తెలంగాణ

రైలొచ్చిది..కల నెరవేరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 29:మోర్తాడ్‌కు తొలిసారి కూ చుక్ చుక్‌మంటూ రైలు పరుగులుపెడుతూ వచ్చింది. తొలిసారి అక్కడివారు రైలు కూత విన్నారు. డెబ్భై ఏళ్ల వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పెద్దపల్లి - నిజామాబాద్ మార్గంలో జగిత్యాల వరకే పరిమితమైన పుష్‌పుల్ ట్రైన్ ఇప్పుడు మోర్తాడ్‌నూ పలకరించింది. స్వాతంత్య్రానికి పూర్వమే ఈ రైలుమార్గంపై నిజాం శ్రద్ధ చూపించినా ఇప్పటికి కానీ రైలుకు గ్రీన్ సిగ్నల్ పడలేదు. మొత్తానికి ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నవారికి పరుగులు తీస్తూ వచ్చిన రైలు ఆనందాన్ని తెచ్చిపెట్టింది.
నిజాం హయాం నుంచి..
స్వాతంత్య్రానికి పూర్వమే పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్ ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. 1946లోనే అప్పటి ఏడవ నిజాం నవా బు ఈ మార్గంలో రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసినప్పటికీ, సర్వే ప్రక్రియను చేపట్టడంలో ఎనలేని జాప్యం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు రైల్వే లైన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ అనేక పోరాటాలు చేసిన మీదట ఎట్టకేలకు 1993 జూన్‌లో అప్పటి ప్రధాని పివి.నర్సింహారావు పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం 178 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో రైల్వే లైన్ పూర్తయ్యేందుకు 417కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఆ సమయంలో అంచనా వేశారు. అయితే దశాబ్ద కాలం గడిచినప్పటికీ, ఈ రైల్వే లైన్‌కు బడ్జెట్‌లో నయాపైసా కేటాయించకుండా మొండిచేయి చూపు తూ వచ్చారు. దీంతో స్థానిక ప్రజలు మరోమారు ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2004-05 రైల్వే బడ్జెట్‌లో తొలిసారిగా 22.84కోట్ల రూపాయలను కేటాయించారు. ఇదే తరహాలో 2014వరకు కూడా అరకొర బడ్జెట్‌తోనే సరిపెట్టడంతో పనులు నత్తనడకన కొనసాగాయి.
వెంటాడిన నిధుల కొరత
వాస్తవానికి 2001వ సంవత్సరం నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, నిధుల కొరత కారణంగా దశాబ్దన్నర కాలం పాటు జాప్యం జరిగింది. గడిచిన మూడు సంవత్సరాల నుండి ఒకింత ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించడంతో పెండిం గ్ పనులు ఒక్కోటిగా కొలిక్కి వస్తూ పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైన్ కల సాకారం దిశగా ముందడుగు వేయగలిగింది. ప్రత్యేకించి 2015-16 రైల్వే బడ్జెట్‌లో 141కోట్ల రూపాయలను కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి. గత బడ్జెట్‌లోనూ 70కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఆర్మూర్ రైల్వే స్టేషన్‌గా పూర్తయినప్పటికీ, తొలి విడతగా మోర్తాడ్ వరకే రైళ్ల రాకపోకలకు పచ్చజెండా ఊపారు. ఆర్మూర్ నుండి నిజామాబాద్ వరకు 20కిలోమీటర్ల నిడివిలో తుది దశ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులన్నీ మరో మూడు మాసాల్లో పూర్తవుతాయని, వచ్చే ఏప్రిల్ నాటికి పెద్దపల్లి నుండి నిజామాబాద్ వరకు రైలు సర్వీసులు ప్రవేశపెట్టడం ఖాయమని అటు రైల్వే శాఖ అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు భరోసా కల్పిస్తున్నారు.

చిత్రం..సికింద్రాబాద్ స్టేషన్‌లో పెద్దపల్లి -మోర్తాడ్ పుష్‌ఫుల్ రైల్‌ను ప్రారంభిస్తున్న
హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి, మంత్రి మహేందర్‌రెడ్డి తదితరులు