తెలంగాణ

సింగంపల్లి తండాలో చిరుత కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 12: ఇటీవలి కాలంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిరుత పులుల సంచారం తరుచూ వెలుగుచూస్తుండడంతో అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం బాల్కొండ, మోర్తాడ్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, సిరికొండ, నిజాంసాగర్ తదితర మండలాల్లో చిరుత పులుల ఆనవాళ్లు బయటపడ్డాయి. తాజాగా, మాక్లూర్ మండలం సింగంపల్లితండాలో మరోమారు చిరుత కలకలం సృష్టించింది. తండాకు కొంత దూరంలో పి.మల్లేష్ అనే వ్యక్తి తన మేకల మందను ఉంచి వాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలోనే ఓ మేక కంచెను దాటుకుని కొద్దిదూరం వెళ్లగానే సోమవారం ఉదయం సమీప అడవి నుండి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. మల్లేష్ కళ్లెదుటే మేకను చంపి మెడ కొరికేసింది. ఈ హఠాత్పరిణామాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన మల్లేష్ ఒక్క ఉదుటున తండాలోకి పరుగులు తీసి గ్రామస్థులకు చిరుతపులి సమాచారం అందించగా, గిరిజనులు మూకుమ్మడిగా కర్రలు చేతబూని పెద్దపెద్ద శబ్దాలు చేస్తూ రావడంతో అక్కడి నుండి చిరుతపులి అడవిలోకి పారిపోయింది.
ఇదే తండాలో గతంలోనూ తన మేకల మందపై చిరుత దాడి చేసిందని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకుని మండల పశు వైద్యాధికారి సంఘటనా స్థలానికి చేరుకుని చెందిన మేకను పరిశీలించారు. చిరుత దాడిలోనే మేక మృతి చెందినట్టు నిర్ధారించగా, చిరుత కాలి ముద్రలను కూడా ఆ ప్రాంతంలో ఉండడాన్ని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
కౌలాస్ సెక్షన్ అటవీ ప్రాంతంలోనూ చిరుత పులులు సంచరిస్తూ పశువులపై దాడి చేస్తున్న ఉదంతాలు అడపాదడపా వెలుగుచూస్తూనే ఉన్నాయి. కౌలాస్ సెక్షన్ అటవీ ప్రాంతమైన పోచారం, శివ్వాపూర్, లింగంపల్లి, సావర్‌గాం, శాంతాపూర్, అంజని అటవీ ప్రాంతాల్లో తరుచుగా చిరుతపులులు సంచరిస్తుంటాయి. జనావాసాలకు చేరువగా, గ్రామాలకు ఆనుకుని ఉన్న పంట పొలాలు, పశువుల కొట్టాల వరకు చిరుత పులులు తరలి వస్తుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

చిత్రం..సింగంపల్లి తండాలో చిరుత దాడిలో మృతి చెందిన మేకను పరిశీలిస్తున్న పశువైద్యాధికారి