తెలంగాణ

సభనుంచి విపక్షాల వాకౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 5: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని నిరసిస్తూ శాసనసభ నుంచి గురువారం కాంగ్రెస్, టిడిపి, సిపిఎం పార్టీలు వాకౌట్ చేశాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గుర్తు చేస్తూ ‘వారు ప్రవేశపెట్టిన పథకంపై వాళ్లే వాకౌట్ చేయడమంటే వాళ్ల ముఖాలపై వాళ్లే ...’లా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ హయాంలో 2009 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టినప్పటికీ తాము కొనసాగిస్తున్నామన్నారు. వారి హయాంలో ఏ విధంగా ఈ పథకాన్ని అమలు చేశారో అంతకంటే బాగా తాము అమలు చేస్తున్నామని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఏమి లేకపోయినా కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం రాజకీయం చేయడానికే రెండు రోజులుగా ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి విమర్శించారు. దీనిపై చర్చ బుధవారమే ముగిసినప్పటికీ వారు మాట్లాడతామంటే ఎందుకు కాదనాలని రెండవ రోజు కూడా అవకాశం కల్పించామన్నారు. శాసనసభను నడపకపోతెనేమో ప్రభుత్వం పారిపోయిందని గతంలో గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేశారని, అలాగని సభ పెడితేనేమో మాట్లాడకుండా సభ నుంచి బయటికి వెళ్లిపోతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. కేవలం రాజకీయం చేయాలన్న ఉద్దేశంతోనే రెండు రోజులుగా కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రతిది రాజకీయం చేయాలని చూస్తోందని, ఉదయ్ పథకంలో చేరడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు 30 ఏళ్లపాటు తమ హయాంలో విద్యుత్ రంగాన్ని అంధకారం చేసి రూ.12 వేల కోట్ల అప్పుల భారాన్ని మోపాయన్నారు. డిస్కమ్‌లపై ఉన్న అప్పుల భారాన్ని ప్రభుత్వం మోయడానికి ఉదయ్ పథకంలో చేరడం తప్పు ఎలా అవుతుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మరే రాష్ట్రం చేయని విధంగా రూ.35 వేల కోట్ల పథకాలను అమలు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీ ఒర్వలేకపోతోందని ముఖ్యమంత్రి విమర్శించారు.
వాకౌట్ చేయడానికి ముందు కాంగ్రెస్ తరఫున ఉప నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చేయకపోవడంతో గోపి అనే విద్యార్థి ట్రిపుల్ ఐటిలో వచ్చిన సీటు కోల్పొయాడని ఆరోపించారు. విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌సి, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌ల డబ్బులను కూడా ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై సిఐడి, పోలీసులతో తనఖీలు చేయించిన ప్రభుత్వం వారు ఇచ్చిన నివేదికలను సభ ముందు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.
టిడిపి పక్షం నాయకుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై నిర్వహించిన దాడులకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింప చేయటం లేదన్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని టిడిపి, సిపిఎం సభ్యులు ప్రకటించారు. బిజెపి పక్షం నాయకుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ మార్చినాటికి చెల్లిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. అప్పటికీ చెల్లించని పక్షంలో తమ పార్టీ నిరాహార దీక్ష చేస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హామీని గౌరవించి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని ఎంఐఎం పక్షం నాయకుడు అక్బరుద్దీన్ సూచించారు.