తెలంగాణ

నయా తెలంగాణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సంగారెడ్డి, అక్టోబర్ 12: రెండున్నరేళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ స్వరూపం విజయదశమి రోజున సంపూర్ణంగా మారిపోయింది. విస్తృత ప్రాతిపదికన అధికార వికేంద్రీకరణ దిశగా తెలంగాణ తొలి అడుగు వేసింది. ఒకేరోజు, ఒకే ముహూర్తానికి ఒక్క క్షణం అటూ ఇటూ కాకుండా 21 కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒకేసారి జిల్లా కేంద్రాలను ప్రారంభించటం అపూర్వ సన్నివేశం. ‘్ఢల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లుగా సిద్దిపేటలో నడయాడిన నాకు మీతో విడదీయరాని అనుంబంధం ఏర్పడింది. నేనెక్కడున్నా సిద్దిపేటకు అన్ని సిద్ధిస్తాయి’ అని సిఎం చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రజా సౌలభ్యం కోసం సర్కారు చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా మంగళవారం విజయ దశమి పర్వదినాన ఉదయం 11.13 గంటలకు సిద్దిపేటలోని అంబేద్కర్ భవనంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఇదిలావుంటే, తెలంగాణలో పెద్ద పండుగ అయిన దసరాకు కొత్త జిల్లాల ప్రారంభోత్సవ వేడుకలు తోడు కావడంతో సంబరాలు అంబరాన్ని అంటాయి. దసరా పర్వదినం నాడే కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాలు కొలువుదీరాయి. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, పోలీస్ సూపరింటెండెంట్‌లు ఇతర ముఖ్య ఉన్నతాధికారులంతా ఒకే సారి బాధ్యతలు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య అధికారికంగా 31 జిల్లాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాల్లో జిల్లాల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ఇక నుంచి తొమ్మిది స్థానాకి చేరుకుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు ముందు జిల్లాల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం చిట్టచివరి స్థానంలో ఉండేది. ప్రస్తుతం ఎక్కువ జిల్లాలు కలిగిన టాప్-10 రాష్ట్రాలో తెలంగాణ ఒకటిగా చేరిపోయింది. రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా అన్ని జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగింది. దీంతో 10 పాత జిల్లాల్లో అత్యధికంగా వరంగల్ జిల్లా ఐదు జిల్లాలుగా విడిపోగా, ఒకే ఒక్క జిల్లాతో హైదరాబాద్ మార్పు లేకుండా ఉండిపోయింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం అర్ధరాత్రి 12 గంటల 41 నిమిషాలకు తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై 10 పాత జిల్లాలు, 21 కొత్త జిల్లాలను కలిపి మొత్తంగా వేర్వేరుగా 31 తుది నోటిఫికేషన్లను రెవిన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రా సంతకంతో జారీ అయ్యాయి. తుది నోటిఫికేషన్‌తో పాటు జిల్లాల కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లకు, ఎస్పీలకు వేర్వేరుగా సాధారణ పరిపాలనశాఖ తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు అందుకున్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఆ ముందు రోజే (సోమవారం సాయంత్రం) తమకు అందిన వౌఖిక ఆదేశాలతో కేటాయించిన కొత్త జిల్లాలకు చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలు, పోలీస్ కమిషనరేట్లు, పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు అన్ని జిల్లాల్లో ఒకే రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లాను ప్రారంభించగా, స్థానిక ఎమ్మెల్యే, నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన మంత్రులు తలా ఒక జిల్లా చొప్పున 16 జిల్లాలను ప్రారంభించగా శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా నాలుగు జిల్లాలు ప్రారంభమయ్యాయి.
ఈ భాగ్యం నాకు దక్కుతుందనుకోలేదు: కెసిఆర్
సిద్దిపేటను జిల్లాగా మార్చాలన్న మీ కలనే నేనే నెరవేరుస్తానని కలలో కూడా ఊహించలేకపోయానని సిఎం కెసిఆర్ పాత బస్టాండ్ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 1983లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళుతున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా సిద్దిపేటను జిల్లాగా మార్చాలని దరఖాస్తు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కానీ తన కోరిక నెరవేరలేదని, తానే ముఖ్యమంత్రిగా మీ కలను నిజం చేస్తానని ఊహించలేకపోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకు రమ్మని సిద్దిపేట వాసులు ఆశీస్సులు అందించి పంపించారని, వారి ఆశయాలకు అనుగుణంగా అది సాధ్యమైందని, అంతే లక్ష్యంతో జిల్లాను కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. సిద్దిపేటకు రైలు సౌకర్యం, గోదావరి జలాలు, సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయడం చిరకాల స్వప్నంగా పెట్టుకున్నానని, అది నెరవేరడం మరచిపోలేని సంతృప్తిని ఇస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఇతరులు ఈర్ష్యపడాలని, అవసరమైతే మన రాష్ట్రానికి వచ్చి జీవనం సాగించే ఆలోచన కలిగేలా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పెత్తనం సాగాలన్న ఉద్దేశంతోనే జిల్లాల పునర్విభజన చేపట్టామని, పది జిల్లాల సంఖ్యను 31 జిల్లాలకు విస్తరింపజేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొంత మంది అవాకులు చవాకులు పలుకుతున్నారని, వారికి సమాధానం చెప్పే సత్తా ఉన్నా, దసరా సందర్భంగా వారి మాటలను పక్కన పెడుతున్నట్లు కెసిఆర్ అన్నారు. తానెక్కడున్నా సిద్దిపేటకున్న గుర్తింపు చిరస్థాయిగా ఉంటుందని, కడవరకూ ఈ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి వంద కోట్ల ప్రత్యేక ప్యాకేజిని కెసిఆర్ ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు కోరినట్లుగానే వచ్చే ఏడాది వైద్య కళాశాల ప్రారంభమవుతుందని, యూనివర్సిటీ కూడా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, పోలీస్ కమిషనర్ శివకుమార్‌తో పాటు వివిధ మండలాలకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చిత్రం... సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్