తెలంగాణ

ఇంజనీర్ మృతిపై మెజిస్టీరియల్ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: నిజామాబాద్ మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మృతి ఉదంతంపై ఆదివారం మెజిస్టీరియల్ విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. లంచం స్వీకరిస్తూ ఎసిబి అధికారులకు పట్టుబడిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎం.ఇ వెంకటేశ్వర్లు తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీలోనే భద్రపర్చగా, ఆదివారం ఉదయం నిజామాబాద్ ఎసిపి ఆనంద్‌కుమార్ నేతృత్వంలో వీడియో రికార్డింగ్ నడుమ వైద్యులు వెంకటేశ్వర్లు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మెజిస్ట్రేట్ సైతం జిల్లా ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి మృతుడి కుటుంబీకులు, మున్సిపల్ వర్గాలతో పాటు మరికొందరి వాంగ్మూలాలను నమోదు చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజామాబాద్‌కు తరలివచ్చి వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబీకులను పరామర్శించారు. ఇదివరకు వెంకటేశ్వర్లు నల్లగొండ మున్సిపాలిటీలో ఇంజనీర్‌గానే కాకుండా నాలుగేళ్లు ఇన్‌చార్జి కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. దీంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇక్కడికి చేరుకుని, ఎం.ఇ వెంకటేశ్వర్లు తరఫున మెజిస్ట్రేట్‌కు స్వచ్ఛందంగా తన వాంగ్మూలం అందించారు. నల్లగొండలో దాదాపు ఏడేళ్లకు పైగా పనిచేసిన సమయంలో ఎంతో నిజాయితీ గల అధికారిగా వెంకటేశ్వర్లు పేరు పొందారని, ఇప్పటికీ ఆయనకు ఎక్కడా సొంత ఇల్లు లేదని, పనులు పక్కాగా జరిపించేవారని వెంకటేశ్వర్లుతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని, ఆయన కుటుంబీకుల స్థితిగతులను మెజిస్ట్రేట్‌కు వాంగ్మూలం రూపంలో వెల్లడించానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. దురుద్దేశ్యపూర్వకంగానే ఆయనను ఎసిబి కేసులో ఇరికించినట్టు స్పష్టమవుతోందని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టిఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్ నేతృత్వంలోనూ యూనియన్ నాయకులు మెజిస్ట్రేట్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులను కలిసి ఎం.ఇ మృతి ఉదంతాన్ని సీరియస్‌గా పరిగణించి లోతుగా దర్యాప్తు జరిపించాలని కోరారు. మున్సిపల్ పనుల కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి వేరొకరైతే, ఆయన నుండి ఆ పనులను సబ్ కాంట్రాక్టర్ రూపంలో దక్కించుకున్న గుత్తేదారు రాములు చేసిన ఫిర్యాదుపై ఎసిబి అధికారులు ఎలా స్పందిస్తారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసన్, మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ధన్‌సింగ్ కూడా నిజామాబాద్‌కు చేరుకుని స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం సమగ్ర నివేదిక అందిన మీదట శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఎసిబి జె.డి పేర్కొన్నారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఎం.ఇ వెంకటేశ్వర్లు మృతదేహాన్ని నగర పాలక సంస్థ కార్యాలయానికి తరలించారు. మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీం, కమిషనర్ నాగేశ్వరరావుతో పాటు కార్పొరేటర్లు, ఇతర ఉద్యోగులు అశ్రునయనాలతో ఎం.ఇ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి మృతదేహాన్ని బల్దియా ఆధ్వర్యంలో సమకూర్చిన వాహనంలో మృతుడి స్వస్థలమైన ప్రకాశం జిల్లా చీరాలకు తరలించారు. ఎం.ఇ వెంకటేశ్వర్లు సతీమణి నారాయణమ్మ, కుమార్తె ప్రవళిక, కుమారుడు కృష్ణచైతన్య తదితరులు మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అనవసరమైన తప్పుడు ఫిర్యాదులతో నిజాయితీ గల అధికారిని పొట్టన బెట్టుకున్న కాంట్రాక్టర్ రాములుతో పాటు ఎసిబి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబీకులు డిమాండ్ చేశారు.

చిత్రం..జిల్లా ఆసుపత్రి వద్ద విచారణ చేపట్టేందుకు హాజరైన మెజిస్ట్రేట్