తెలంగాణ

కాలయాపనలో ‘పిహెచ్‌డి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 1: ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆకాంక్షతో పోస్టు గ్రాడ్యుయేషన్ (పి.జి) అనంతరం తమకు ఆసక్తి ఉన్న అంశంపై సమగ్ర పరిశోధన జరిపి పిహెచ్‌డి పట్టా పొందాలని భావిస్తున్న అభ్యర్థులకు ఆదిలోనే చుక్కెదురవుతోంది. పిహెచ్‌డి కోసం నోటిఫికేషన్ జారీ చేయడం మొదలుకుని ప్రవేశ పరీక్ష నిర్వహించడం, వాటి ఫలితాలను ప్రకటించడం, అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పరిశోధనలకు అనుమతించే విషయంలో ఏళ్ల తరబడి కాలయాపన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొని ఉండడంతో తమ సృజనాత్మకతను చాటుకుని డాక్టరేట్ పట్టా పొందాలని భావిస్తున్న ఔత్సాహికులు ఉసూరుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో గత రెండేళ్ల నుండి పిహెచ్.డి అనుమతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా, వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ మూడేళ్లుగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీనిని నిరసిస్తూ ఇటీవలే ఓ.యు పరిధిలోని విద్యార్థులు ధర్నా నిర్వహించి నిరసన చాటారు. ఇదే బాటలో నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్శిటీలో సైతం పిహెచ్.డి అనుమతుల జారీ విషయమై ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన పిహెచ్.డి నోటిఫికేషన్‌ను రెండేళ్లు ఆలస్యంగా 2016లో విడుదల చేస్తూ, అదే ఏడాది మార్చి 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 511మంది అభ్యర్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయగా, 2016 మే మాసంలో ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. మొత్తం 16సబ్జెక్టులలో 390మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తెలుగు సబ్జెక్టులో 57మంది, అప్లయిడ్ స్టాటిస్టిక్స్‌లో 6, బయో టెక్నాలజీలో 21, బోటనీలో 23, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో 50, కెమిస్ట్రీలో 31, కామర్స్‌లో 22, ఎకనామిక్స్‌లో 24, ఇంగ్లీష్‌లో 26, జియో ఇన్ఫర్మేటిక్స్‌లో 6, హిందీలో 18, లా కోర్సులో 21, మాస్ కమ్యూనికేషన్‌లో 13, ఫిజిక్స్‌లో 27, సోషల్ వర్క్‌లో 39, ఉర్దూలో ఏడుగురు అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే వీరికి ఇంటర్వ్యూ నిర్వహించి పరిశోధన కోసం వారు ఎంచుకున్న అంశాన్ని, దానిపై అభ్యర్థులకు ఉన్న ఆసక్తి, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకుని యుజిసి నిబంధనలను అనుసరిస్తూ మార్కుల ఆధారంగా పిహెచ్.డిలో ప్రవేశాలు కల్పిస్తూ పరిశోధనలకు అనుమతించాల్సి ఉంటుంది. ప్రవేశాలు కల్పించిన అభ్యర్థులకు సంబంధిత విభాగాల్లో పని చేస్తున్న ప్రొఫెసర్లను గైడ్‌లుగా సమకూర్చాలి. ఒక్కో ప్రొఫెసర్‌కు ఆరుగురు రీసెర్చ్ స్కాలర్లను గైడ్‌గా నియమించవచ్చని నిబంధనలు సూచిస్తున్నాయి.
ఇదివరకు అభ్యర్థులే తమకు నచ్చిన ప్రొఫెసర్‌ను గైడ్‌లుగా ఎంచుకునేవారు కాగా, ప్రస్తుతం యూనివర్శిటీలే గైడ్‌లను సమకూరుస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ ప్రవేశ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించడంతోనే నిలిచిపోయింది. ఇంటర్వ్యూల నిర్వహణకు వర్శిటీలు ఆసక్తి చూపకపోవడంతో అభ్యర్థులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. అందులోనూ ఫుల్‌టైం కోర్సు చేయాలని భావిస్తున్న వారికైతే పిహెచ్‌డి అనుమతి కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఎంతో విలువైన సమయం వృధా అవుతోంది.

త్వరలోనే ప్రవేశాలు
చేపడతాం
తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో త్వరలోనే పిహెచ్‌డి ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు వర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు. ప్రవేశాల విషయంలో ఎడతెగని జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనని, అన్ని వర్సిటీలలోనూ ఏకకాలంలో ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నందున వేచి చూడాల్సి వస్తోందన్నారు. అయినప్పటికీ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు పరిశోధనలకు అనుమతించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరామని, తమ అభ్యర్థన పట్ల ప్రభుత్వం కూడా సానుకూల సంకేతాలు అందించిందన్నారు. వైస్ ఛాన్స్‌లర్‌తో చర్చించి ప్రభుత్వానికి సమగ్ర ప్రతిపాదనలు పంపిస్తామని, ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు.