తెలంగాణ

వాసవీ కళాశాల యజమానులు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, మార్చి 3: విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి సుమారు 250 మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న వాసవీ కళాశాల నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సిపి మహేశ్ భగత్ తెలిపారు. వనస్థలిపురం వాసవీ జూనియర్ కళాశాలకు చెందిన వై. ఆత్మజ్యోతి అనే విద్యార్థి తాము ఫీజులు చెల్లించినా ఇంటర్ బోర్డుకు చెల్లించకపోవడంతో తమకు హాల్ టికెట్లు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని సిపి చెప్పారు. సరూర్‌నగర్‌లోని హిస్మత్‌పురానికి చెందిన వెంకటాపురం శీనయ్య (34) (కళాశాల ప్రిన్సిపాల్), వనస్థలిపురానికి చెందిన బండా శ్యాంసుందర్ రెడ్డి (38) (్భగస్వామి), అదే ప్రాంతానికి చెందిన కపిల్ గౌడ్ (30) కలసి వనస్థలిపురంలో వాసవీ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారని సిపి చెప్పారు. ఇంటర్ బోర్డునుండి ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికి కళాశాలను నిర్వహించారని వివరించారు. 140 మంది మొదటి సంవత్సరం, 106 మంది రెండో సంవత్సరం విద్యార్థుల నుండి 9వేలు కళాశాల ఫీజు, 3500 రూపాయలు పరీక్ష ఫీజుగా వసూలు చేశారని తెలిపారు. అనంతరం ఆ డబ్బును ఇంటర్ బోర్డుకు చెల్లించకపోవడం వలన అధికారులు పరీక్షలకు అనుమతి ఇవ్వలేదని సిపి వెల్లడించారు. 2015-16 సంవత్సరంలో సూర్యాపేటలో వరుణ్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి అనంతరం, ఈ ఏడాది వనస్థలిపురానికి మార్చారని సిపి వెల్లడించారు. కళాశాల ఏర్పాటు సమయంలో అదే భవనంలో గతంలో నడిచిన శ్రీమేధా కళాశాలకు చెందిన రెండోసంవత్సరం విద్యార్థులు 106 మందిని కూడా వీరు తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు పోలీసుల తోపాటు విద్యాశాఖ మంత్రికి, ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. గతంలో కళాశాలను సూర్యాపేటలో నిర్వహించినపుడు కూడా విద్యార్థులను మోసం చేయడం జరిగిందని అప్పుడు కాలేజీపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు కాలేదని తెలిపారు. ఇందులో ఇంటర్ బోర్డులో కొందరు సిబ్బంది సహకారం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్స్ కూడా నిర్వహించలేదని ఆ సమయంలోనైనా ఫిర్యాదు చేయక పోవడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. విద్యార్థులు కూడా అసలు చదువుతున్నారా, లేక వన్ సిటింగ్ తరహా క్లాసులు నిర్వహిస్తున్నారా తెలుసుకోవలసి ఉందని చెప్పారు. కేసును లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని దోషులు ఎవరినీ వదిలి పెట్టమని మహేశ్ హెచ్చరించారు. ఈ కేసులో శీనయ్య, శ్యాంసుందర్‌రెడ్డిలను అరెస్టు చేయడం జరిగిందని, కపిల్ గౌడ్ పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు.

చిత్రం.. విద్యార్థులను మోసం చేసిన వాసవీ కళాశాల నిర్వాహకులను అరెస్టు చేసి
విలేఖరుల ముందు ప్రవేశపెట్టిన పోలీసులు