తెలంగాణ

విద్యార్థుల ఆకలి కేకలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 16:ప్రభుత్వం అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యం వెరసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మిథ్యగా మారింది. కాలే కడుపులతో నకనకలాడుతూ గడపాల్సిన స్థితిలో విద్యార్థులున్నారు. అసలే అంతంతమాత్రంగా కేటాయింపులున్న ఈ మధ్యాహ్న భోజన పథకం నిధులు సరిగా విడుదల కాక నీరుగారుతోంది. బిల్లుల కోసం కార్మికులు ఆందోళనబాట పట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులుగా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు పగటి పూట అన్నం తినకుండానే మాడుతున్న కడుపులతో తరగతులకు హాజరవుతున్నారు. నెలల తరబడి వంట ఏజన్సీలకు బిల్లులు, కార్మికులకు వేతనాలు చెల్లించకపోవటంతో మధ్యాహ్నం వంట నిలిపేసిన నిర్వాహకులు, కార్మికులు.. బకాయిలు చెల్లించాలంటూ రోడ్డెక్కారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టరేట్‌ల ఎదుట నిరసన దీక్షలు చేపడుతుండగా, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విధిలేక కొంతమంది విద్యార్థులు తమ ఇళ్ళనుంచే భోజనం తెచ్చుకోవలసి వస్తోంది.
ఎనిమిది నెలలుగా అందని బిల్లులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2,248 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదోతరగతి వరకు చదువుతున్న 2,48,621 మంది విద్యార్థులకు మధ్నాహ్న భోజనం అందించేందుకు 2,183 వంట ఏజన్సీలు పనిచేస్తున్నాయి. వీటికి వంట బిల్లులతోపాటు, కార్మికులకు ఒక్కొక్కరికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తూ నిధులు విడుదల చేస్తుండగా, ఎనిమిది మాసాల నుంచి వంట ఏజన్సీల బిల్లులు, ఆరు మాసాలుగా కార్మికుల గౌరవ వేతనం నిలిచింది.
నోట్ల రద్దు ఎఫెక్ట్
నిత్యావసర ధరలు పెరిగినా ప్రభుత్వం అందిస్తున్న అరకొర నిధులతోనే నెట్టుకొస్తున్న వీరిని నోట్ల రద్దు పెనం మీది నుంచి పొయ్యిలో పడేసినట్లయింది.
అర్నెల్లు, మూనె్నళ్ళకోమారు విడుదలయ్యే నిధులు ఎనిమిది మాసాలు గడిచినా ఇప్పటికీ కానరాకపోగా, స్వశక్తి సంఘాల్లో నిండుకున్న నిధులు, బ్యాంకుల నిబంధనలు, కిరాణ దుకాణాల్లో పెరిగిపోయిన అప్పులు మధ్యాహ్న వంటలు నిలిపేసేలా చేశాయి. దీనిని గమనించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో తమకు చెల్లించాల్సిన మొత్తం కోసం నిర్వాహకులు నిరసనలు తెల్పుతున్నారు. దీనిపై ప్రభుత్వం సత్వరమే స్పందించి, విద్యార్థులకు మధ్యాహ్నం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.