రాష్ట్రీయం

రెండుగా తెలుగు వర్శిటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విభజనకు రంగం సిద్ధమైందని ఆ యూనివర్శిటీ కొత్త వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలంగాణలో ఉన్న వర్శిటీ ఇక మీదట తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయంగా మారుతుందని, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రిలో ఏర్పాటు అవుతుందని అన్నారు. అయితే ఈ అంశాలు యూనివర్శిటీ పరిధిలోనివి కావని, ప్రభుత్వాలు తీసుకోవల్సిన నిర్ణయాలని, అందుకు అవసరమైతే చట్టసవరణలు చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం నాడు ఆయన ఆంధ్రభూమితో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ పదకోశ నిర్మాణం, తెలంగాణ నిఘంటు నిర్మాణం , తెలంగాణ చరిత్ర నిర్మాణం , తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం కూడా చేపడతామని వివరించారు. ఆంధ్రా కవులకు ఉన్న ప్రాశస్త్యం తెలంగాణ కవులకు లేదని, దానికి కారణం అవసరమైన ప్రచారం జరగకపోవడమేనని అన్నారు. సంగీతం, నాట్యం, ప్రజాకళారూపాలపై కొత్త కోర్సులు ప్రారంభిస్తామని, ఈ కోర్సులు చేసిన వారికి ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర నృత్యంగా పేరిణిని గుర్తించబోతున్న తరుణంలో పేరిణి నాట్యాన్ని ప్రోత్సహించేందుకు దానికి సిలబస్‌ను కూడా రూపొందించబోతున్నామన్నారు. పేరిణి నృత్యం సహా పలు ప్రజాకళారూపాలకు సర్ట్ఫికేట్ కోర్సు, డిప్లొమో కోర్సు, డిగ్రీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఆయా జిల్లాల సర్వస్వాలను కూడా రూపొందిస్తామని చెప్పారు. చరిత్ర, భూగోళం, శాసనాలు, సాహిత్యం, కళలు, సంస్కృతి, సంగీతం, నాట్యం, శిల్పకళారూపాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వాటిని నిక్షిప్తం చేసేందుకు కూడా చర్యలు చేపట్టామని తెలిపారు. యూనివర్శిటీలో అందుబాటులో ఉన్న వలయాకారపు మ్యూజియంను మరింత మెరుగుపరిచి అందులో అపురూప చిత్రాలను ప్రదర్శిస్తామని అన్నారు.
హైదరాబాద్‌లోనే ప్రాచీన భాషా కేంద్రం ఏర్పాటుకు మండలి బుద్ధప్రసాద్, ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లు కూడా సానుకూలంగా ఉన్నారని వైస్ చాన్సలర్ చెప్పారు. ప్రెస్ అకాడమి, సాంస్కృతిక శాఖ, తెలుగు అకాడమి, అధికార భాషా సంఘం ప్రతినిధులతో ఒక సమావేశాన్ని, ఎడిటర్లు, ఎలక్ట్రానిక్ మీడియా సిఇఓలతో మరొక సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని విసి చెప్పారు. వారి అభిప్రాయాలను సేకరించి మైసూరు ‘సిల్’లో ఉన్న సంస్థను హైదరాబాద్‌కు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ప్రాచీన భాషా కేంద్రం అంటే కేవలం ప్రాచీన భాషకే పరిమితం కాదని, ఆధునిక భాష, సంస్కృతి, వికాసం, సాహిత్యం అంశాలు కూడా వస్తాయని ఈ కేంద్రం ఏర్పాటైతే కేంద్రం ఐదేళ్ల వ్యవధికి వంద కోట్ల రూపాయల వరకూ మంజూరు చేస్తుందని, ఆ నిధులతో అనేక కార్యక్రమాలను చేయగలుగుతామని చెప్పారు.
మరోపక్క ప్రతి ఏడాది ఒక ప్రముఖుడ్ని లక్ష రూపాయిలతో సత్కరించుకునే వీలుంటుందని, మరో 10 మందికి 50 వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందించడానికి, రీసర్చి స్కాలర్లకు ఫెలోషిప్‌లు అందించేందుకు వీలుంటుందని అన్నారు. అలాగే అన్ని కేంద్రీయ వర్శిటీల్లో తెలుగు ప్రాచీన భాషా కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే జెఎన్‌యు తెలుగు పీఠం ఏర్పాటుకు నిధులు మంజూరు చేయమని కోరిందని, తాము కేంద్ర సాంస్కృతిక శాఖను అడగాల్సిందిగా సూచించామని విసి చెప్పారు. త్వరలో నాంపల్లిలోని వర్శిటీ క్యాంపస్‌లో విశాలమైన సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మిస్తామని, అలాగే నల్గొండలో ఉన్న ఐదెకరాల స్థలంలో ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేస్తామని లేకుంటే గిరిజన కేంద్రం లేదా మహిళా కేంద్రం ఏర్పాటు చేసే యోచన ఉందని అన్నారు.
ప్రజల వద్దకే పుస్తకం పేరిట ఇక ఆన్‌లైన్‌లో పుస్తకాల అమ్మకాలను ప్రారంభిస్తామని, అలాగే మెగా ఈవెంట్లలో కూడా తగ్గింపు ధరలకు పుస్తకాలు అమ్ముతామని చెప్పారు. అలాగే వర్శిటీ ప్రాంగణంలో జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యూనివర్శిటీలో తెలంగాణ పరిధిలోని కేంద్రాల్లో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.

బి.వి.ప్రసాద్