తెలంగాణ

తెలంగాణలో ‘ఉద్యోగ పర్వం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణలో టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్నాయి. అదే సమయంలో టిఆర్‌ఎస్ పార్టీ పథకాల ద్వారా తన పునాదులు మరింత పటిష్ఠ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉభయ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఉద్యోగ నియామకాల అంశం ఆధారంగానే టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం కావడం విశేషం.
తెలంగాణ ఏర్పడిన కొత్తలో ప్రభుత్వ పనితీరును తెలంగాణ జెఎసి నాయకులు కోదండరామ్ అభినందించారు.. విలేఖరుల సమావేశాల్లో ప్రకటించారు. అయితే కెసిఆర్‌కు, కోదండరామ్‌కు మధ్య ఉద్యమ కాలంలోనే దూరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన తరువాత అది మరింతగా పెరిగిపోయింది. తెలంగాణ ఉద్యమ కాలంలో సమైక్య వాదాన్ని బలంగా వినిపించిన సిపిఎంతో సైతం కోదండరామ్ చేతులు కలిపారు. అదే విధంగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరితోనైనా చేతులు కలిపేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉద్యోగ నియామకం అంశానే్న ఆధారం చేసుకుని కోదండరామ్ చేపడుతున్న ఆందోళనకు ఆయా రాజకీయ పార్టీల విద్యార్థి అనుబంధ సంఘాలు మద్దతుగా నిలిచాయి.
2014 ఎన్నికల ప్రచారంలో కెసిఆర్ ఉస్మానియా యూనివర్సిటీ, మాణికేశ్వర్‌నగర్ వైపు ప్రచారానికి వస్తే ఒక వర్గం విద్యార్థులు రానివ్వకుండా అడ్డుకున్నారు. చివరకు అక్కడ ప్రచారం చేయకుండానే కెసిఆర్ వెనుదిరిగి వెళ్లిపోయారు. చిత్రంగా హైదరాబాద్ మొత్తంలో ఆ ఒక్క నియోజక వర్గంలోనే టిఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. సికిందరాబాద్ నుంచి పద్మారావు గెలిచారు. యూనివర్సిటీలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గం ఇప్పుడు ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. వామపక్ష పార్టీల విద్యార్థి అనుబంధ సంఘాలు, బిజెపి, టిడిపి విద్యార్థి సంఘాలు ఆందోళనల్లో పాల్గొంటున్నాయి. ఉద్యోగ నియామకాలు జరగడం లేదని కోదండరామ్ ఆరోపించగా, ఏయే శాఖలో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది, ఎన్ని నియామకాలు జరిగిందీ అధికార పక్షం వివరిస్తోంది. జెఎసి ర్యాలీ ప్రభుత్వానికి ఒక పరీక్షలాంటిదని అధికార పక్షం ఎంపి ఒకరు అభిప్రాయపడ్డారు. చిన్న పొరపాటు జరిగినా యువతను అధికార పక్షానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి ఉపయోగించుకుంటారని, దీనిని దృష్టిలో పెట్టుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికార పక్ష నేతలు తెలిపారు. ఇరు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని అధికార పక్షం వాదిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత 62,493 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్టు ప్రభుత్వ వాదన. భర్తీ అయిన ఉద్యోగాలు 24,912 కాగా, 17581 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చారు. మరో 20వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నారు. పోలీసు శాఖలో 11,820 ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు ప్రారంభమ య్యాయి. విద్యుత్ శాఖలో 2324, సింగరేణిలో 4340, ఆర్టీసిలో 3,944 కండక్టర్లు, డ్రైవర్ల పోస్టులపై రెగ్యులరైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 1311 అగ్రికల్చర్ ఏఈవో పోస్టులను నియమించారు. వాటర్ వర్క్స్‌లో 263 పోస్టులు నియమించినట్టు చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా మొత్తం 17,581 పోస్టుల నియామకానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నట్టు చెప్పారు. కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ఏడువేలకు పైగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్రిక్త వాతావరణం కల్పించి యువతను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏం జరిగింది? ఏం జరుగుతోంది అనేది స్పష్టంగా ప్రజలకు వివరిస్తామని అధికార పక్షం తెలిపింది.