తెలంగాణ

30వరకు అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: శుక్రవారం నుంచి అసెంబ్లీ, శాసన మండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాల షెడ్యూల్ ఈనెల 30 వరకు ఖరారైంది. తిరిగి మరోసారి బిఎసి సమావేశాన్ని నిర్వహించి సమావేశాల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటారు. గురువారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో బిఎసి సమావేశం జరిగింది. శుక్రవారం ఉదయం పది గంటలకు శాసన సభా సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం అవుతాయి. అనంతరం నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటన చేస్తారు. దాదాపు మూడు గంటల పాటు ఈ అంశంపై చర్చించాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన తరువాత బిఎసి సమావేశం అవుతుంది. ఈసారి మాత్రం ఒక రోజు ముందుగానే బిఎసి సమావేశం నిర్వహించి అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకున్నారు. సభను సజావుగా నిర్వహించాలనే నిర్ణయంలో భాగంగా ముందుగానే బిఎసి నిర్వహించి అన్ని పక్షాల ఏకాభిప్రాయంతో అజెండా ఖరారు చేశారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి, భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసన సభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్, బిజెపి శాసన సభాపక్షం నాయకుడు కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్య (సిపిఎం), సండ్ర వెంకటవీరయ్య (టిడిపి) బిఎసి సమావేశంలో పాల్గొన్నారు.
డిసెంబర్ 30 వరకు సమావేశాల నిర్వాహణపై నిర్ణయం తీసుకున్నా, జనవరిలో వారం రోజుల పాటు సమావేశాల నిర్వహణకు మరోసారి బిఎసి సమావేశం జరపాలని నిర్ణయించారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై శాసనసభలో చర్చ జరపాలని కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం నాయకులు కోరగా, కేంద్రానికి సంబంధించిన అంశంపై శాసనసభలో చర్చ అవసరం లేదని బిజెపి వాదించింది. నోట్ల రద్దు కేంద్రానికి సంబంధించిన అంశం, రాష్ట్రంలో చర్చ ఎందుకు? అని బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మీరు చెప్పేది మీరు చెప్పండి, రాష్ట్రానికి ఏం సంబంధమో, ప్రజలకు ఇబ్బందులు ఏమిటో మేం చెప్పాల్సింది మేం చెబుతాం అని ఎంఐఎం శాసన సభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ అన్నారు. నోట్ల రద్దు అంశం కేంద్రానికి సంబంధించిందని, మీరంతా చర్చించాలి అంటే అధికార పక్షానికి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ చర్చకు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో తొలి రోజు ప్రశ్నోత్తరాల తరువాత నోట్ల రద్దు అంశంపై చర్చించాలని నిర్ణయించారు. సమావేశాలు 20 రోజుల పాటు జరపాలని కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అయితే తొలుత 30 వరకు సమావేశాలను ఖరారు చేసి, మరోసారి బిఎసి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మరోసారి బిఎసి సమావేశం జరిగి వారం రోజుల పాటు సమావేశాలు పొడిగించాలని నిర్ణయిస్తే, జనవరి మొదటి వారం కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.
25 రోజులైనా సరే
12 పని దినాల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బిఎసిలో ఈనెల 30 వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. సెలవులను మినహాయిస్తే మొత్తం పనె్నండు పనిదినాలు ఉంటాయని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం గతంలో గంట పాటు ఉండేదని, దాన్ని గంటన్నరకు పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.
సమావేశంలో ప్రధానంగా తొమ్మిది అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. టిఎస్‌ఐపాస్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, రైతుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించనున్నట్టు చెప్పారు. విపక్షాలు 20 రోజుల పాటు సభ జరపాలని కోరితే, ముఖ్యమంత్రి అవసరం అయితే 25 రోజుల పాటు సభ జరిపేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరుసటి రోజు శనివారం కూడా సమావేశాలు నిర్వహిస్తారు. 18, 24, 25 తేదీలు సెలవు దినాలు.

చిత్రం..గురువారం స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన
బిఎసి సమావేశంలో పాల్గొన్న సిఎం కెసిఆర్, ప్రతిపక్షనేత జానారెడ్డి ఇతర పక్షాల నేతలు