తెలంగాణ

పదోన్నతుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో వివిధ శాఖల్లో పదోన్నతులకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. ప్రతి జిల్లాలో 30 ప్రధాన శాఖలు, 206 ఉపశాఖలు ఉన్నాయి. ఉపశాఖలు 206 ఉన్నప్పటికీ, అన్ని శాఖలకు కలిపి వాస్తవంగా జిల్లాస్థాయి అధికారులు ఒక్కో జిల్లాలో 50నుండి వంద మంది ఉంటారు. అంటే ఒక్కో అధికారికి సరాసరిన రెండు నుంచి నాలుగు శాఖలున్నాయి. ఈ లెక్కన ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో దాదాపు వెయ్యిమంది వరకు జిల్లాస్థాయి అధికార్ల పోస్టులున్నాయి. జిల్లాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ సంఖ్య ఇప్పుడు మూడు వేలకు పెంచాల్సి ఉంటుంది.
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకే రకమైన శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ ఏవిధంగా ఉండాలన్న అంశంపై కసరత్తు మొదలైంది. రెండు మూడు నెలల్లో ప్రక్రియ కొలిక్కి వస్తుందని అంటున్నారు. పునర్వ్యవస్థీకరణ చేసినా జిల్లాస్థాయి అధికారులు రాష్ట్రం మొత్తంమీద 1500 నుండి 2000 మంది వరకు అవసరం ఉంటుంది. ఈ కసరత్తు ఎలా ఉన్నప్పటికీ, జిల్లాస్థాయి అధికారులను నియమించాలంటే రెండు రకాల మార్గాలున్నాయి. నేరుగా (డైరెక్ట్) నియామకం (గ్రూప్-1 ద్వారా భర్తీ) ఒక రకమైతే, కిందిస్థాయి వారికి పదోన్నతి కల్పించడం రెండో రకం. ఇప్పటికిప్పుడే నేరుగా అధికారులను నియమించే పరిస్థితి లేదు. ఎన్ని పోస్టులు ఏర్పాటు చేయాలో స్పష్టంగా ప్రణాళిక రూపొందిస్తే అందుకు తగినట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ద్వారా నియామకాలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దసరా నుంచి కొత్త జిల్లాలు ఏర్పడుతుండటం వల్ల తాత్కాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు జిల్లాస్థాయిలో జిల్లా పంచాయితీ అధికారి (డిపిఓ) ఉంటారు. ప్రతి జిల్లాకు డిపిఓ ఉండాలి. ఇప్పుడు రాష్టవ్య్రాప్తంగా జిల్లాల్లో పనిచేస్తున్న వారు పదిమంది డిపిఓలు ఉండగా, ఈ సంఖ్య ఇక 31కి పెరుగుతుంది. అంటే ఈ ఒక్క శాఖకే 21మంది డిపిఓలు అదనంగా అవసరముంటుంది. ఇదేవిధంగా ప్రతి శాఖకు జిల్లాస్థాయి అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వివిధ శాఖలకు కలిపి 2000 మంది జిల్లాస్థాయి పోస్టులను అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పునర్వ్యవస్థీకరణ జరిగినా అదనంగా వెయ్యి మంది జిల్లాస్థాయి అధికారులు అవసరం ఉంటుంది. దసరారోజు జిల్లాల ప్రారంభం అవుతున్నప్పటికీ, తొలుత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలనే నియమిస్తున్నారు. ఇతర శాఖలకు ప్రతి జిల్లాలో జిల్లాస్థాయి శాఖను ఏర్పాటు చేసి, ఒక అధికారిని నియమించేందుకు ఇప్పటికిప్పుడే వీలు కావడం లేదు. కొత్త జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. తాత్కాలికంగా డివిజన్ స్థాయి అధికారికి కొత్త జిల్లాస్థాయి అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించడమో, లేక ప్రస్తుతం ఉన్న జిల్లాస్థాయి అధికారికే అదే జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్‌ఎసి)గా నియమించడమో చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న ప్రధాన శాఖల్లో.. వ్యవసాయం, సహకారం, పశుసంవర్థనం, పాడిపరిశ్రమ, మత్స్య, పౌరసరఫరాలు, ఉన్నతవిద్య, పాఠశాల విద్య, ఇంధనం, అడవులు, పర్యావరణం, ఆర్థిక, వైద్యం, ఆరోగ్యం, హోం, గృహనిర్మాణం, పరిశ్రమలు, నీటిపారుదల, కార్మిక, ఉపాధి, న్యాయ, పురపాలక, ప్రణాళిక, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, రవాణ, వివిధ సంక్షేమ శాఖలు (బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మహిళ, యువజన) ఉన్నాయి. వీటికి అనుబంధంగా ఇతర శాఖలున్నాయి. వ్యవసాయ శాఖలో వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, విత్తనాభివృద్ధి, ఉద్యాన, పట్టు, మైక్రోఇరిగేషన్, ఆగ్రో ఇండస్ట్రీస్, వేర్ హౌసింగ్ తదితర ఉపవిభాగాలున్నాయి. ఇదే విధంగా ఇతర ప్రధాన శాఖలకు ఉపశాఖలున్నాయి. ఈ శాఖలన్నింటికీ జిల్లాస్థాయి అధికారులను నియమించేందుకు పదోన్నతులు పెద్దఎత్తున కల్పించాల్సి ఉంటుంది. ఈ ప్రమోషన్లు ఒక చైన్ మాదిరిగా కొనసాగుతాయి. జిల్లాస్థాయిలో పదోన్నతులు కల్పిస్తే, కిందిస్థాయిలోనూ ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇదొక తేనే తుట్టలా మారుతుంది. ఈ మొత్తం ప్రహసనం పూర్తి కావాలంటే కనీసం ఏడాదికిపైగా పడుతుందని అధికార వర్గాల అంచనా. అందుకే ప్రతి శాఖలోనూ ప్రమోషన్ల కోసం సీనియారిటీ జాబితాలను రూపొందించడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. తగినంత సిబ్బంది లేకపోతే పోస్టులను ఖాళీగా ఉంచాల్సి వస్తుంది.