తెలంగాణ

ఉద్ధృతమవుతున్న ‘విభజన’ సెగలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ/ కరీంనగర్/ వరంగల్, సెప్టెంబర్ 12: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియపై ప్రజల నుండి అభ్యంతరాలు, నిరసనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. నల్లగొండ జిల్లాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలుగా పునర్విభజన చేస్తూ వెలువరించిన ముసాయిదా ప్రతిపాదనలపై ఇప్పటిదాకా 10,225 అభ్యంతరాలు నమోదవ్వగా వాటిలో అత్యధికంగా యాదాద్రి జిల్లాకు సంబంధించి 9,699 అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. ముసాయిదా ప్రతిపాదనలపై ప్రత్యక్ష ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నాగార్జున సాగర్‌ను మండలంగా చేయాలంటూ అక్కడి ప్రజలు చేపట్టిన నిరవధిక ఆందోళన క్రమంలో సోమవారం సాగర్ పైలాన్ వద్ధ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. వేములపల్లి మండల ప్రజలు తమ మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపవద్దని, ముసాయిదా ప్రతిపాదనల మేరకు నల్లగొండ జిల్లా పరిధిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహించారు. నూతనకల్ మండల వాసులు మండల విభజనను, మద్ధిరాల మండల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దంతాలపల్లి-సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేసి తహశీల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కేతెపల్లి మండలవాసులు తమ మండలాన్ని నల్లగొండ నుండి సూర్యాపేటకు మార్చాలని డిమాండ్ చేస్తు 65వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భువనగిరి రెవెన్యూ డివిజన్‌లోని ఆలేరు, రాజాపేట, గుండాల మండలాలను జనగామ డివిజన్‌లో కలుపవద్ధని టిడిపి నేత మోత్కుపల్లి నరసింహులు అఖిలపక్ష బృందంతో వెళ్లి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. అడవిదేవుపల్లి గ్రామస్తులు తమ గ్రామాన్ని కొత్త మండల కేంద్రం చేయాలని, హుజూర్‌నగర్ వాసులు తమ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రం చేయాలంటు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసి డిఆర్‌వోకు వినతి పత్రాలు అందించారు. అటు ఆత్మకూర్(ఎం) మండలం పరిధిలో చాడ రెవెన్యూ గ్రామాల ప్రజలంతా తమ గ్రామాలను మోటకొండూరులో కలుపవద్దని, ఆత్మకూర్(ఎం)లోనే కొనసాగించాలంటు పంచాయితీల్లో తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు.
జిల్లాల పునర్విభజనపై కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల నిరసన జ్వాలలు హోరెత్తుతున్నాయి. సిరిసిల్లను జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ సోమవారం సిరిసిల్ల పట్టణంలో నిరసనలు జరిగాయి. ఇందులో భాగంగానే ఓటు వేసి మూడుసార్లు కెటిఆర్‌ను సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపించి తప్పిదం చేశామంటూ ప్రాయశ్చితంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో తమ పాదరక్షలతో ఎవరికివారు కొట్టుకుంటూ నిరసన తెలిపారు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు స్వర్గం ప్రసాద్, గాజుల బాలయ్యలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో టిఆర్‌ఎస్ గద్దె కూల్చివేశారు. టిఆర్‌ఎస్ గద్దెను కూల్చింది దండు నరేష్ అని భావించి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదడంతో సిరిసిల్ల జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ఆవూనూరి రమాకాంత్‌రావు ఆధ్వర్యంలో నాయవాదులు, అఖిలపక్షం నాయకులు ఎల్లారెడ్టిపేట పాత బస్టాండు ప్రాంతంలో ఆందోళనకు దిగారు. కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం మెట్లపై జిల్లా సాధన కమిటీ సభ్యులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలంటూ హుస్నాబాద్‌లో రిలే దీక్షలను చేపట్టిన ఆందోళనకారులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఇచ్చిన హుస్నాబాద్ బంద్ సక్సెస్ అయింది. బంద్ సందర్భంగా ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్‌లోనే కొనసాగించాలంటూ కోహెడలో, రుద్రంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని రుద్రంగిలో రిలే దీక్షలు కొనసాగాయి. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల సాధన కమిటీ, జెఎసి ఆధ్వర్యంలో తరలివచ్చిన కోరుట్ల వాసులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.
జనగామ జిల్లా ఏర్పాటు చేసే వరకు ఆందోళనలు విరమించేది లేదని జనగామ జిల్లా సాధన సమితి నాయకులు తీర్మానించారు. ఈ నెల 14న నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మానవహారం, 16న నియోజకవర్గ పరిధిలో భారీ ర్యాలీలు, 20న జనగామలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సత్తా చాటాలని జనగామ జిల్లా సాధన సమితి తీర్మానించింది. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గవర్నర్ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. పరకాల డివిజన్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష సోమవారం సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకమై భారీ రాస్తారోకో నిర్వహించారు.