తెలంగాణ

‘ఉపాధి’కి ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: వచ్చే వార్షిక బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. వచ్చే బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు పంపించిందన్నారు. పెట్టుబడుల ఖర్చు, రెవెన్యూ ఖర్చుల పద్ధతిలో బడ్జెట్‌ను రూపొందించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు. ఇంతవరకు ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులవారీగా బడ్జెట్ తయారు చేసేవారమన్నారు. బుధవారం అసెంబ్లీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు ఉపాధి నిమిత్తం గత మూడేళ్ల సబ్సిడీని ప్రభుత్వం కేటాయించిన నిధులపై జరుగుతున్న చర్చలో సిఎం జోక్యం చేసుకుని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31లోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం తరఫున ఉపాధి నిమిత్తం ఇచ్చే సబ్సిడీ నిధులు రూ.500 నుంచి రూ.550 కోట్ల వరకూ కేటాయిస్తామన్నారు. దీని గురించి సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు తెలిపిన విధంగా 5.07 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తులను ఆమోదించినా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభం కాకపోవడం వల్ల ప్రజలకు ప్రతికూల సంకేతాలు పోతాయన్న ఉద్దేశ్యంతో 2014 నుంచి 2016 వరకు రెండేళ్లపాటు ఎంపికైన లబ్ధిదారులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ ఏడాది మార్చి 31లోపల ఈ ఏడాది లబ్ధిదారులకు సబ్సిడీ ఇస్తామన్నారు. సబ్సిడీని గరిష్టంగా ఐదు లక్షల వరకూ పెంచామన్నారు. మైనారిటీ సంక్షేమానికి రూ.277.6 కోట్లు, ఎస్సీ అభివృద్ధికి రూ.2015.99 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.189.89 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ. 425.22 కోట్లు కలిపి రూ.2908.16 కోట్లను మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ నిధుల విషయమై తెరాసను విమర్శించే హక్కు లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఉపాధి నిమిత్తం బ్యాంకులకు సబ్సిడీ కింద ఇచ్చిన నిధులు కేవలం రూ.370 కోట్లు మాత్రమేనన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ అని ప్రజలకుభ్రమలు కల్పించిన తెరాస ప్రభుత్వం అణగారిన వర్గాలకు అవసరమైన సబ్సిడీ నిధులు మంజూరు చేయలేదన్నారు. దీనికి బాధ్యత వహించి మంత్రి ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి తప్పుకుంటారా? ప్రజలకు క్షమాపణ చెబుతారా? అని నిలదీశారు. ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదన్నారు. సిఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన సబ్సిడీ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెదేపా ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు న్యాయం చేయాలని కోరారు.