తెలంగాణ

టిఎస్‌ఐపాస్‌తోనే ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: తెలంగాణ ఆవిర్భావంతో నష్టం తప్పదన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందని ఐటి, పరిశ్రమల మంత్రి కె తారక రామారావు తెలిపారు. సచివాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ కోరుకున్న విధంగా సంస్కరణలు తీసుకొచ్చి తెలంగాణను పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు. టిఎస్‌ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం ఐదు లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా టిఎస్‌ఐపాస్ ద్వారా స్వీయ ధృవీకరణతో పరిశ్రమల స్థాపనకు అనుమతులిస్తున్నామని అన్నారు. ఐటి, ఫార్మా పరిశ్రమల స్థాపనకు రెండుసార్లు అమెరికాలో పర్యటించానని, అక్కడివాళ్లు టిఎస్‌ఐపాస్ గురించి తెలుసుకుని అబ్బురపడ్డారన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇలా స్వీయ ధ్రువీకరణ విధానం లేదన్నారు. ‘ఈజ్ డూయింగ్ బిజినెస్’లో 98.78 శాతం పాయింట్లతో తెలంగాణ దేశంలో మొటదిస్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. తక్షణ అనుమతులు, వ్యయం నియంత్రణ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు. మొత్తం 340 సంస్కరణలను ప్రాతిపదికన తీసుకుని, మొత్తం అన్నింటికీ కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. పనె్నండు సంస్కరణలు కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రత్యేక హోదా ఉన్నవాటివేనని పేర్కొంటూ, అవి తెలంగాణకు వర్తించవన్నారు. తొమ్మిది నెలల కాలంలో చేపట్టిన సంస్కరణలతో 13వ స్థానం నుంచి మొదటి స్థానానికి రాష్ట్రం చేరుకుందన్నారు.
తొమ్మిది నెలల కాలంలో 66 సమావేశాలు నిర్వహించామని, 58 జీవోలు, 121 సర్క్యులర్‌లు విడుదల చేశామన్నారు. కొత్తగా 113 ఆన్‌లైన్ సర్వీసులు ప్రారంభించామన్నారు. 22 శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి తెలంగాణను మొదటిస్థానంలో నిలిపారని కితాబునిచ్చారు. టిఎస్‌ఐపాస్‌ను అమల్లోకి తెచ్చిన తరువాత ఇప్పటి వరకు 1.61లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందన్నారు. పరోక్షంగానూ ఉపాధి లభించిన వాళ్లను కలుపుకుంటే, మొత్తంగా ఐదు లక్షల మందికి ఉపాధి లభించినట్టేనన్నారు. 2550 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వీటిలో 60 శాతం పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, 44,791 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయన్నారు. జిల్లాలవారీగా పరిశ్రమలకు ఇచ్చిన అనుమతుల వివరాలను మంత్రి వెల్లడించారు. కొత్తగూడెంలో అత్యధికంగా 7351 కోట్ల పెట్టుబడులు రాగా, రంగారెడ్డి జిల్లాలో 7169 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. పవర్ ప్రాజెక్టుల వల్ల కొత్తగూడెం మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో అత్యల్పంగా 122 కోట్ల రూపాయల పెట్టుబడులు, పది పరిశ్రమలు వచ్చాయి. వీటిలో కేవలం 245మందికి ఉపాధి లభించింది.
ఆంధ్రతో కలిసి పనిచేస్తాం
ఈజ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి తెలంగాణ విధానాలను ఆంధ్ర కాపీ కొడుతుందని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన అంశాన్ని మీడియా ప్రస్తావించగా, మేధోపరమైన హక్కుల కోసం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఫార్మా పరిశ్రమలు పెట్టాలని అమెరికాలో పర్యటించి అడిగినప్పుడు మేధోపరమైన హక్కుల గురించే వారు ప్రధానంగా సందేహాలు వెలిబుచ్చారన్నారు. మేధోపరమైన హక్కులు కీలకమైనవని, అధికారులు ఎంతో కష్టపడి రూపొందించిన విధానాలను ఇతరులు కాపీ కొట్టినప్పుడు ఆధారాలతో సహా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టు కెటిఆర్ వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రలకు మొదటి స్థానం రావడం సంతోషకరమన్నారు. ఏదోక రాష్ట్రంతో కలిసి ర్యాంకు పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆంధ్రనే కోరుకుంటామన్నారు. నిన్న మొన్నటి వరకు కలిసివున్న రాష్టమ్రేనని, వాళ్లంతా సోదరులేనన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని మంత్రి కెటిఆర్ ఆకాంక్షించారు.

చిత్రం... మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఐటి మంత్రి కెటిఆర్