తెలంగాణ

రైతు చెంతకు ‘అధునాతన’ విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: అంతర్జాతీయంగా స్పేస్ టెక్నాలజీలో అతివేగంగా దూసుకుపోతున్న భారత్, వ్యవసాయ రంగంలో కూడా అత్యాధునిక సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెడుతోంది. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇందుకు వేదిక కాబోతోంది. రైతుల పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచుతామని పదే పదే తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటిస్తుండగా, ‘పర్ డ్రాప్-మోర్ క్రాప్’ (ప్రతి నీటి బొట్టుకు అధిక ఫలసాయం) పేరుతో ప్రధాని రైతుల ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధన పూర్తి ఫలితాలు ఇవ్వగలిగితే, రైతుల మొబైల్ ఫోన్లకే సమాచారం వస్తుంది. రైతు పంటలకు నీరు అందుతోందా లేదా, అందితే అవసరమైన మేరకు అందిందా లేదా? మట్టిలో పోషక పదార్థాలు (ఎన్‌పికెతో పాటు ఇతర పోషకాలు) ఎంత పరిమాణంలో ఉన్నాయి? అన్న విషయాలన్నీ ఎప్పటికప్పుడు సంబంధిత రైతుల మొబైల్ ఫోన్లకు మెస్సేజ్‌ల ద్వారా సమాచారం అందుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ తరహా పరిశోధన కోసం దేశంలోని ఒకటి రెండు ఇతర సంస్థలతో పాటు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసింది. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తొలిదశలో ఇందుకోసం 60 లక్షల రూపాయలు కేటాయించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసర్చ్ (ఐసిఎఆర్) ద్వారా కేంద్రం నిధులు ఇస్తోంది. సాంకేతిక విద్యాసంస్థలు అవసరమైన సాంకేతిక సాయం అందిస్తున్నాయి. సేద్యపు భూముల్లో అమర్చేందుకు ప్రత్యేకంగా సెన్సార్‌లను రూపొందిస్తున్నారు. ఈ సెన్సార్‌లో మూడు రకాల రంగుల బల్బులు ఉంటాయి. ఒక రంగు బల్బు వెలిగితే నీరు లేదని, మరొక రంగు బల్బు వెలిగితే కొద్ది నీరు అందుబాటులో ఉందని, ఇంకొక రంగు బల్బు వెలిగితే అవసరమైనదానికంటే ఎక్కువ నీరు లభించిందని హెచ్చరించినట్టని శాస్తవ్రేత్తలు తెలిపారు.
తమ యూనివర్సిటీటీకి ఇటీవలనే ప్రాజెక్టును కేంద్రం ఇచ్చిందని తెలంగాణ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగానికి చెందిన డాక్టర్ బల్‌రాం తెలిపారు. మంగళవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలోని అగ్రానమీ విభాగానికి చెందిన డాక్టర్ వి. రాములు, సాయిల్ సైన్స్ విభాగానికి చెందిన డాక్టర్ ఉమాదేవీలు ఈ పరిశోధనలు చేపట్టారన్నారు. తమ పరిశోధనలో నానో మాయిస్చర్ సెన్సార్‌లు, నానో సాయిల్ న్యూట్రియంట్ సెన్సార్‌లను వినియోగిస్తామన్నారు.
ప్రస్తుతం మ్యానువల్‌గా భూసార పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని రైతులు పూర్తిగా ఉపయోగించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో అత్యాధునిక పరికరాలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తమ పరిశోధన ఇప్పుడే ప్రారంభం అయిందని, రెండు, మూడు సంవత్సరాల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామని డాక్టర్ బల్‌రాం వివరించారు.