రాష్ట్రీయం

‘రియల్’ బెంబేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఊహించని దెబ్బ. నల్లధనమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపిరి. అలాంటిది ఒక్కసారిగా నల్లధనంపై కేంద్రం తీసుకున్న చర్య రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బెంబేలెత్తిస్తోంది. అమరావతి కేంద్రంగా ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. హైదరాబాద్, యాదాద్రితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన 21 జిల్లా కేంద్రాల్లో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటుండగా, పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చావు దెబ్బతీసింది. బ్లాక్ మనీ ఎక్కువగా చలామణిలో ఉండేది ఈ రంగంలోనే. అమరావతి కేంద్రంగా ఆంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా సాగింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉద్యమ కాలంలోనూ ఒడిదుడుకులు ఎదుర్కొంటూ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తరువాత క్రమంగా పుంజుకుంది. అమరావతి రాజధాని అని ప్రకటన రాగానే అప్పటి వరకు వ్యవసాయం సాగిస్తున్న పంట పొలాలు కోట్లాది రూపాయలు ధరలు పలికాయి.
ఇక యాదాద్రిని అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించగానే వరంగల్ రహదారిపై యాదాద్రి వరకు ధరలు అనూహ్యంగా పెరిగాయి. యాదగిరి గుట్టకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని వంగపల్లి గ్రామంలో పదేళ్ల క్రితం ఒక ఎకరాన్ని 20వేల రూపాయలకు చాలా కష్టంగా అమ్ముడు పోయింది. యాదాద్రి అభివృద్ధి ప్రకటనతో అదే భూమి ఇప్పుడు ఎకరానికి 70లక్షల రూపాయల ధరకు పోయింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ నిలకడగా ఉండి మెల్లగా పెరుగుతుంటే యాదాద్రిలో మాత్రం ఊహించని విధంగా అనూహ్యంగా పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఈ ప్రాంతం నుంచే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్- యాదగిరి గుట్ట దారిలో ధరలు విపరీతంగా పెరిగాయి. యాదాద్రికి నాలుగు వైపులా రోడ్లు విస్తరిస్తున్నారు. ఈ మార్గం అంతటా ధరలు బాగా పెరిగాయి. రాయిగిరి నుంచి యాదాద్రి వరకు ధరలు హైదరాబాద్ నగరంలోని ధరలను తలదనే్న విధంగా ఉన్నాయి. సురేంద్ర పురి వద్ద ప్రధాన రహదారిలో గజం ధర రూ.15 వేలు పలికింది. అటు నుంచి కిలోమీటరు లోనికి వెళితే గతంలో ఎకరాల చొప్పున అమ్మే వారు ఇప్పుడు ఐదారు వేలకు గజం అమ్ముతున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడే వరకు తెలంగాణ మొత్తంలో హైదరాబాద్‌ను మించి యాదాద్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగింది. ఆ మరుక్షణం నుంచి ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్తబ్దత ఆవరించింది. అడ్వాన్స్‌లు ఇచ్చినవారు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం చేతిలో ఉన్న కరెన్సీ చెల్లుబాటు కాదు. బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. తిరిగి తీసుకోవాలంటే వారానికి 20 వేల రూపాయల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌లో ఎంత డబ్బయినా మార్చవచ్చు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఒప్పందాల నుంచి కూడా వెనక్కి మళ్లుతున్నారు. షాద్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఐదు కోట్ల రూపాయలకు ఒప్పందం కుదిరిన తరువాత, మారిన పరిస్థితుల్లో అంత డబ్బు వైట్‌మనీగా చెల్లించడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. భూమి అమ్మిన వారు, కొన్నవారు ఇద్దరూ 30 శాతం వరకు పన్ను చెల్లించాలి. ఇందుకు వీరిద్దరూ సుముఖంగా లేరు. సహజంగా ఇలాంటి ఒప్పందాల్లో సగానికి మించి బ్లాక్‌మనీ చెల్లిస్తారు. అప్పుడు కొనుగోలు అమ్మకాలు జరగాలంటే ఇరువురూ వైట్ మనీతోనే వ్యవహారాలు సాగించాలి. తలకు మించిన భారం అనే ఉద్దేశంతో అమ్మేవారు, కొనేవారు ఇద్దరూ వెనకడుగు వేస్తున్నారు. పూర్తిగా వైట్‌మనీతో, బ్యాంక్ లోన్‌తో ఉద్యోగులు కొనుగోలు చేసే ఫ్లాట్ల అమ్మకాలు సాగవచ్చు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా స్థంభించి పోతుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా లభిస్తాయని, వైట్‌మనీతో సాగే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మంచి రోజులు అని డెవలపర్స్ చెబుతున్నారు.
ప్రస్తుత షాక్ నుంచి కోలుకున్న తరువాతనే రియల్ ఎస్టేట్‌లో కనీస కార్యకలాపాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్స్‌కు ఇబ్బంది లేదు కానీ ఇనె్వస్ట్‌మెంట్ కోసం శివారు ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ప్లాట్లు కొనేవారి కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోతాయని వ్యాపారులు చెబుతున్నారు. యాదగిరి గుట్ట ప్రాంతంలో ప్లాట్ల అమ్మకాలు సాగించే అన్నపూర్ణ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రోజుకు కనీసం రెండు ఒప్పందాలు జరిగేవని, నోట్ల రద్దుతో కొత్తగా వచ్చేవారి సంగతి ఎలా ఉన్నా పాత ఒప్పందాల వారు కూడా ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఉన్న డబ్బు చెల్లుబాటు కాదు, బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. వారానికి 20 వేల రూపాయలు మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాదు, అన్ని వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాపారులు చెబుతున్నారు. తిరిగి పరిస్థితి చక్కబడి కనీస స్థాయిలో కొనుగోలు అమ్మకాలు సాగాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.