తెలంగాణ

కరీంనగర్‌లో గ్రెనేడ్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 25: కరీంనగర్‌లో మంగళవారం ఉదయం రెండు హ్యాండ్ గ్రెనేడ్లు ఒక చెత్తకుప్పలో లభ్యం కావడం కలకలం సృష్టించింది. నగరంలోని జ్యోతినగర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో గల మైదానంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చెత్తను తొలగిస్తుండగా, రెండు గ్రెనేడ్లు కన్పించాయి. దీంతో కార్మికులు మున్సిపల్ అధికారులకు సమాచారమందించగా, మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు టూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. గ్రెనేడ్లు లభించిన ప్రాంతంలో బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం లభించిన రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రా, ఒరిస్సా బార్డర్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ‘మావో’లకు కోలుకోని దెబ్బ తగిలిన దరిమిలా రెండు గ్రెనేడ్‌లు లభ్యమయ్యాయన్న ప్రచారం దావానలంలా వ్యాపించడంతో కరీంనగర్‌లో కలకలం సృష్టించగా, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, లభించిన గ్రెనేడ్లు శిక్షణలో ఉపయోగించేవేనని, వీటితో ప్రమాదమేమి ఉండదని టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కట్ట హరిప్రసాద్ స్పష్టం చేశారు. అయినా, గ్రెనేడ్లు ఎక్కడివి, వాటిని ఎవరు పడేసారు అనే దానిపై విచారణ జరపాలని సిపి కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిపి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌లో నిత్యం కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు చేస్తుండడంతో ఎవరైనా భయపడి అక్కడ పడేసి ఉంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి గ్రెనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

చిత్రం.. బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ పోలీసుల తనిఖీ