తెలంగాణ

ఆగని కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడిసి ముద్దయిన పాలమూరు
3 గంటలు కుంభవృష్టి
పొంగిపొర్లిన పెద్ద చెరువు
నల్లగొండ జిల్లాలో మూసీకి వరద
కరీంనగర్, వరంగల్ అతలాకుతలం
రంగారెడ్డిలో పొంగిన వాగులు
కొట్టుకుపోయిన రైలు పట్టాలు
వికారాబాద్-బీదర్ మధ్య నిలిచిన రైళ్లు

అల్పపీడనంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆనందం నింపుతున్నాయ. ఒకపక్క వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే... మరోపక్క రైతుల గుండెలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయ. తెలంగాణవ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరిపి లేని వాన కొన్నిచోట్ల బీభత్సాన్ని సృష్టించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, మరికొన్నిచోట్ల కాలనీలు నీటమునిగాయ. రహదారులు చెరువులను తలపించాయ. పాలమూరులో పెద్దచెరువు, వరంగల్‌లో భద్రకాళి చెరువు మత్తడికి గురయ్యాయ. నల్లగొండ జిల్లాలో మూసీ పొంగింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. అటు వర్షానికీ, ఇటు వరదకూ నోచుకోని సింగూరుకు ఎట్టకేలకు వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో మెతుకు సీమలోని రైతుల ఆనందానికి అవధుల్లేవు.

కరువు తీరేలా...
ప్రాజెక్టులకు జలకళ... అన్నదాతల ఆనంద హేల

తెలంగాణ అంతటా వర్ష బీభత్సం
పాలమూరును ముంచెత్తిన వాన
ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
నల్లగొండ జిల్లాలో పొంగిన మూసీ
కరీంనగర్‌లో పిడుగులు.. ఒకరి మృతి
వరంగల్, హన్మకొండలో భారీ వర్షం
మత్తడి పడిన భద్రకాళి చెరువు
ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం

మహబూబ్‌నగర్/ నల్లగొండ/ కరీంనగర్/ వరంగల్/ ఆదిలాబాద్/ మెదక్, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుండి గురువారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేని కుండపోత వర్షం పడింది. పాలమూరు పట్టణాన్ని వర్షం ముంచెత్తింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర గంటల వరకు ఎడతెరిపి లేని కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాకాలంలో ఇంత వాన కురియడం ఇది రెండవసారి. భారీ వర్షానికి పెద్దచెరువు కాలువ పొంగిపొర్లింది. అయితే అలుగు పారిన వరద నీరు మాత్రం ఇళ్ల మధ్యలోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో కురిసి భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోకి వర్షం నీరు వచ్చిచేరింది. కొత్తబస్టాండ్ దగ్గర గల పెద్దచెరువు కాలువ పొంగిపొర్లడంతో బస్టాండ్ అంతా నీటితో మునిగిపోయింది. కాలువ వరదనీరు ఒక్కసారిగా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోకి రావడంతో కలెక్టరేట్ ఆవరణ చెరువును తలపించింది. అదేవిధంగా న్యూటౌన్‌లో నాలుగైదు అడుగుల మేర నీటితో మునిగిపోయంది. దాంతో హైదరాబాద్, రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మూడు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై ఉన్న డివైడర్లు వాననీటి వరదతో కొట్టుకుపోయాయి. ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చిచేరడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పెద్ద చెరువు అలుగుపరడంతో బికేరెడ్డి కాలనీలోకి అలుగునీరు వచ్చి చేరింది. ఇదిలా ఉండగా మహబూబ్‌నగర్ జిల్లాలో కొడంగల్, వనపర్తి, దరూర్, గద్వాల, కొడంగల్, బొంరాస్‌పేట, కోస్గి, షాద్‌నగర్, కొత్తూరు, వెల్దండ, ఇటిక్యాల, వీపనగండ్ల, పెద్దమందడి, కల్వకుర్తి మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది.
నల్లగొండ జిల్లాలో వర్షాల జోరు గురువారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 59 మండలాల్లో ముసురు వర్షాలు, భారీ వర్షాలు కురువగా జిల్లాలో సగటున 18 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పోచంపల్లిలో 78.2, బీబీనగర్‌లో 66.4, భువనగిరిలో 62.2, బొమ్మలరామారంలో 55.4, ఆలేరులో 45, సూర్యాపేటలో 35.8, యాదగిరిగుట్టలో 35.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జంటనగరాలతో పాటు జిల్లాలో కురిసిన వర్షాలతో మూసీ నది పొంగి బీబీనగర్ మండలం రుద్రవెల్లి, బట్టుగూడెం, పోచంపల్లి మండలం జూలురు, పెద్దరావుల పల్లి రోడ్ కాజ్‌వేల మీదుగా ప్రవహించడంతో ఆ రెండు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ బునాదిగాని కాలువకు బ్రహ్మణపల్లి వద్ద గండి పడింది. రాయరావుపేట గుట్టల వరద నీరు సమీపంలోని కోళ్ల పెంపకం షెడ్‌లలోకి చేరడంతో 7 వేల కోళ్లు మృతి చెందాయి. కేతెపల్లి మండలం బొప్పారం చెరువు అలుగు వరద ధాటికి 200ఎకరాల పంటలు నీట మునిగాయి. మూసీ ప్రాజెక్టులోకి 13,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో పూర్తి నీటి మట్టం 645కు గాను 643 అడుగులకు చేరింది. ఏ క్షణానైనా గేట్లు ఎత్తేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటు పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉదృతి కొనసాగుతుండగా ప్రాజెక్టు నీటిమట్టం 23 టిఎంసిలు దాటింది.
కరీంనగర్ జిల్లాలో గురువారం విస్తారంగా వర్షాలు కురిసాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంలో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ సంఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. పిడుగుపాటుకు శంకరపట్నం మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన మెడిచెల రాజయ్య (36) అనే వ్యక్తి మృతిచెందగా, కన్నబోయిన రాజయ్య అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే కోహెడ మండలంలోని శనిగరం-తంగళ్లపల్లి గ్రామాల మధ్యలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకై స్తంభంపైకి ఎక్కి మరమ్మత్తులు చేస్తున్న క్రమంలో పిడుగుపడగా జూనియర్ లైన్‌మెన్ ఎం.డి.హరుూమోద్దీన్ విద్యుత్ షాక్‌కు గురై కిందపడి తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక్కడే మరో ఇద్దరికి స్వల్పంగా గాయపడ్డారు. కాగా, కరీంనగర్ జిల్లాలోని కేశవపట్నంలో 10 సెం.మీ, కమలాపూర్ 8, కోహెడలో 6, బెజ్జంకి, చిగురుమామిడిల్లో 5, సైదాపూర్, ముస్తాబాద్‌ల్లో 4, గంగాధరలో 3, ఎల్కతుర్తి, మల్లాపూర్, కోరుట్ల, మేడిపల్లి, వేములవాడ, బోయినిపల్లి, కరీంనగర్‌ల్లో 2 సె.మీటర్ల చొప్పున వర్షం కురిసింది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
వరంగల్ నగరంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరంతా లోతట్టుప్రాంతాలలోని ఇళ్లలోకి చేరుకోవడంతో నగర ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. దాదాపు 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వరంగల్ భద్రకాళి చెరువు మత్తడి పడింది. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే విధంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన ఏటూరునాగారం, మంగపేట, ములుగు, గోవిందరావుపేట తదితర ప్రాంతాలలో పెద్దగా వర్షం పడలేదు. ఆరు మండలాల్లో వర్షమేలేదు. 20 మండలాల్లో 1 సెం.మీ. వర్షం పాతం మాత్రమే నమోదైంది. 13మండలాల్లో 1-3 సెం.మీటర్ల వర్షపాతం నమోదుకాగా, మరో 10 మండలాల్లో 3-6, రెండు మండలాల్లో 6-12 వర్షపాతం నమోదైంది. ఈవర్షాలతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ డివిజన్లలో వర్షాలు ముంచెత్తాయి. ఇదేరోజు గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుభీర్ మండలం సొనారి గ్రామానికి చెందిన లస్మన్న (65) అనే వృద్ధుడు పిడుగు పడి మృతి చెందగా అదేచోట ఓ గేదె కూడా పిడుగుపాటుకు మృతి చెందింది. ఆదిలాబాద్, బోథ్, ఇచ్చోడ, నిర్మల్, లోకేశ్వరం, దండేపల్లి, లక్సెటిపేట్‌లో 3.5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు ఖరీఫ్ పంటలకు అనుకూలించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 925 మి.మీ.కు గాను ఇప్పటివరకు 956.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. కరవు రక్కసితో కొట్టుమిట్టాడుతున్న మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నాడు వెల్దుర్తి మండలంలో అత్యధికంగా 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకాగా గురువారం నాడు న్యాల్‌కల్ మండలంలో అత్యధికంగా 7.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఝరాసంగం, రాయికోడ్‌లో 6.7 సెం.మీ., ములుగులో 6.3 సెం.మీ., మనూర్‌లో 6 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం తూప్రాన్‌లో సుమారు నాలుగు గంటల పాటు భారీ వర్షం కురియగా మనూర్, న్యాల్‌కల్, జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల్లో వర్షం భారీగానే కురిసింది. కురుస్తున్న వర్షాలతో అన్నదాతలో సరికొత్త ఆశలు చిగురింపజేసింది.

వికారాబాద్ అతలాకుతలం

వాగుల్లో గల్లంతై ఇద్దరి మృతి స్తంభించిన రవాణా.. ధ్వంసమైన పంటలు
కొట్టుకుపోయిన రైలుపట్టాలు.. నిలిచిన రాకపోకలు

వికారాబాద్, సెప్టెంబర్ 15: రంగారెడ్డి జిల్లా వికారాబాద్ డివిజన్‌లో కురిసిన భారీవర్షానికి జనజీవనం స్తంభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగడంతో భారీనష్టం సంభవించింది. బుధవారం వర్షం భారీగా కురియడంతో వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లి గ్రామానికి చెందిన సరిత, ధారూర్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన వౌలానా మృతిచెందారు.
కోహిర్ మండలం మల్‌శెట్టిపల్లి గ్రామానికి చెందిన తుల్జారాం, మల్లేశ్‌యాదవ్‌లు కారులో తాండూరు వెళుతుండగా, వరధ ఉద్ధృతిలో కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు చెట్టు వద్ద కారు ఆగడంతో వారు ఇద్దరూ దిగి సురక్షితంగా బయటపడ్డారు. వారి కోసం రాత్రంతా పోలీసులు గాలించారు. సురక్షితం అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్-సదాశివపేట రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు పట్టాలు కొట్టుకుపోవడంతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బుధవారం రాత్రి డ్రైవర్ అప్రమత్తతో ఇంటర్‌సిటీ రైలుకు ప్రమాదం తప్పింది. గురువారం షిరిడి నుండి రావాల్సిన మన్మాడ్ రైలును రద్దు చేయగా, బెంగుళూరు నుండి బీదర్ వెళ్ళాల్సిన రైలును రద్దు చేశారు.
పూర్ణా వరకు హైదరాబాద్ నుండి నడపాల్సిన రైలును వికారాబాద్ వరకు నడిపి తిరిగి హైదరాబాద్‌కు మళ్ళించారు. మధ్యాహ్నం బెంగుళూరు నుండి నాందేడ్ మధ్య నడిచే లింకు రైళ్లను సికిందాబాద్ మీదుగా నడిపారు. యశ్వంత్‌పూర్ నుండి బీదర్ వెళ్ళాల్సిన ప్రయాణికుల కోసం వికారాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
భారీగా పంట నష్టం
భారీ వర్షం కారణంగా పంటనష్టం భారీ స్థాయిలోనే జరిగింది. ఊహించని రీతిలో వర్షం కురియడంతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తగడి సమీపంలో బ్రిడ్జిపై నుండి వాగు పొంగి రావడంతో సమీప పొలాలన్నీ నీట మునిగాయి. బ్రిడ్జిపై నుండి వచ్చే ఆర్టీసీ బస్సుకు డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది.
నిలిచిపోయిన రాకపోకలు
వర్షం కారణంగా రోడ్లు పాడవడం, బ్రిడ్జిలు కూలిపోవడం, వాగులు పొంగడం రాకపోకలు నిలిచిపోయాయి. నస్కల్ మీదుగా పరిగికి వెళ్ళాల్సిన బస్సులను రద్దు చేసి మనె్నగూడ మీదుగా నడిపారు. మన్‌సాన్‌పల్లి వద్ద వాగు రావడంతో వికారాబాద్-తాండూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్-2 డిపో బస్సులను వికారాబాద్ వరకే నడపగా, తాండూర్ వెళ్ళాల్సిన బస్సులను ధారూర్ వరకే నడిపారు. కోట్‌పల్లి, బంట్వారంకు నడిచే బస్సులను రద్దు చేశారు.
బిఎస్‌ఎన్‌ఎల్ సేవలకు తీవ్ర అంతరాయం
భారీవర్షం కారణంగా ఫోన్‌సేవలు సైతం నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌సంచార్ నిగమ్ లిమిటెడ్ కనెక్షన్ ఉన్న వినియోగదారులంతా ఇబ్బంది పడ్డారు. బుధవారం రాత్రి నుండి గురువారం సాయంత్రం వరకు బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు సేవలు పునరుద్ధరించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇంత వర్షం కురిసినా నిండని శివసాగర్ చెరువు
ఇంత భారీవర్షం కురిసినా వికారాబాద్ ప్రజల దాహార్తిని దశాబ్దాల కాలంగా తీరుస్తూ వచ్చిన శివసాగర్ చెరువు మాత్రం నిండలేదు, అలుగెల్లలేదు. ఇటీవలే చెరువులో పూడిక తీయడంతో నీరు భూమిలోకి ఇంకి చెరువు అలుగెల్లడం లేదని శివారెడ్డిపేట వాసులు అంటున్నారు.
వర్షాలకు కూలిన ఇళ్ళు
వర్షాల కారణంగా డివిజన్‌లో 110 ఇళ్ళు పాక్షికంగా, మూడు పూర్తిగా కూలిపోయాయి. బషీరాబాద్ మండలంలో రెండు ఇళ్ళు పూర్తిగా కూలిపోగా, తొమ్మిది ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మర్పల్లి మండలంలో ఒక ఇల్లు కూలిపోగా, నాలుగు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బంట్వారంలో 14, ధారూర్‌లో 26, పెద్దెముల్‌లో 13, మోమిన్‌పేటలో 15, తాండూర్‌లో ఒకటి, వికారాబద్‌లో 23, యాలాల్ మండలంలో ఐదు ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

chitram....

భారీ వర్షానికి జలమయమైన పాలమూరు పట్టణంలోని న్యూ టౌన్ రోడ్డు