తెలంగాణ

డిఎఫ్‌ఆర్‌సికి చట్టబద్ధత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నిర్ధారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డిఎఫ్‌ఆర్‌సికి చట్టబద్ధత కల్పించాలని తీర్మానించింది. కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ టి తిరుపతిరావు అధ్యక్షతన సమావేశం మంగళవారం నాడు జరిగింది. ఫీజుల నియంత్రణ జరగాల్సిందేనని కమిటీ అభిప్రాయపడింది. పాఠశాల విద్య సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కన్వీనర్ జి కిషన్, తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు. నాలుగు గంటల పాటు జరిగిన చర్చలో కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరగా, మరికొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముసాయిదా జీవోలో ప్రతిపాదించిన జిల్లా ఫీ రెగ్యులేషన్ కమిటీ ( డిఎఫ్‌ఆర్సీ)కి చట్టబద్ధ హోదా కల్పించాలని తీర్మానించారు. ఫీజుల నిర్ధారణకు డైరెక్టర్ చేసిన ప్రాతిపదికలను పేరెంట్స్ అసోసియేషన్ బలపరచగా, రెండు యాజమాన్య సంఘాలు వ్యతిరేకించాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రైవేటు స్కూళ్ల ప్రకటనలను నిషేధించాలని, కరపత్రాలు పంచుకోవచ్చని, యూజర్ చార్జీలు కేవలం ఆప్షనల్‌గా మాత్రమే ఉండాలని, 500కు మించిన ఫీజులను ఆన్‌లైన్‌లోనే లేదా బ్యాంకు ద్వారా మాత్రమే చెల్లించేలా ఉండాలని కూడా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలని, ఆయా స్కూళ్లలోని విద్యార్థులను దగ్గరలోని స్కూళ్లలోనే చేర్పించాలని, గతంలో మాదిరే విద్యాసంవత్సరం జూన్ 12 నుండే ప్రారంభం కావాలని కమిటీ అభిప్రాయపడింది. మిగిలిన అంశాలపై చర్చకు తిరిగి ఈ నెల ఆరోతేదీన మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. సమావేశంలో ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా ఒకసారి నిర్ణయించిన ఫీజులు మూడేళ్ల వరకూ తిరిగి పెంచడానికి వీలు లేదని, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏ పాఠశాల కూడా డొనేషన్లను వసూలు చేయరాదని, శిశు(నర్సరీ) తరగతులు నిర్వహించే పాఠశాలలకూ ఈ నిబంధనలను వర్తింపచేయాలని నిర్ణయించారు. దరఖాస్తు రుసుం వంద రూపాయిలు, రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయిలు, వడ్డీ లేకుండా తిరిగి ఇచ్చే కాషన్ డిపాజిట్ 5వేల కంటే దాటరాదని, ఒకసారి వసూలు కింద ఇతర ఫీజులు ఏవీ తీసుకోరాదని, ట్యూషన్ ఫీజులను, ఉపాధ్యాయులకు ఇతర సిబ్బందికి చెల్లించే వేతనాలు ఇతర ప్రయోజనాలు, సంస్థ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, రోజువారీ ఖర్చు, వౌలిక వసతులు ఇతర అంశాలను ఆధారంగా ఖరారు చేయాలని, ట్యూషన్ ఫీజును మూడు వాయిదాలకు తగ్గకుండా వసూలు చేసుకోవచ్చని, విద్యా విద్యేతర కార్యక్రమాలకు కాషన్ డిపాజిట్లకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు నిర్వహించాలని, ఒక స్కూలుకు మించి ఉంటే ప్రతి స్కూలుకు ఒక ఖాతా నిర్వహించాలని , ఒక బ్రాంచి ఆదాయం మరో స్కూలుకు బదిలీ చేయడానికి వీలు లేదని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. సిబ్బందికి ఇచ్చే వేతనాలు, ఇతర ప్రయోజనాలను ఖర్చు కింద తీసుకున్నపుడు ఆధార్ కార్డు నెంబర్ వినియోగించడం తప్పనిసరి చేయాలని, అలాగే తప్పనిసరి బ్యాంకులు, చెక్కులు ద్వారా మాత్రమే చెల్లించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది.