తెలంగాణ

వేగవంతంగా భూసేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరం అయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్లు భవనాల శాఖ కార్యకలాపాలు, మార్కెటింగ్ శాఖ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు శనివారం శాసన సభ కమిటీ హాలులో సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసన సభ్యులు హాజరయ్యారు. మూడు జిల్లాల్లో మంజూరైన జాతీయ రహదారులను సత్వరం పూర్తి చేయాలని చెప్పారు. జాతీయ రహదారులకు అవసరం అయిన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, దీని కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.
జాతీయ రహదారుల పనులు వేగవంతం చేయడాన్ని ప్రాధాన్యత అంశంగా కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు. పాత మెదక్ జిల్లా పరిధిలోని 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రోడ్లు భవనాల శాఖ కార్యక్రమాల పట్ల పద్మాదేవేందర్‌రెడ్డి , ఇతర శాసన సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం పట్ల ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, మంత్రులు, శాసన సభ్యులు బహిరంగంగా విమర్శించడాన్ని బట్టి ఆర్ అండ్ బి అధికారుల పనితీరు తెలుస్తోందని అన్నారు. ఇది వర్కింగ్ సీజన్ అయినందున పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి పనికి నిర్ణీత కాల వ్యవధి పెట్టుకొని డెడ్‌లైన్‌తో పని చేయాలని చెప్పారు. ఈ మూడు జిల్లాల్లో ఉపాధి హామీ పనితీరుపై మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలు రాష్ట్రంలో మోడల్ జిల్లాలుగా నిలవాలని అన్నారు. రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నందు వల్ల ప్రత్యామ్నాయంగా పొలాల్లోనే రైతుల కళ్ళేలను సిమెంట్ కాంక్రీటుతో నిర్మించే విషయం పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మిషన్ కాకతీయ మొదటి, రెండవ దశల్లో చేపట్టిన పనులు, ఫలితాలను సమావేశంలో హరీశ్‌రావు సమీక్షించారు. చెరువుల ద్వారా ఈ సంవత్సరం 35వేల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. పాత మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో పది రైతు బజార్లను ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గడ్డి అన్నారం మార్కెట్ యార్డ్‌ను తరలించేందుకు రంగారెడ్డి జిల్లా కోహెడ వద్ద 120 ఎకరాలను యుద్ధప్రాతిపదికన సేకరించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు.

చిత్రం..శనివారం శాసన సభ కమిటీ హాలులో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో మంత్రి తుమ్మల తదితరులు ఉన్నారు