తెలంగాణ

అగ్గి రాజేసిన కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ వరంగల్, ఆగస్టు 22: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అంశం కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ అగ్గి రాజేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిరసన సెగలు కక్కుతున్నాయి. సిరిసిల్లను జిల్లాల జాబితాలో నుంచి తొలగించడంతో ఆ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యం నిరసన కార్యక్రమాలు జరుగుతుండగా, తాజాగా సోమవారం సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ల యజమానుల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. 300 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్లను రోడ్లపైనే నిలిపివేసి దిగ్భంధించారు. అనంతరం గాంధీచౌక్ కూడళిలో మహా ధర్నా చేపట్టారు. దీంతో సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ స్థంభించగా, ప్రజలు ఇబ్బందులుపడ్డారు. అలాగే సిరిసిల్లను జిల్లాగా చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల-తంగళ్ళపల్లి మానేరు వంతెనపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. వీటితోపాటు నోటిఫికేషన్‌లో కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించక పోవడాన్ని నిరసిస్తూ కోరుట్ల డివిజన్ సాధన కమిటీ అధ్వర్యంలో కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం కోరుట్ల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అటు సిద్దిపేటలో హుస్నాబాద్, కోహెడ మండలాలను కలపవద్దంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేడు వంటావార్పు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
మంత్రి కెటిఆర్ ఫ్లెక్సీకి నిప్పు
జిల్లాల పునర్విభజన ముసాయిదాలో సిరిసిల్లకు చోటు దక్కకపోవడంతో జనాగ్రహం కట్టలు తెచ్చుకుంది. జిల్లా సాధన కోసం కదం తొక్కింది. ఎల్లారెడ్డిపేటలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నాయకులు, విద్యార్థులు సోమవారం ఆందోళన బాట పట్టారు. స్థానిక పాత బస్టాండు ప్రాంతంలో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలను చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. మంత్రి కెటిఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. సిరిసిల్ల జిల్లాను ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల బంద్‌కు పిలుపునిచ్చారు.
జనగామలో కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకటించిన ముసాయిదాలో వరంగల్ జిల్లాలో కొత్తగా జనగామ జిల్లా పేరు లేకపోవడం పట్ల అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జనగామ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కెసిఆర్ కక్ష కడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం జనగామలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అంతేకాకుండా మంగళవారం నుండి జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు.
కాగా ప్రభుత్వం డ్రాఫ్ట్ విడుదల చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు జెఎసి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా ములుగు జిల్లా ఏర్పాటుపై కూడా నేడు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జెఎసి నేత నల్లెల కుమార్ తెలిపారు.