తెలంగాణ

విపక్షాలకు ఎదురు దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: దసరానుంచి తెలంగాణ కొత్త స్వరూపం సంతరించుకోనుంది. భౌగోళికంగా పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ 31 జిల్లాలుగా ఆవిర్భవించనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ రాజకీయ స్వరూపమే మారిపోనుంది. ప్రస్తుతం జిల్లాల్లో అధిపత్యం చలాయిస్తున్న వర్గాల్లోనూ మార్పు అనివార్యం కాబోతోంది. చివరకు మంత్రుల నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలు సైతం పక్క జిల్లాలోకి పోతున్నాయి. ఇదో విచిత్రమైన పరిస్థితి. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల పునర్విభజన అని అధికారపక్షం చెబుతున్నా, రాజకీయంగా ఇది తెరాస వ్యూహాత్మక అడుగేనని అంటున్నారు. జిల్లాపరంగానో, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనో బలమైన నాయకుడినన్న వాదన నేతలనుంచి వినిపించకుండా జిల్లాల పరిణామాలను మార్చేయడం రాజకీయ ఎత్తుగడలో భాగమే. ఇప్పుడున్న ఒక్కో నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లోకి పోతోంది. దీంతో ఎమ్మెల్యే పాత్ర నామమాత్రమవుతుంది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యి రూపాయల పెన్షన్, విద్యుత్ సమృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయడం వంటి పనులతో ప్రభుత్వం బలోపేతమవుతుంటే, చాలా నియోజకవర్గాల్లో అధికారపక్షం ప్రజాప్రతినిధుల పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న విచిత్ర పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సగానికన్నా ఎక్కువ నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారికే టికెట్లు ఇస్తే ఓడిపోతారనే ప్రచారం లేకపోలేదు. అదే సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేలు, మొదటి నుంచీ పార్టీలో ఉన్నవారిలో సగంమందికి ఒకేసారి టికెట్లు ఇవ్వకుండా ఉండడం అంత సులభం కాదు. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఈ అంశాన్ని సులభతరం చేశాయి. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకునే వ్యూహాత్మకంగా సిఎం కెసిఆర్ కొత్త జిల్లాలకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత విపక్షాలు మరింతగా డీలా పడిపోయాయి. మరో రెండున్నరేళ్ల తరువాత కొత్త నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుకునే అవకాశం అధికార పక్షానికి ఉంది. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు నియోజక వర్గాల్లో నాయకత్వాన్ని తయారు చేసుకునే అవకాశమే విపక్షాలకు లేకుండాపోయింది. అధికార పక్షానికి నాయకులు, అభ్యర్థులకు కొరత లేదు, ప్రధాన సమస్య అభ్యర్థులను మార్చడమే. కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో అధికార పక్షానికి సమస్య పరిష్కారమైనట్టే. 2019 ఎన్నికలనాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉండగా, 150 నియోజకవర్గాలవుతాయి. పార్లమెంటు నియోజకవర్గాల్లో మార్పు ఉండదు. దీనికి సంబంధించి కేంద్రం వద్ద ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎమ్మెల్యే ఇప్పటినుంచే కొత్త నియోజకవర్గంపై దృష్టి సారించాలి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం రెండు మూడు జిల్లాల పరిధిలోకి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యేలు ఎక్కడ దృష్టి కేంద్రీకరించాలో అర్ధంకాని పరిస్థితి.
తెరాస నాయకత్వానికి కలిసొచ్చే అవకాశం
తెలంగాణ ఏర్పడగానే కెసిఆర్ అప్పటివరకు ఉన్న మూస పద్ధతులన్నింటికీ చరమగీతం పాడటమే కాకుండా అన్నింటిలోనూ తన మార్కు ఉండాలని కోరుకున్నారు. చివరకు సచివాలయాన్ని సైతం ప్రస్తుతం ఉన్న చోటునుంచి మార్చాలని ప్రయత్నించారు. ఛాతి ఆస్పత్రికి చెందిన స్థలం, సికిందరాబాద్‌లో మిలటరీకి చెందిన స్థలం నూతన సచివాలయం కోసం పరిశీలించారు. చివరకు ప్రస్తుత సచివాలయం స్థలంలోనే కొత్తగా నిర్మించాలని నిర్ణయించారు. క్యాంపు ఆఫీసును సైతం కొత్తగా నిర్మిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలను సైతం పూర్తిగా మార్చడం ద్వారా కెసిఆర్ మార్కు తెలంగాణ పాలన చూపించనున్నారు.
తెలంగాణ ఒకప్పుడు పది జిల్లాలు. ఇప్పుడది 31 జిల్లాల తెలంగాణగా మారుతోంది. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చేయడానికి మండల వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలాల ఏర్పాటుతో రాష్ట్రంపై ఎన్టీఆర్ ముద్ర నేటికీ స్పష్టంగా కనిపిస్తోంది. అదే తరహాలో కెసిఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలో తన ముద్ర బలంగా ఉండేలా చేస్తున్నారు. ఒక్కో జిల్లా నాలుగు జిల్లాలుగా మారుతుండటంతో ఆ మాత్రం ఉన్న నాయకత్వం కూడా మరింత బలహీనపడుతోంది. సగటున ప్రతి మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా అవుతోంది.