రాష్ట్రీయం

జనసేన సభ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 10 : అనంతపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. కాకినాడలో నిర్వహించిన సభ స్ఫూర్తితో అనంతలో ఏర్పాటు చేసిన సభకు సైతం ప్రజలు, అభిమానులు, యువత పెద్దఎత్తున తరలివచ్చారు. సుమారు 50వేల మందికి పైగానే హాజరై ఉండొచ్చని నిర్వాహకులు అంచనా వేశారు. పవన్‌కల్యాణ్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టడంతో పాటు, రాయలసీమ, అనంతపురం జిల్లాల దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో వైకాపా అధినేత జగన్, సిఎం చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తడం ద్వారా తాను ఇకపై ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నట్లు ఈ సభ ద్వారా స్పష్టం చేసి జనంలో ఉన్న అపోహలు, అనుమానాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తరిమెల నాగిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, జయప్రకాష్‌నారాయణ్ లాంటి ఎందరో మహానుభావులు తనకు స్ఫూర్తి అని చెప్పడం ద్వారా జనసేన పార్టీ రాజకీయ ప్రక్షాళనకు పుట్టిందని చెప్పకనే చెప్పారు. అలాగే రాజకీయ అవినీతిని రూపుమాపకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అన్నదాత కోసం ప్రాణాలర్పిస్తానన్నారు. తాను కూడా చిన్న కమతం ఉన్న రైతునే అన్నారు. అలాగే దేశ రక్షణకు జవాను ఎంతో ముఖ్యమన్నారు. మీలో ఒక రైతు, ఒక జవాను ఉండాలని యువతకు ఉద్బోధించారు. తన పార్టీలోకి అన్ని వర్గాల వారిని, యువతను తీసుకుంటానని హామీ ఇచ్చి రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని సంకేతాలిచ్చారు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతంలో ఆడబిడ్డల మాన ప్రాణాల రక్షణకు అండగా ఉంటానన్నారు. రైతులు కన్నీరు పెట్టరాదని, వారిని చంపుకుంటే బతుకు ఉండదని ఆవేదన వ్యక్తం చేయడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.

తొలి నగర వనం
రాజమహేంద్రవరం
19న ప్రారంభించనున్న సిఎం

రాజమహేంద్రవరం, నవంబర్ 10: అటవీ శాఖ భూముల్లో ఏర్పాటవుతోన్న తొలి నగర వనం రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువులో సిద్ధమైంది. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతపై అధ్యయన దిశగా నగర వనాన్ని రూపుదిద్దారు. దీనితోపాటు ఇక్కడే సుమారు 250 హెక్టార్ల అటవీ భూమిలో ఫారెస్టు అకాడమి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించడంతో పాటు అకాడమి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గోదావరి నది మహా పుష్కరాలకు గత ఏడాది రాజమహేంద్రవరంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నగర వనాలను ప్రకటించారు. ఇక్కడే ప్రకటించిన ఈ ఆలోచన విధానంలో ఇక్కడే తొలి వనం సిద్ధం కావడంకూడా విశేషత సంతరించుకుంది. రూ.2 కోట్ల అంచనా నిధులతో నగర వనం కోసం కేటాయించారు.
రూ. 34 లక్షల
నల్లధనం పట్టివేత
సింగరాయకొండ, నవంబర్ 10: వేర్వేరు వాహనాల్లో తరలిస్తున్న 34లక్షల రూపాయల కరెన్సీని గురువారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు చిలకలూరిపేట నుంచి సూళ్లూరు పేట వెళ్తున్న ఒక కారులో 19 లక్షలు, గుంటూరు నుంచి కడప వెళ్తున్న మరో కారులో 10లక్షలు, గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంకో కారులో ఐదు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సింగరాయకొండ మండలం కనమళ్ల వద్ద జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా ఈ నగదు లభించినట్టు సిఐ భీమనాయక్ తెలిపారు. పట్టుబడిన నగదులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసి 500, 1000 రూపాయల నోట్లు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. అయితే వీరివద్ద నగదుకు సంబంధించిన పత్రాలు లెక్కలు పూర్తి స్థాయిలో లేవన్నారు. అందువల్ల ఈనగదు స్వాధీనం చేసుకుని ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించనున్నట్టు సిఐ చెప్పారు.