తెలంగాణ

ప్రైవేటు వర్శిటీలు వద్దేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 15: రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించారు. ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి చివరకు విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్‌కు దారితీసింది. రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం శుక్రవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. దీనిని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించిన ఐక్య కార్యాచరణ కమిటీ గురువారం వరంగల్ నగరం టీచర్స్ కాలనీలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంటిని ముట్టడించే కార్యక్రమాన్ని ఆకస్మికంగా చేపట్టింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో వేరువేరుగా ద్విచక్ర వాహనాలపై కడియం ఇంటికి చేరుకున్న విద్యార్థులు మొదట ధర్నా ప్రారంభించారు. ఆ తరువాత ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకంగా, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కడియం ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు నచ్చజెప్పినా ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకునేందుకు విద్యార్థి సంఘాల ప్రతినిధులు అంగీకరించకపోవటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భగా విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే పనిచేస్తున్న విశ్వవిద్యాలయాల పనితీరును, బోధనా సిబ్బంది నియామకాలను, అవసరమైన నిధులను మంజూరు చేయటంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంపై, సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని, ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో ఉన్న విశ్వవిద్యాలయాల సమస్యలను పరిష్కరించి విద్యారంగ అభివృద్ధికి ప్రయత్నించాలని డిమాండ్ చేసారు. ఆందోళన కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నర్సింహారావు, చిలువేరు శ్రీకాంత్, ఆశోక్ స్టాలిన్, విజయ్‌ఖన్నా, మంద నరేష్, సతీష్ మాదిగ, రాజేందర్, అనిల్, నరేష్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. ఉపముఖ్యమంత్రి కడియం ఇంటిముందు ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు. కడియం ఇంట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించిన విద్యార్థులు