తెలంగాణ

నేటినుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్రం లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతినొందిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి (యాదగిరిగుట్ట) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మార్చి 9వ తేదీ వరకు 11 రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తుల రద్దీ అంచనాల మేరకు అవసరమైన ఏర్పాట్లను ఃదేవస్థానం చేపట్టింది. దేవస్థానం అభివృద్ధి, పునర్ నిర్మాణ పనులు సాగుతున్న నేపథ్యంలో ఈ దఫా బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవంలో తిదండి చినజీయర్‌స్వామి సూచనల మేరకు స్వల్ప మార్పులు చేశారు. మార్చి 5న ఎదుర్కోలు ఘట్టంతో పాటు మార్చి 6వ తేదీ సోమవారం ఉదయం 11గంటలకు నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహుల తిరు కల్యాణోత్సవాన్ని కొండపైన బాలాలయంలో నిర్వహిస్తారు. అనంతరం అదేరోజు రాత్రి 8గంటలకు కొండ కింద పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి వైభవోత్సవ కల్యాణాన్ని భక్తుల సమక్షంలో నిర్వహిస్తారు. స్వామివారి దివ్య విమాన రథోత్సవాన్ని సైతం కొండ కిందనే నిర్వహిస్తారు. ఇతర బ్రహ్మోత్సవ పూజాదికాలు, అలంకార సేవలు, వాహనసేవలు, ధార్మిక, సాహిత్య, సంగీత మహాసభలన్ని కొండపైనే యథాతధంగా కొనసాగనున్నాయి. లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి సాంప్రదాయానుసారం రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరై ఉదయం బాల ఆలయంలో జరిగే కల్యాణోత్సవంలో స్వామివార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా కల్యాణోత్సవానికి హాజరవుతారు.
11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహుల బ్రహ్మోత్సవాలు నేడు సోమవారం ఉదయం 8:45 గంటలకు శ్రీ విశ్వక్సేన ఆరాధన, స్వస్త్తివచనంతో ప్రారంభమవుతాయి. 28న ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం, రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం, మార్చి 1న ఉదయం 9 గంటలకు మత్య్సావతార అలంకార సేవ, వేద పారాయణాల ప్రారంభం, రాత్రి శేషవాహన సేవ నిర్వహిస్తారు. మార్చి 2న ఉదయం 10 గంటలకు శ్రీ మురళీకృష్ణాలంకారం, రాత్రి 8:30 గంటలకు హంసవాహన సేవ, 3వ తేదీ ఉదయం 10 గంటలకు వటపత్రసాయి అలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవ, 4న ఉదయం గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి సింహవాహ సేవ, 5వ తేదీ ఉదయం 10గంటలకు జగన్మోహిని అంలకార సేవ, రాత్రి 9 గంటలకు అశ్వవాహన సేవ, బాలాలయంలో శ్రీ స్వామివారి ఎదుర్కోలు, 6వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీరామ అలంకారసేవ, ఉదయం 11గంటలకు బాలాలయంలో శ్రీ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం, రాత్రి 8గంటలకు కొండ కింద జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి వైభవోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.
మార్చి 7న ఉదయం 10 గంటలకు స్వామివారికి బాల ఆలయంలో గరుడ వాహన సేవ, రాత్రి 7గంటలకు కొండ కింద విమాన రథోత్సం, 8వ తేదీ ఉదయం 11గంటలకు మహాపూర్ణాహుతి, చక్రతీర్ధ స్నానం, రాత్రి 9గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 9న ఉదయం 10 గంటలకు స్వామివారి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.