తెలంగాణ

ఆకాశాన్నంటిన ఇళ్ల అద్దెలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 23: భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కావటంతో అక్కడి ప్రజల్లో ఏర్పడిన సంతోషం క్రమక్రమంగా ఆవిరవుతోంది. కారణం.. జిల్లాకేంద్రంలో ధరలు విచ్చలవిడిగా పెరిగిపోవటమే. ఇళ్ల అద్దెలు ఆకాశాన్ని అంటగా, హోటళ్లలో తినుబండారాలు రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అసలే అరకొర వసతులు ఉన్న భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడటంతో వసతుల లేమి, అధిక ధరలతో ఎలా పనిచేయాలని అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడకముందు రెండున్నర వేల రూపాయల నుంచి మూడువేల రూపాయలు చెల్లిస్తే మూడుగదుల పోర్షన్ అద్దెకు లభించేది. ఐదువేల రూపాయలు అద్దె చెల్లిస్తే అన్ని వసతులు ఉన్న ఫ్యామిలీ పోర్షన్ దొరికేది. కానీ జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో భూపాలపల్లి జిల్లాకేంద్రంగా మారటంతో పరిస్థితి అంతా మారిపోయింది. మూడు గదుల కామన్ పోర్షన్ ఐదు, ఆరు వేలకు పెరగిపోయింది. మంచి వసతులు ఉన్న పోర్షన్ కావాలంటే పదివేల వరకు అద్దె చెబుతున్నారు. దీనికితోడు గతంలో రెండునెలల అడ్వాన్స్ చెల్లిస్తే సరిపోగా జిల్లాగా మారిన నేపథ్యంలో పట్టణంలోని కొన్నిచోట్ల ఐదు, ఆరునెలల అడ్వాన్స్ ఇస్తేనే ఇళ్లు అద్దెకు ఇస్తామని యజమానులు నిక్కచ్చిగా చెబుతున్నారు. ఫలితంగా కొత్త జిల్లా కేంద్రానికి బదిలీపై వెళ్లిన అధికారులు, ఉద్యోగులు అద్దె ఇళ్లకోసం నానాతంటాలు పడవలసి వస్తోంది. బొగ్గుగనుల కారణంగా వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు కలుగుతున్నా సరిపెట్టుకునే ఆలోచనకు అధికారులు, సిబ్బంది వచ్చినా అడ్డగోలు అద్దెలతో బెంబేలెత్తిపోతున్నారు. కొత్తగా అద్దెలకు వచ్చేవారి సంగతి ఇలా ఉండగా ఇప్పటికే అద్దెకు ఇళ్లలో ఉన్నవారి సంగతి గందరగోళంగా మారింది. జిల్లా కేంద్రంగా మారిన కారణంగా అద్దెలు పెరగిపోవటంతో ఇప్పటి వరకు తక్కువ అద్దెతో ఉంటున్న కాపురం ఉంటున్న కుటుంబాలకు ఒకటి, రెండునెలల్లో ఖాళీ చేయాలని యజమానులు తాఖీదులు జారీ చేస్తున్నారు. ఇళ్ల అద్దె కొంతమొత్తం పెంచేందుకు ఇప్పటికే అద్దెకు ఉన్న కుటుంబాలు సిద్ధపడినా పట్టణంలో ఇళ్ల అద్దెలు రెట్టింపు అవటంతో పాతవారిని ఖాళీ చేయించేందుకే యజమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే సింగరేణి క్వార్టర్లలో కొందరు కార్మికులు వ్యక్తిగత అవసరాల కోసం కంపెనీ తమకు ఇచ్చిన ఇళ్లు అద్దెకు ఇవ్వటం చాలాకాలంగా కొనసాగుతోంది. రెండు, మూడు లక్షల రూపాయలు అడ్వాన్సుగా తీసుకుని అద్దె లేకుండా ప్రైవేటు వ్యక్తులకు ఇళ్లు ఇవ్వటం ఇప్పటి వరకు కొనసాగింది. జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో సింగరేణి క్వార్టర్స్‌లో కూడా ఈ మొతాన్ని భారీగా పెంచినట్లు సమాచారం. భూపాలపల్లి సమీపంలో సింగరేణి ఒపెన్ కాస్ట్‌లు ఉండటంతో చుట్టుపక్కల గృహనిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకురావటం లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అరకొరగా నిర్మాణాలు జరిగినా ఒపెన్‌కాస్ట్‌ల కారణంగా ఇళ్లు దెబ్బతినటంతో కొత్తగా ఇళ్లు నిర్మాణం చేపట్టాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. ఫలితంగా నివాస గృహాలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఇకపోతే జిల్లా కేంద్రం భూపాలపల్లి పట్టణంలో హోటళ్లు, మెస్‌లు అంతంతమాత్రంగానే ఉండటంతో భూపాలపల్లిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, పనుల కోసం వెళ్లే సామన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. రెండు, మూడు ఉడిపి హోటళ్లు, అరడజను మామూలు మెస్సులు తప్ప చెప్పుకోదగిన హోటళ్లు లేకపోవటంతో వరంగల్ నగరం నుంచి విధి నిర్వహణకు వెడుతున్న అధికారులు, ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లాగా మారినందుకు సంతోషించాలా, జిల్లా కేంద్రంలో అన్ని ధరలు ఆకాశాన్ని అంటినందుకు బాధపడాలా అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.