన్‌హోల్‌ను తగిన జాగ్రత్తలు తీసుకొని శుభ్రం చేయాల్సి ఉండగా ఎలాంటి పరికరాలు, సౌకర్యాలు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి మరోసారి జిహెచ్‌ఎంసి నిర్లక్ష్యం తేటతెల్లమైంది.

చిత్రం... క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న వైద్య సిబ్బంది