తెలంగాణ

సికిందరాబాద్ స్టేషన్‌లో తొక్కిసలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులతో బస్సుస్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే సమయంలో తొక్కిసలాట జరిగింది. ప్రయాణికుల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జి జరిపారు. ఎంఎంటిఎస్ రైళ్లతోపాటు, దూరప్రాంతాలకు వెళ్లే రైళ్ల వద్ద ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనరల్ బోగీలో ఎక్కాల్సిన ప్రయాణికులను రైల్వే పోలీసులు క్యూలైన్లో నిలబెట్టారు. రైలు వచ్చే సమయంలో ప్రయాణికులు క్యూ నుంచి బయటకు వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. వారిని అదుపు చేయడం కోసం పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు.
అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన పల్లవి అనే ప్రయాణికురాలికి గాయాలు కావడంతో స్టేషన్లో ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. హైదరాబాద్ రైల్వే స్టేషన్లోనూ అదే పరిస్థితి. ప్రయాణికులను క్యూలైన్లో నిలుచోబెట్టడంతో రైళ్లు వచ్చే సమయానికి బోగీలకు చేరుకునే ప్రయాణికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రయాణికులను పోలీసులు అదుపుచేసేందుకు లాఠీచార్జ్ జరిపారు. అదేవిధంగా మహాత్మాగాంధీ బస్టాండ్, జెబిఎస్ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సికిందరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, జగిత్యాల, కాళేశ్వరం, ధర్మపురికి వెళ్లే బస్సులు హైదరాబాద్ మహాత్మగాంధీ బస్‌స్టేషన్‌లోనే నిండిపోయి వస్తుండడంతో సికిందరాబాద్‌లో సీట్లు దొరకక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రూట్లలో రోజూ వారీ బస్సు సర్వీసులతోపాటు 216 అదనపు సర్వీసులు నడిపిస్తున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపారు.
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి విజయవాడ, గుంటూరు, నాగార్జునసాగర్, మాచర్ల, ఒంగోలు, ఏలూరు, నెల్లూరు, విశాఖపట్టణం, అమలాపురం, పెద్దాపురం వైపు వెళ్లే సర్వీసులకు పక్షం రోజుల ముందే రిజర్వేషన్ సౌకర్యం కల్పించినప్పటికీ రద్దీకి తగ్గట్టుగా బస్సులు నడపడం లేదని ప్రయాణికులు వాపోయారు. అదేవిధంగా కర్నూలు, శ్రీశైలం, నంద్యాల, కడప, తిరుపతి వెళ్లే మార్గాల్లో కొన్ని సర్వీసులే నడిపిస్తున్నారని ప్రయాణికులు వాపోయారు. అదనపు బస్సు సర్వీసులు, అదనపు చార్జీలతో నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికులకు సరైన సౌకర్యం కల్పించలేకపోతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తిరుగు ప్రయాణంలోనైనా రద్దీని దృష్టిలో పెట్టుకుని మరింత రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తగు ఏర్పాట్లు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ ఫాంలపై రైల్వే పోలీసులు ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తున్నారని, రైల్వే స్టేషన్ల ప్రవేశ, బయటకు వెళ్లే దారుల్లో పోలీసులు ప్రయాణికులకు సహకరిస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

చిత్రం.. సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే సమయంలో తొక్కిసలాట
* ప్రయాణికురాలికి గాయాలు