తెలంగాణ

కరుణించిన వరుణుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు బలంగా ఉన్నాయి. రుతుపవనాలకు తోడుగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండం, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో గత నాలుగైదు రోజుల నుండి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుండి మంగళవారం సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. ప్రభుత్వ ఆదేశాలమేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు స్వయంగా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో దాదాపు 15-20 రోజుల పాటు వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశకు చేరిన సమయంలో వరణుడు కరుణించడంతో రైతుల్లో ఆనందం తాండవిస్తోంది. జొన్న, మొక్కజొన్న, ఆముదం, సజ్జ, పొద్దుతిరుగుడు, కందులు తదితర పంటలకు మళ్లీ జీవం వచ్చింది. రాజధాని హైదరాబాద్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గత ఐదురోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరింది. ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దాంతో ప్రధాన చౌరస్తాలలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రంగారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. హయత్‌నగర్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, వికారాబాద్, తాండూరు, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో మంచివర్షాలు కురిశాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం రాత్రి నుండి మంగళవారం సాయంత్రం వరకు కూడా ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి. జిల్లాలోని 59 మండలాల్లో కూడా గత 24 గంటల్లో బాగానే వర్షం కురిసింది. జిల్లాలోని మూసి తదితర వనరుల ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చి చేరుతోంది. మంగళవారం అందిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో ఒకలక్ష క్యూసెక్కుల నీరు పులిచింతలలోకి చేరింది. దాంతో 40 టిఎంసిల నీటినిలువ సామర్థ్యం ఉన్న పులిచింతలలో ప్రస్తుతం నీటినిలువ 19.36 టిఎంసిలకు చేరింది. దాంతో ముంపునకు గురైన గ్రామాల నుండి ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు. ఇలా ఉండగా కేతెపల్లి సమీపంలోని మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, మంగళవారానికి 640.50 అడుగులకు చేరింది. నల్లగొండ జిల్లాలో 4762 చెరువులు ఉండగా, 332 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. మిగతా చెరువులు, కుంటల్లోకి కూడా భారీగా నీరు చేరుతోంది.
కరీంనగర్ జిల్లాలోని 17 మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఇతర మండలాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలో సోమవారం రాత్రి నుండి మంగళవారం రాత్రివరకు కుండపోత వర్షం కురిసింది. జిల్లాలోని అచ్చంపేట, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, ఆత్మకూరు, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో భారీగా వర్షం కురిసింది. మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. స్వయంగా జిల్లాకలెక్టర్ కార్యాలయం ఆవరణ అంతా నీటితో నిండిపోయింది.
ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దాదాపు 20 లక్షల హెక్టార్లలోని పత్తి, సోయాబీన్ పంటలకు ప్రాణం వచ్చినంత పనైంది. ఈ వర్షాలు పంటలకు ఏ విధంగా, ఎంత మేరకు ఉపయోగపడతాయన్న అంశంపై వ్యవసాయ శాఖ కమిషనర్ జిడి ప్రియదర్శిని జిల్లాల నుండి సమాచారం తెప్పించుకుంటున్నారు. సమాచారం పూర్తిగా వచ్చిన తర్వాత మదింపు వేస్తారు. ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిసింది. తాజా పరిస్థితిపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నతాధికారులతో సమీక్షించారు.

భారీ వర్షంతో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో చేరిన వరదనీరు... నల్లగొండ జిల్లా నిడమనూర్‌లో పత్తిచేనులో నిలిచిన వర్షపునీరు..
పులిచింతలలో 19.36 టిఎంసిలకు చేరిన వరదనీరు