తెలంగాణ

ఇక గోదాములన్నీ కేంద్రీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: వివిధ ప్రభుత్వ సంస్థలు, శాఖల కింద ఉన్న గోదాములు అన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. దీనిని ఆచరణలోనికి తీసుకు రావడానికి కార్యాచరణ కోసం ఏడుగురు సభ్యులతో కమిటీని వేశారు. సచివాలయంలో గురువారం మంత్రి సమీక్ష జరిపారు. మార్కెటింగ్ శాఖ, పౌర సరఫరాల శాఖ వేర్ హౌజింగ్, వ్యవసాయ శాఖ, ఆగ్రో, సీడ్స్, మార్క్‌ఫెడ్ తదితర సంస్థల గోదాముల నిర్వాహణ, కార్యకలాపాలు అన్నింటినీ ఒకే గొడుగు పరిధిలోకి తీసుకు రావాలని హరీశ్‌రావు సూచించారు.
ప్రభుత్వ సంస్థల గోదాములు ఖాళీగా ఉంటున్నాయని, ప్రైవేటు గోదాములు నిండుతున్నాయని చెప్పారు. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తున్న కారణంతోనే పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్, వేర్ హౌజింగ్ వంటి సంస్థలు నష్టాల్లో కూరుకు పోతున్నాయని చెప్పారు. అన్ని సంస్థల గోదాములను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడానికి మార్కెటింగ్ శాఖ జెడి, ఎస్‌ఇ, వేర్ హౌజింగ్ జిఎం, ఇఇ, పౌరసరఫరాల సంస్థ జిఎం డిఎమ్, మార్క్‌ఫెడ్ జిఎంలతో ఒక కమిటీని వేశారు. ఈ కమిటీకి నోడల్ అధికారిగా వ్యవసాయ శాఖ కమిషనర్, వేర్ హౌజింగ్ ఎండి డాక్టర్ జగన్ మోహన్ వ్యవహరిస్తారు. గోదాములను ఆధునీకరించాలని, వౌలిక సదుపాయాల కల్పనపై ప్రతి వారం సమావేశం కావాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగా రొటీన్‌గా పని చేయడం మానాలని, ప్రజలకు జవాబుదారి తనంతో ఉండాలని గుర్తించాలని మంత్రి అన్నారు.
త్వరలో మార్కెటింగ్ చట్టం
తెలంగాణ మార్కెటింగ్ శాఖ కొత్త చట్టం రూపుదిద్దుకుంటోంది. డ్రాప్ట్ రూల్స్‌ను నల్సార్ యూనివర్సిటీ సిద్ధం చేసింది. ముసాయిదాను నల్సార్ ప్రతినిధులు మంత్రికి గురువారం అందజేశారు. ఇటీవల నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు మార్కెట్ చట్ట సవరణ జరగాలని మంత్రి సూచించారు. 1966లో తీసుకు వచ్చిన మార్కెటింగ్ చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తారు.
జిన్నింగ్ మిల్లులకు సిసిటివితో మార్కెట్ కమిటీలకు అనుసంధానం
జిన్నింగ్ మిల్లులు మార్కెటింగ్ చట్టాన్ని గాలికి వదిలేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రతి జిన్నింగ్ మిల్లు దగ్గర సిసిటీవి ఏర్పాటు సంబంధిత మార్కెట్ కమిటీతో అనుసంధానం చేయాలని మార్కెటింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని వారిపై ఎలాంటి అదనపు బారం పడరాదని అన్నారు. వే బ్రిడ్జిలు, హమాలీల చార్జీలను ఏకీకృతంగా ఉండాలని చెప్పారు.

రైతులకు ఆన్‌లైన్ చెల్లింపులు
రూ.891 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు
18 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం: పౌర సరఫరాల కమిషనర్ సివి ఆనంద్

హైదరాబాద్, డిసెంబర్ 1: ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన డబ్బులను నేరుగా వారి ఖాతాల్లో ఆన్‌లైన్ ద్వారా జమ చేస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ సీజన్‌లో రూ.891 కోట్ల విలువ చేసే 5 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం, బిల్లుల చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రైతులకు చెల్లించడానికి రూ.676.56 కోట్లు విడుదల చేసి రూ.524 కోట్లను రైతుల ఖాతాలలో జమ చేశామన్నారు. ఆర్‌బిఐ నిబంధనల మేరకు సహకార బ్యాంకులలో నగదు లావాదేవీలు నిలిచిపోవడంతో చెల్లింపులలో కొంత జాప్యం జరిగిందని కమిషనర్ తెలిపారు. డిసిసిబిలకు తమ శాఖ నిధులు విడుదల చేసినప్పటికీ రైతులకు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ దఫా ధాన్యం కొనుగోలు నుంచి చెల్లింపుల వరకు జరిపే అన్నీ లావాదేవీలను ఆన్‌లైన్‌లో ద్వారా నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీని వల్ల దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నిర్మూలించగలమన్నారు.
నిరుడు ఖరీఫ్‌లో 1671 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి 2000 కేంద్రాల ద్వారా దాదాపు 18 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరి సాధారణ రకానికి క్వింటాలుకు రూ.1470, గ్రేడ్ ఏ రకానికి క్వింటాలుకు రూ.1510 కనీస మద్దతు ధర నిర్ణయించినట్టు కమిషనర్ వివరించారు.

మావోల కోసం నోట్ల మార్పిడి యత్నం
ఇద్దరు కాంట్రాక్టర్లు, బ్రాంచ్ పోస్టుమాస్టర్ అరెస్టు
రూ.12 లక్షల నగదు స్వాధీనం
మహబూబ్‌నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి

మహబూబ్‌నగర్, డిసెంబర్ 1: మావోయిస్టులకు డబ్బు ఇచ్చేందుకు నోట్లు మార్పిడికి యత్నించిన ఇద్దరు కాంట్రాక్టర్లు, బ్రాంచి పోస్టుమాస్టర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. గురువారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూ.1000 500 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో సంఘ వ్యతిరేక శక్తులు ఎక్కడైనా డబ్బులు మార్చవచ్చని, అలాంటివారిపై నిఘా ఉంచాలని డిజిపి ఆదేశించిన నేపథ్యంలో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. అందులో భాగంగా మావోయిస్టులకు డబ్బులు ఇచ్చేందు కోసం నోట్లను మార్పిడి చేసేందుకు యత్నించిన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో రాజా ఇంజనీరింగ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న త్రినాథ్‌రావు, అసిస్టెంట్ ఇంజనీర్ సిద్దార్థ, మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలం మంథన్‌గోడు గ్రామంలోని బ్రాంచి పోస్టుమాస్టర్ సత్యనారాయణచారిలను ఆరెస్టు చేశామన్నారు. త్రినాథ్‌రావుకు ఖమ్మం మావోయిస్టు జిల్లా కార్యదర్శి నుండి ఓ లేఖ అందిందని, అందులో డబ్బులు ఇవ్వాలంటూ రాసి ఉందన్నారు. వారం రోజుల్లో రూ.1.30 లక్షలు ఇవ్వడానికి ఇంజనీర్లు ఒప్పుకున్నారని ఆమె తెలిపారు. దాంతో నవంబర్ 12వ తేదీన రూ.1000, 500 నోట్లను, మరికొంత నగదు తీసుకువెళ్లడం, అప్పటికే కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో కొత్త నోట్లు తీసుకురావాలని చెప్పారన్నారు. అందుకు అంగీకరించిన త్రినాథ్‌రావు సిద్దార్థతో చర్చించి పోస్టుమాస్టర్ సత్యనారాయణాచారితో సంప్రదింపులు జరిపారన్నారు. అయితే పోస్టుమాస్టర్ సత్యనారాయణ నోట్ల మార్పిడికి ముందుగా 30 శాతం కమిషన్ అడగగా తుదకు 15 శాతానికి ఒప్పుకున్నారని తెలిపారు. నవంబర్ 30వ తేదీ రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో ఓ కారులో మంథన్‌గోడు గ్రామానికి కాంట్రాక్టర్లు చేరుకోవడం, ఇంతలోపే మక్తల్ పోలీసులకు సమాచారం అందడంతో సత్యనారాయణచారి ఇంటిపై దాడి చేసి అందరినీ అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద ఉన్న రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టులకు డబ్బులు ఇచ్చేందుకు నోట్ల మార్పిడికి వచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు ఆరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నామని వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో నారాయణపేట డిఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మక్తల్ సిఐ శ్రీనివాసులు, ఎస్సై తదితరులు పాల్గొన్నారు.

పెద్ద నోట్ల రద్దుపై
అసెంబ్లీలో చర్చ జరగాలి
సిఎల్‌పి డిమాండ్

హైదరాబాద్, డిసెంబర్ 1: పెద్ద నోట్ల రద్దు, దీనివల్ల రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లపై రానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని సిఎల్‌పి ప్రభుత్వాన్ని కోరింది. గురువారం ఇక్కడ సిఎల్‌పి సమావేశం జరిగింది. అనంతరం సిఎల్‌పి కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రూ.7500 కోట్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చెప్పిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో పాటు అన్ని ప్రాజెక్టులకు కేటాయించిన నిధులపై శే్వతపత్రం ప్రకటించాలనానరు. ప్రాణహిత ఎస్‌ఎల్‌పిసి, సీతారామ, జూరరాల అన్ని ప్రాజెక్లుకు బడ్జెట్లో చెప్పిన నిధులను కుదించడం తగదన్నారు. ఇది దారుణమైన చర్య అన్నారు. బడ్జెట్లో చెప్పిన ప్రాజెక్టులను పక్కనపెట్టి మిషన్ భగరీథ మాత్రమే ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శే్వతపత్రం ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి బాగాలేదని పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం అనేక ప్రకటనలు చేసిందన్నారు. దీని వల్ల సంక్షేమ పథకాలకు చిల్లు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. నరుూమ్ డెన్ నుండి వేల కోట్ల డబ్బులు దొరికాయనే అనుమానాలు ఉన్నాయని, ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలని కోరారు.

మార్కెటింగ్ శాఖ
ఇక నగదు రహితం
ఈనెల 10 నాటికి అన్ని రైతు బజార్లలో అమలు

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్లు, రైతు బజార్లను నగదు రహితంగా మార్చాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలతో మార్కెట్ యార్డులలో జీరో దందాలకు చెక్ పెట్టవచ్చునని పారద్శకత మరింత పెరుగుతుందని అన్నారు. మార్కెటింగ్ శాఖలో ఏడాదికి 35వేల కోట్ల టర్నోవర్ ఉన్నందని చెప్పారు. రైతులకు, మార్కెట్ సిబ్బందికి క్యాష్ లెస్ విధానంపై తగిన శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ఐసిఐసిఐ వంటి బ్యాంకులు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. వరంగల్ మార్కెట్ కమిటీ అమలు చేస్తున్న నగదు రహిత విధానాలు అన్ని మార్కెట్‌లు అమలు చేయాలని చెప్పారు. రైతులతో పాటు మార్కెట్లలో పని చేసే దడ్వాయిలు, హమాలీలు, ఇతర కార్మికులందరికీ వెంటనే బ్యాంకు అకౌంట్‌లు తెరవాలని, వారికి డెబిట్ కార్డులు ఇవ్వాలని చెప్పారు.