తెలంగాణ

గద్వాల పీఠం కోసం తెరాస నేతల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, అక్టోబర్ 31: జోగులాంబ గద్వాల జిల్లా తెరాస కమిటీకి ఎన్నికలు నిర్వహించేందుకు సోమవారం నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారు. పిజెపి అతిథిగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో జిల్లా నాయకుల మధ్య గత కొంతకాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఉద్యమ సమయం నుంచి పార్టీ విజయతీరాల వరకు పనిచేసిన సీనియర్ నాయకులకు గద్వాలలో ప్రాధాన్యం కరువైందని, కేవలం ఒకే సామాజిక వర్గం, ఒకే వర్గానికి చెందిన నేతల మాటలే చెల్లుబాటవుతున్నాయని సీనియర్లు మండిపడ్డారు. ఈ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, సీనియర్ నేతలు గట్టు తిమ్మప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, ఆటో శ్రీనుల మధ్య వాగ్వాదం, పరస్పర దూషణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పది నిమిషాల పాటు అభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో అర్థంకాక కొందరు సీనియర్లు అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎంపి మంద జగన్నాథం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలు ఇరువర్గాలను శాంతింపచేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఒకానొక సందర్భంలో గట్టు సోదరులు సీనియర్లకు జరుగుతున్న అన్యాయంపై విరుచుకుపడ్డారు. పిజెపి అతిథిగృహంలో జిల్లా కార్యకర్తల సమావేశం రసాభసగా మారడంతో సిఐ సురేష్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు.
రేసులో ఖగన్నాథ్‌రెడ్డి, గట్టు, వడ్డ్డేపల్లి
అధ్యక్షరేసులో మొదటి నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేరు వినిపిస్తున్నప్పటికీ గట్టు తిమ్మప్ప, ఖగన్నాథ్‌రెడ్డి, వడ్డేపల్లి శ్రీను తదితరులు కూడా ఈ పదవికి పోటీలో ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, మార్కెట్‌యార్డు చైర్మన్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించడంతో బిసి వర్గంపై పార్టీ దృష్టిసారించినట్లు తెలిసింది. జిల్లాలో జనాభా పరంగా వాల్మీకిబోయలు, మున్నూరుకాపు కులానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉండడంతో వాల్మీకి కమ్యూనిటీ నుంచి గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు కమ్యూనిటీ నుంచి ఇటిక్యాల జడ్పీటిసి ఖగన్నాథ్‌రెడ్డి, వడ్డెపల్లి శ్రీనుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సమావేశంలో తోపులాటకు దిగిన తెరాస నాయకులు

అసలైన తెలంగాణ పార్టీ
తెలుగుదేశమే : రేవంత్

హైదరాబాద్, అక్టోబర్ 31: తమ పార్టీయే తెలంగాణలో అసలైన రాజకీయ పార్టీ అని టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. టిడిపి ఇతర రాష్ట్రాల్లో పుట్టలేదని ఆయన తెలిపారు. సోమవారం టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ టిడిపి అంటే ముఖ్యమంత్రికి దడ పుడుతున్నది కాబట్టే ఆంధ్ర పార్టీ అని విమర్శిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రజల్లో చర్చ పెడితే వాస్తవం ఏమిటో తెలుస్తుదని అన్నారు. టిడిపి హైదరాబాద్ నడిగడ్డలో పుట్టి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్నదని, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నదని ఆయన చెప్పారు. టిడిపి కేంద్ర పార్టీ కార్యాలయం కూడా హైదరాబాద్‌లోనే ఉన్నదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముఖ్యమంత్రి కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు పేదలందరికీ రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు యువత అధ్యక్షుడు టి. వీరేందర్ గౌడ్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయనున్నట్లు చెప్పారు. టిఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పార్టీ సభ్యత్వం, తెలుగు యువత జిల్లా స్థాయి కమిటీల ఎంపికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

అప్పుల బాధతో
ఇద్దరు రైతుల మృతి

మర్రిగూడ, అక్టోబర్ 31: అప్పలు బాధలు భరించలేక నల్లగొండ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మర్రిగూడ మండలం కుదాబక్షపల్లి గ్రామానికి చెందిన రైతు ఇస్కిల సత్తయ్య (43) సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. తన రెండు ఎకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలు తీసుకుని పత్తి పంటను సాగు చేయగా దిగుబడి రాకపోవడంతో అప్పుల భారం ఎక్కువై మనోవేదనతో గుండెపోటుకు మరణించాడు. అలాగే, శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో అప్పుల బాధతో మరో రైతు అక్కినపల్లి నాగరాజు (35) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగున్నర ఎకరాల పత్తి సాగులో ఆరులక్షల వరకు అప్పులు మిగలడంతో దిగుబడి రాక దిగులు చెంది అప్పుల భారం మోయలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీరాముల అయోధ్య తెలిపారు.

బ్యాంకును మోసగించిన 29 మందిపై కేసు

ఆత్మకూర్(ఎం), అక్టోబర్ 31: ఫోర్జరీ సంతకాలతో బ్యాంకును మోసగించి రుణాలు తీసుకున్న 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ స్వామిదాస్‌తో పాటు 29 మంది గ్రామస్థులపై తహశీల్దార్ అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్‌ఐ శివనాగప్రసాద్ తెలిపారు. తమ పేరు మీద గుంట భూమి కూడా లేనప్పటికీ నకిలీ పాస్‌బుక్కులు, పహాణిలు సృష్టించి తహశీల్దార్, విఆర్‌వోల సంతకాలు, ముద్రలు ఫోర్జరీ చేసి వలిగొండ మండలం అరూర్ కెనరాబ్యాంకు మేనేజర్ సహకారంతో లక్షన్నర చొప్పున సుమారుగా 45 లక్షలు బ్యాంకు రుణాలు పొంది వీరంతా బ్యాంకుకు టోకారా వేశారు. రెండు నెలల క్రితం వారు చేసిన మోసం వెలుగులోకి రావడంతో తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.

టెన్త్ పరీక్ష ఫీజు
గడువు పెంపు

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్ధులు తమ పరీక్ష దరఖాస్తులను సమర్పించేందుకు విధించిన గడువును నవంబర్ 15 వరకూ పొడిగించారు. 50 రూపాయిల జరిమానాతో నవంబర్ 23 వరకూ, 200 రూపాయిల జరిమానాతో డిసెంబర్ 1 వరకూ , 500 రూపాయిల జరిమానాతో డిసెంబర్ 9 వరకూ గడువు విధించారు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అక్టోబర్ 31తో గడువు ముగిసింది.